ఆ గొంతుకలను విందాం! | womens reservations is required for a change | Sakshi
Sakshi News home page

ఆ గొంతుకలను విందాం!

Published Fri, Mar 10 2017 1:47 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

ఆ గొంతుకలను విందాం! - Sakshi

ఆ గొంతుకలను విందాం!

మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చట్టపరమైన అనివార్యత కూడా అవసరమే. ఈ దృష్టితోనే 1996లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రధానమంత్రిని ఒక ప్రశ్న అడగాలని తప్పక ఆశిస్తారు–ఎవరి సలహా ఆశించకుండా ఒక్క దెబ్బతో పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని 21 ఏళ్ల క్రితం ప్రముఖ పార్టీలన్నింటి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ ప్రతిపాదనను అమలులోకి తెచ్చే సాహసం చేయగలరా అన్నదే ఆ ప్రశ్న.

ఈ సందర్భాన్ని యాదృచ్ఛికమని అందామా లేక మరేదైనా సంకేతమా?  మొన్న, అంటే మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినం. సరిగ్గా ఈరోజే ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ యాదృచ్ఛికత మనల్ని రాజకీయాల్లో మహిళల స్థితిగతుల గురించి ఆలోచించేలా చేస్తుంది.

నానాటికీ తీసికట్టు
మొట్టమొదటగా చెప్పాలంటే వారి పరిస్థితి ఏమంత బాగా లేదు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మొత్తం 4,823 మంది అభ్యర్థులు పోటీకి నిలబడగా వారిలో మహిళల సంఖ్య 445 మాత్రమే. అంటే కేవలం 9 శాతం. వెనుకబాటుతనం మూలంగా ఉత్తరప్రదేశ్‌లో ఇలా ఉందేమో అని మీరనుకుంటే, పంజాబ్‌ను తీసుకోండి. ఆ రాష్ట్రంలో పోటీకి నిలబడ్డ మొత్తం 1,145 మంది అభ్యర్థులలో 81 మంది, అంటే 7 శాతం మాత్రమే మహిళలు. ఇది అక్షరాస్యతతో ముడి వడిన సమస్య కూడా కాదు. ఎందుకంటే అక్షరాస్యతలో ఈ ఐదింటి కన్నా ముందున్న రాష్ట్రం గోవా. కానీ అక్కడ కూడా ఎన్నికల బరిలోకి దిగిన 251 మంది అభ్యర్థులలో 18 మంది, అంటే 7 శాతం మాత్రమే మహిళలు. రాజకీయ ఉద్యమాల్లో మహిళ భాగస్వామ్యానికి పేరుగాంచిన ఉత్తరాఖండ్‌లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేకపోవడం అంతకన్నా ఆందోళన కలిగించే విషయం.

ఆ రాష్ట్రంలో 637 మంది అభ్యర్థులలో మహిళా అభ్యర్థులు కేవలం 56 మందే. అంటే 9 శాతం కన్నా తక్కువే. ఇంకా ఘోరమైన విష యమేమిటంటే, మహిళల నాయకత్వంలో సాగే మణిపురీ సమాజం ఈ విష యంలో మిగతా అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడి పోవడం. అక్కడి మహిళలు ఆస్తులకు యజమానులు. మార్కెట్లు నిర్వహిస్తారు. అఫ్స్‌పా వ్యతిరేక ఉద్య మంలోనూ వారిదే ముందు వరుస. కానీ మణిపూర్‌లో ఎన్నికల గోదాలోకి దిగిన 265 మంది అభ్యర్థులలో 11 మంది, అంటే 4 శాతం మాత్రమే మహి ళలు. ఇటు మాయావతి నాయకత్వం ఫలితంగానైనా ఉత్తరప్రదేశ్‌లో మహిళల భాగస్వామ్యంలో పెంపుదల జరగలేదు, అటు ఇరోం షర్మిలా ఎన్నికలలో అడుగుపెట్టినందుకైనా మణిపూర్‌లో మార్పు రాలేదు.

ఇది ఆ ఐదు రాష్ట్రాల సమస్య కాదు
రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం అనేది కేవలం ఈ 5 రాష్ట్రాలకో లేదా ఒక్క అభ్యర్థిత్వానికో మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అన్ని రాష్ట్రాలలోనూ మహిళా అభ్యర్థుల నిష్పత్తి దాదాపు ఇదే స్థాయిలో ఉంది. అభ్యర్థులలో మహిళల సంఖ్య ఏ మేరకు తక్కువగా ఉంటుందో, చివరకు ఎన్నికయ్యే ప్రతినిధులలోనూ వారి నిష్పత్తి అదే స్థాయిలో ఉంటుంది. అయితే పురుషులతో పోలిస్తే మహిళా అభ్యర్థులు విజయం సాధించే రేటు కాస్త ఎక్కువ కాబట్టి విధానసభ, లోక్‌సభల్లో వారి నిష్పత్తి వారికి లభించే అభ్యర్థిత్వం కన్నా కాస్త ఎక్కువే ఉంది. ప్రస్తుతం దేశంలోని అసెంబ్లీలన్నింటిలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో మహిళలు 9 శాతం ఉన్నారు. లోక్‌సభలో 12 శాతం మహిళా సభ్యులున్నారు.

గడచిన ఇరవై ఏళ్లలో ఈ నిష్పత్తిలో కాస్త మెరుగుదల ఉన్నప్పటికీ మొత్తంగా చూసినపుడు పరిస్థితిలో పెద్ద మార్పు లేదనే చెప్పాలి. ఇరవై ఏళ్లుగా పంచాయితీ, ముని సిపల్‌ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్‌ లభిస్తుండడం వల్ల వారి ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ దీని ప్రభావం విధానసభలలో తగినంత లేదు. కింది స్థాయిలో మహిళా నాయకత్వం రూపొందుతోంది. ఎన్నికల్లో మహిళలు పురు షులతో సమానంగా ఓట్లు వేస్తున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలూ ఇప్ప టికీ పురుషుల గుప్పిట్లోనే ఉన్నాయి. అసలు సమస్యేమిటంటే రాజకీయ పార్టీ లేవీ మహిళలకు టిక్కెట్లు ఇవ్వడానికి సుముఖంగా లేవు.

అసలు వాస్తవాలు వేరు
వాస్తవానికి కనిపిస్తున్న ఈ అంకెలకన్నా మహిళల గొంతులు మరీ బల హీనంగా ఉన్నాయి. మహిళా అభ్యర్థులలో, చట్టసభలకు ఎన్నికైన మహిళ లలో ఒక పెద్ద భాగం పలుకుబడి గల రాజకీయ కుటుంబాలకు చెందిన కూతుళ్లదీ, కోడళ్లదీ. వీరికి స్వతంత్రమైన అస్తిత్వం అంటూ ఉండదు. ఏదో ఒక అనివార్య పరిస్థితిలో సదరు కుటుంబం పురుషుడికి బదులుగా మహిళను ముందుకు తీసుకొచ్చి ఎన్నికలలో నిలబెడుతుంది. అయితే ఆ మహిళ పురుషుల అదుపాజ్ఞలలోనే పని చేస్తుంది. ఈ మహిళా ప్రతినిధులకు మహిళా సమస్యలతో గానీ, మహిళా ఉద్యమాలతో గానీ ఎలాంటి సంబంధం ఉండదు. అట్లాగే చట్టసభలకు ఎన్నికయ్యే మహిళలకు మంత్రివర్గాల్లో స్థానం లభించడం కూడా అంతంత మాత్రమే. ఇకపోతే మహిళలు మహిళా లేదా బాల సంక్షేమ శాఖలకు మాత్రమే మంత్రులుగా ఉంటారు తప్ప హోంశాఖ, ఆర్థిక శాఖ వంటి శక్తిమంతమైన మంత్రిత్వశాఖలు వారికి నేటికీ అందని ద్రాక్షలుగానే ఉన్నాయి.

ఈ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ రికార్డు చాలా అధ్వానంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటులకు ఎన్నికైన మహిళా సభ్యుల అంతర్జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ఉత్తర యూరప్‌ లోని స్కాండినేవియన్‌ దేశాలలో మహిళా పార్లమెంటేరియన్ల శాతం 40 కన్నా ఎక్కువగా ఉంది. బొలీవియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో కూడా వీరి శాతం 40 దాటింది. ఆఖరుకు మన పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో సైతం మహిళా ఎంపీల సంఖ్య 20 శాతంకన్నా ఎక్కువగా ఉంది. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, మహిళా ప్రాతినిధ్యం అనే అద్దంలో భారత ప్రజాస్వామ్యపు కురూపితనం స్పష్టంగానే కళ్లకు కడుతుంది.

ప్రజాస్వామ్యాన్ని కుదుపుతున్న వివక్ష
మన చట్టసభలలో మహిళల గొంతు బలహీనంగా ఉండడం వల్ల దాని ప్రభావం కేవలం మహిళల పైనే కాకుండా మొత్తం ప్రజాస్వామ్యం పైనే పడు తోంది. ఎక్కువ మంది మహిళలు ఎన్నికైనంత మాత్రాన మన పార్లమెంటు, అసెంబ్లీలు ఎకాయెకిన గౌరవప్రదంగా, నిజాయితీకి నిలువుటద్దంలా మారి పోకపోవచ్చు కానీ, వారి ఉనికి వల్ల కొంత ప్రభావమైతే తప్పక పడుతుంది. పార్లమెంటు, విధానసభల సభ్యులు మహిళలు అయినప్పుడు మహిళలపై నిత్యం జరిగే హింస, లైంగిక వేధింపుల కేసుల విషయంలో పోలీసులపై, అధికారులపై తప్పక కొంత ఒత్తిడి పనిచేస్తుంది. కనీసం అధికార కారిడార్లలో ఊడలు దిగిన మగ పెత్తనం కొంతైనా తగ్గుతుంది.

మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట్లలో రేషన్‌ కొరత, నీటి కొరత లేదా మద్యపానం పెచ్చ రిల్లడం వంటి అంశాలపై చర్చ తప్పకుండా జరుగుతుంది. మరేది జరగక పోయినా, కనీసం సాధారణ మహిళలలో తాము తమ సమస్యను ఎంపీ, ఎమ్మెల్యే లేదా అధికారి దృష్టికి తీసుకెళ్లగలమనే ధైర్యమయితే పెరుగుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే, పార్లమెంటు, విధానసభల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య పెరిగేదెలా? ఇందుకోసం రాజకీయాల స్వభావ స్వరూ పాల్లో మార్పు రావాలన్నది తేటతెల్లం. నేతల సంస్కారంలో, పార్టీల సంస్కృ తిలో మార్పు రావాలి. అయితే ప్రపంచ దేశాల అనుభవాలను బట్టి చూస్తే ఇది మాత్రమే సరిపోదు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును తేవాల్సిందే
మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చట్టపరమైన అనివార్యత కూడా అవసరమే. ఈ దృష్టితోనే 1996లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభ, విధానసభలలో 33 శాతం సీట్లు మహి ళలకు కేటాయించాలనే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అయితే ఈ బిల్లులో కొన్ని లోపాలున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం నేను కూడా ఈ లోపాలను ఎత్తి చూపుతూ రాశాను. వాటిని సవరించాలని డిమాండ్‌ చేశాను. అయితే గడచిన 21 ఏళ్లలో ఈ దిశగా జరిగిన ప్రగతి శూన్యం. ఈ బిల్లు ఎప్పుడు పార్లమెంటు ముందుకు వచ్చినా ఏదో ఒక నాటకానికి తెరలేపి లేదా ఏదో ఒక సాకు చెప్పి దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అనేక చర్చోపచర్చల తర్వాత 2010లో దీనిని రాజ్యసభలో ఆమోదించారు. కానీ ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇది లోక్‌ సభలో చర్చకు నోచుకోలేదు. చివరకు లోక్‌సభ కాలవ్యవధి పూర్తి కావడంతో బిల్లు రద్దయిపోయింది.

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలు ప్రధాన మంత్రిని ఒక ప్రశ్న అడగాలని తప్పక ఆశిస్తారు–ఎవరి సలహా ఆశించకుండా ఒక్క దెబ్బతో పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని 21 ఏళ్ల క్రితం ప్రముఖ పార్టీలన్నింటి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ ప్రతిపాదనను అమలులోకి తెచ్చే సాహసం చేయగలరా అన్నదే ఆ ప్రశ్న.


యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
మొబైల్‌ : 98688 88986 , Twitter : @_YogendraYadav

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement