
సాక్షి, కడప : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. యురేనియం ప్లాంట్ సమస్యను ఆయన తన లేఖలో పేర్కొన్నారు. టైల్‌పాండ్ వ‍్యర్థాల వల్ల ఏడు గ్రామాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, పంటలు, పశు సంపద దెబ్బతింటోదని, సాధ్యమైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని వైవీ అవినాష్ రెడ్డి తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాగా జిల్లాలోని వేముల మండలం మబ్బుచింతలపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటైన యురేనియం శుద్ధికర్మాగారం వ్యర్థాల వల్ల వేముల మండలంలోని ఏడు గ్రామాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కెవి కొట్టాలు, కనంపల్లి, మబ్చుచింతలపల్లి, భూమయ్యగారిపల్లితో పాటు మరో గ్రామంలో పంటలకు, మనుషులకు తీవ్ర నష్టం కలిగే పరిణామాలు క్రమక్రమంగా అధికం అవుతున్న విషయం తెలిసిందే.