సాక్షి,కర్నూలు: జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. యురేనియం తవ్వకాలపై స్థానిక గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఐఏఎస్ అధికారులు తిరిగి వెనక్కి వెళ్లారు. పురుగు మందు డబ్బాలు.. పెట్రోలు సీసాలతో రాస్తా రోకోలతో ప్రజల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశం నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.
మరోవైపు, దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్‌లో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల ప్రభావం 100 కిలోమీటర్ల మేర ప్రభావం ఉంటుందనే ప్రచారంతో దేవనకొండ మండలంతో పాటు పత్తికొండ మండల పరిసర ప్రాంతాల ప్రజలు సైతం ఆందోళన చేపట్టారు. కప్పట్రాళ్ల, కోటకొండ, పల్దొడ్డి గ్రామాల రైతులు సైతం యురేనియం తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అయితే ఇవాళ యురేనియం తవ్వకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కర్నూలు-బళ్లారి రహదారిలో బైఠాయించారు. కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, ప్రజల ఆందోళనతో యురేనియం తవ్వకాల పనులను అధికారులు నిలిపివేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment