హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. యురేనియం పేరిట కొందరు వ్యక్తులు టోకరా వేశారు. పిడుగు పడినప్పుడు తమ వద్ద ఉన్న పాత్రలో చుట్టుప్రక్కల ఉన్న యురేనియం అంతా చేరుతుందని ప్రచారం చేశారు. యురేనియానికి వెలకట్టలేని ధర పలుకుతుందని ప్రచారం చేశారు. ఇది సూరి హత్య కేసులోని ప్రధాన నిందితుడు భాను కిరణ్ ముఠా పనిగా అనుమానిస్తున్నారు. 18 మంది ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. భాను కిరణ్ జైల్లో ఉండే చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు ముఠా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. బెంగుళూరులో కోహ్లీ అనే వ్యక్తి అక్కడి నుంచే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా తెలియవచ్చింది.
తమ వద్ద ఒక అక్షయలాంటి పాత్ర ఉందని, పిడుగు పడినప్రదేశంలో ఆ పాత్ర ఉంచితే చుట్టుప్రక్కల ఉన్న యురేనియాన్ని ఆ పాత్ర ఆకర్షిత్తుందని, దానిని అమ్ముకుంటే రూ. కోట్లు వస్తాయని చెప్పి వారు ప్రచారం చేస్తున్నారని, వీరి వలలో చాలా మంది వీఐపీలు పడినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి జైల్లో ఉన్న భానుకిరణ్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా సీఐడీ పోలీసులు గుర్తించారు. 15 రోజుల క్రితం యురేనియం విషయంలో మోసపోయిన ఓ ఎన్నారై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన దీనిని సీఐడీ అధికారులకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు గురువారం బెంగెళూరులో కోహ్లీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నది తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు.
అక్షయపాత్ర అంటూ ఘరానా మోసం
Published Fri, Jun 24 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement