మేధోమథనంతోనే పరిష్కారాలు | leaders are speak on social issues manthan samvaad | Sakshi
Sakshi News home page

మేధోమథనంతోనే పరిష్కారాలు

Published Fri, Oct 3 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

మేధోమథనంతోనే పరిష్కారాలు

మేధోమథనంతోనే పరిష్కారాలు

సామాజిక సమస్యలపై  ‘మంథన్ సంవాద్’లో నిగ్గుతేల్చిన వక్తలు

సాక్షి, హైదరాబాద్: వ్యవస్థలో మార్పులు, మహిళల హక్కుల సాధన, ప్రత్యామ్నాయ రాజకీయాలు,సామాజిక అశాంతి, నగరీకరణ సవాళ్లు, వ్యవసాయ రంగ సంక్షోభం వంటి అంశాలను ఎదుర్కొనేందుకు ప్రజలు, మేధావుల భాగస్వామ్యంతో చేపట్టే మేధోమథనంతోనే చక్కటి పరిష్కారాలు లభిస్తాయని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘మంథన్ సంవాద్’ నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటుచేసిన చర్చాగోష్టిలో  వారు పాల్గొని తమ అభిప్రాయాలను  వెల్లడించారు.
   
ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు సంధించిన ప్రశ్నలకు వక్తలు సమాధానాలిచ్చారు. సంస్థ ప్రతినిధి, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి కాకిమాధవరావు సారథ్యంలో సాగిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కల్పనా కన్నభిరాన్, ఆర్థిక సంఘ మాజీ సభ్యుడు అరుణ్‌మైరా, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్, పాత్రికేయ ప్రముఖుడు శేఖర్‌గుప్తా, నిర్మాణ రంగ నిపుణుడు కె.టి.రవీంద్రన్, పర్యావరణ ఉద్యమకారిణి వందనా శివలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సదస్సులో పలు రం గాల నిపుణులు, విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టు చందనా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ‘మంథన్ సంవాద్’లో వెల్లడైన అభిప్రాయాలు  వక్తల మాటల్లోనే ఇలా...
 
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసేందుకు యత్నాలు
దేశంలో పత్రికారంగం, ఎలక్ట్రానిక్ మీడియాకు సంకెళ్లు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ పార్టీల చేతుల్లో మీడియా ఉండడం, చెల్లింపు వార్తలు వంటివి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నాయి. 2జీ స్కాం, కామన్వెల్త్ క్రీడల్లో కుంభకోణం,రాజకీయ అవినీతి పట్ల పౌరసమాజం తీవ్ర అసంతృప్తిగా ఉంది. అవినీతి కేసులను తక్షణం పరిష్కరించడంలో న్యాయవ్యవస్థ విఫలమౌతోంది. దీంతో పౌరసమాజంలో అసంతృప్తి, సామాజిక అశాంతి పెరుగుతోంది. ఈ పరిణామం ప్రజా ఉద్యమాలకు దారితీస్తోంది. దేశరాజధానిలో జరిగిన నిర్భయ వంటి ఉదంతాలు పౌరసమాజంలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. కేసులు విచారణలో ఉన్న సమయంలో ఏళ్లుగా నిందితులు జైళ్లలో మగ్గాల్సి వస్తోంది. ఈ కోవలో ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉంటున్నారు. వ్యవస్థలో సంస్కరణల ద్వారానే దీన్ని చక్కదిద్దవచ్చు.     

- శేఖర్‌గుప్తా, ప్రముఖ పాత్రికేయుడు
 
మహిళలపై ఆగని అఘాయిత్యాలు
మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వారిపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ఒకవైపు ఏళ్లతరబడి పోరాటాలు  కొనసాగుతున్నా..మరోవైపు ఢిల్లీ ‘నిర్భయ’ లాంటి సంఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. వేధింపులు, గృహ హింస పేట్రేగిపోతోంది. వీటిని అరికట్టేందుకు, మహిళా హక్కుల సాధనకు స్త్రీలోకం నడుం బిగించాలి.

- కల్పన కన్నాభిరాన్, సామాజిక కార్యకర్త
 
విత్తనసంస్థల గుత్తాధిపత్యం నిరోధించాలి
దేశంలో వ్యవసాయర ంగాన్ని శాసిస్తున్న బడా కార్పొరేట్ విత్తన సంస్థల గుత్తాధిపత్యం నుంచి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నివారించేందుకు పటిష్ట చట్టాలు అవసరం. రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీలను అమెరికాకు దీటుగా పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. జన్యుమార్పిడి పంటల కారణంగా ఆహారంలో పోషకవిలువలు లోపించడంతోపాటు దేశీయ వ్యవసాయ రంగం కుదేలవుతోంది. సేంద్రీయ వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణ,జీవవైవిధ్య పరిరక్షణ, మానవ ఆరోగ్య పరిరక్షణ సాధ్యపడుతుందని  గుర్తెరగాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణ హననంతోపాటు రైతులకు సేద్యపు ఖర్చులు అనూహ్యంగా పెరిగి అప్పుల పాలవుతున్నారు. దేశంలో గత దశాబ్దకాలంగా సుమారు మూడు లక్షల మంది అన్నదాతల ఆత్మహత్యలకు కారణం ఇదే. విత్తనోత్పత్తిలో స్వావలంభన కోసం కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.         

- వందనా శివ, పర్యావరణ ఉద్యమకారిణి
 
భవిష్యత్తు మెట్రోలదే
2020 నాటికి దేశంలో పట్టణాల్లో నివసించే వారి సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుంది. ఇంత పెద్ద జనాభా రవాణా అవసరాలను తీర్చేందుకు మెట్రో రైలు వ్యవస్థలే చక్కటి పరిష్కారం. దేశంలో మిలియన్ జనాభా దాటిన 53 నగరాల్లో ఈ ప్రాజెక్టుల ఆవశ్యకత ఉంది. వాటి నిర్మాణం ఖర్చుతో కూడుకున్నదే అయినా రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆ వ్యయాన్ని పూడ్చుకోవచ్చు. స్మార్ట్‌సిటీల నిర్మాణంతో దే శంలో పట్టణీకరణ వేగవంతం అవుతోంది. వలసలు, ఉద్యోగాలు, గృహవసతి, ప్రజారవాణా, పేదలకు ఇళ్ల నిర్మాణం, ప్రజోపయోగ పనులకు అవసరమైన స్థలాల లేమి, మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, పర్యావరణ సమస్యలు, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, సుపరిపాలన, ట్రాఫిక్, పట్టణాల డిజైనింగ్ వంటి సమస్యలు సవాలుగా మారుతున్నాయి. వీటికి పరిష్కారాలను అన్వేషిస్తే ఛండీగఢ్ వంటి ప్రణాళికా బద్ధమైన నగరాలను నిర్మించడం అసాధ్యమేమీ కాదు. ఈస్ట్ చైనాలోని గిఫ్ట్‌సిటీ నమూనా పలు నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది.     

- కె.టి. రవీంద్రన్, పట్టణీకరణ నిపుణుడు
 
ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత మెరుగుపర్చాలి
ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత మెరుగుపర్చేవిధంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు రూపొందాలి.  ఈ స్థాయికి ప్రజలు ఇంకా చేరుకోలేదు. ఆ దిశవైపు ప్రయాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ విజయాలపై వర్తమాన రాజకీయ ప్రభావం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ ఎజెండా కొంత మేరకు విజయం సాధించినా.. పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇప్పటి వరకూ లేవు. ఢిల్లీలో ప్రత్యామ్నాయ రాజకీయాలు బలమైన శక్తిగా ఎదిగినప్పటికీ  సవాళ్లు తట్టుకోక తప్పలేదు. ఎన్నికల్లో విజయం సాధించినా.. దానిని నిలబెట్టుకోవడమే బలమైన పరీక్ష.  ప్రజలకుజవాబుదారీతనంగా సేవలు అందించాలి.

- యోగేంద్ర యాదవ్, రాజకీయ విశ్లేషకుడు
 
వ్యవస్థీకృత మార్పు అవసరం
దేశంలో అన్ని రంగాల్లో వ్యవస్థీకృత మార్పులు అత్యావశ్యకం. ప్రణాళికా సంఘాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ఇదే విషయాన్ని గత యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని స్పష్టం చేశారు. గత ముప్పైఏళ్ల కిందట కొన్ని అంశాలు అవినీతిమయంగా కనిపించక పోయినా వ్యవస్థలో మార్పుతో అవినీతి మయంగా మారినట్లు బహిర్గతమవుతోంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల మాదిరిగా రాజకీయ నాయకులకు శిక్షణ సాధ్యం కాదు. వారికి ఎలాంటి అర్హతను గీటురాయిగా పెట్టలేం. ప్లానింగ్ కమిషన్ ప్రజా ప్రణాళిక రూపొందించే సమయంలో వారికి చేరువకావడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగినా అది  సాధ్యం కావడం లేదు. ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ప్రజలతో చర్చించినా.. నిజమైన ప్రజాభిప్రాయం మాత్రం ప్లానింగ్ కమిషన్‌కు అందడం లేదు. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ వ్యవస్థ రెండు మాత్రం ఒకదానితో మరోదానికి పొసగడం లేదు.

- ఆరుణ్‌మైరా, ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement