uranium mining
-
యురేనియం.. ఆందోళన ఉగ్రరూపం
కర్నూలు(సెంట్రల్): కర్నూలు కలెక్టరేట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు పోలీసుల అడ్డగింపు..మరోవైపు యురేనియం బాధిత గ్రామాల ప్రజల ఆందోళనతో అట్టుడికింది. దేనకొండ మండలం కప్పట్రాళ్ల పరిసరాల్లో ఎలాంటి యురేనియం తవ్వకాలు చేపట్టబోమని కలెక్టర్ వచ్చి ప్రకటన చేయాలని 15 గ్రామాల ప్రజలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ గ్రామాలను పరిరక్షించాలని, తాము నమ్ముకొని ఉన్న భూములు, ఇళ్ల సమీపంలో యురేనియం తవ్వకాలు చేపడితే తమ గతి ఏమిటని, వచ్చే రోగాలకు బాధితులెవరని, పంటలు పండే భూములు బీడుగా మారితే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తూ 5 గంటల పాటు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనను విరమించలేదు.తమకు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే కలెక్టర్ తనకు బదులుగా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను మొదట పంపారు. ఆమె కలెక్టర్ తరపున వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వారు ఒప్పుకోలేదు. కలెక్టరే రావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు కలెక్టర్‌కు బదులుగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆందోళనకారుల దగ్గరకు వచ్చారు. అందరూ ఏక కంఠంతో యురేనియం తవ్వకాలు ఆపాలని నినదించారు.తమ గ్రామాలను కాపాడాలని అభ్యరి్థంచారు. యురేనియం తవ్వకాలు చేపడితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని, అధికారులే తమకు న్యాయం చేయాలని కోరడంతో జేసీ స్పందిస్తూ...ప్రస్తుతానికి ఆందోళన అక్కర్లేదని, కేంద్ర పర్యావరణ అనుమతులు రాలేదని, అప్పటివరకు యురేనియం తవ్వకాల నిర్థారణ కోసం గాని, యురేనియం తవ్వకాలు కాని చేపట్టబోమని చెప్పారు. అయితే అనుమతులు రాగానే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారని, అప్పుడు అభ్యంతరాలను ప్రజలు తెలుపవచ్చని సూచించారు.జేసీ ప్రసంగానికి అడ్డంకులుజేసీ డాక్టర్ నవ్య ప్రసంగానికి కొందరు యువకులు అడ్డు తగిలారు. తాము అసలు యురేనియం తవ్వకాలపై ఎలాంటి ముందడుగు వేయడానికి వీలు లేదంటే అనుమతులు వచి్చన తరువాత గ్రామసభలు పెడతామని ఎలా మాట్లాడుతారని జేసీని ప్రశి్నంచారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారిని వారించారు. మరోవైపు ఆందోళనలో చురుగ్గా ఉన్న యువకుల వివరాలను పోలీసులు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా ముందుగా జాగ్రత్తగా తీసుకొని ఉంటారని ఆమె వివరించారు. మొత్తంగా జేసీ వివరణతో తరువాత కప్పట్రాళ్ల చుట్టుపక్కల యురేనియం తవ్వకాలు చేపడతారని స్పష్టంగా అర్థమైపోయింది. కాగా, ప్రజలు ఎంత కోరినా కలెక్టర్ మాత్రం బయటకు రాకపోవడంతో గమనార్హం. ఆందోళనకు సీపీఎం నేతలు జి.రామకృష్ణ, పి.నిర్మల, పీఎస్ రాధాకృష్ణ, వీరశేఖర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల, కోటకొండ, బేతపల్లి, నెల్లిబండ, గుడిమిరాళ్ల, బంటుపళ్లి, గుండ్లకొండ తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో రోడ్డుపై బైఠాయింపు
-
మళ్లీ మండుతున్న యురేనియం
కప్పట్రాళ్ల.. మొన్నటి వరకూ ఫ్యాక్షన్ భయంతో ఉలిక్కిపడిన ఊరు. ఇప్పుడీ ఊరుతో పాటు మరో 15 గ్రామాలు యురేనియం పేరు వింటే హడలిపోతున్నాయి. రేడియో ధార్మిక మూలకమైన యురేనియం మైనింగ్ జరిపితే తమ పొలాలు నిర్జీవమవుతాయని, ఆరోగ్యాలు గుల్ల అవుతాయని.. పీల్చేగాలి, తాగేనీరు, తినే తిండి అంతా కలుషితమై జీవితం దుర్భరమవుతుందని ఇక్కడి వారంతా ఆందోళన చెందుతున్నారు. యురేనియం తవ్వకాలు తమ ప్రాంతంలో జరిపేందుకు వీల్లేదని కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కర్నూలు: అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) కేంద్ర ప్రభుత్వ సంస్థ. దేశంలో అణు, రేడియో ధార్మిక ఖనిజ నిక్షేపాలను ఏఎండీ అన్వేషించి, పరిశోధనలు జరిపి మైనింగ్ చేపడుతుంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల సమీపంలోని 15 గ్రామాల్లో యురేనియం నిల్వలున్నట్లు ఏఎండీ గ్రహించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో వీటి నిల్వలపై పరిశోధనలు జరిపేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ రీజినల్ ఆఫీసుకు రెండు దఫాలుగా అనుమతులిచ్చింది. అప్పట్లో 20 బోర్లు వేశారు. మట్టి నమూనాలూ సేకరించారు. అనంతరం ఎక్కడా యురేనియం ప్రస్తావనలేదు. ఆ తర్వాత విజయవాడలోని కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఉప కార్యాలయం మరోసారి 50 మీటర్ల వరకూ 68 బోర్లు తవ్వేందుకు 2023 జూన్ 26న అనుమతులిచ్చింది. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులోని 1,170.65 ఎకరాల్లో బోర్లువేసి యురేనియం ఖనిజం నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసి నమూనాలు సేకరించేందుకు ఏఎండీ ఫేజ్–1కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అప్పుడు, ఇప్పుడు టీడీపీ పాలనలోనేనిజానికి.. కర్నూలు జిల్లాలో యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా 2019 అక్టోబరులో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. యురేనియం తవ్వకాలతో ప్రజలకు, రైతులకు సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపించారు. కానీ, 2017లో తవ్వకాలకు అనుమతులిచ్చింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు కేంద్రంలో టీడీపీ భాగస్వామి కూడా. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ప్రజలు 10 రోజులుగా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నప్పుడు ఎందుకు కూటమి నేతలు మాట్లాడటంలేదని ప్రజలు ప్రశి్నస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రెండో విడత అనుమతులపై ఆందోళనఇప్పుడు తాజాగా రెండో విడత కింద 68 బోర్లకు అనుమతులివ్వడం, 50 మీటర్ల వరకూ తవ్వకాలు జరపడంతో ఇక్కడ యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే రెండో దఫాలో 15 గ్రామాల పరిధిలో బోర్లకు తవ్వకాలు జరుపుతున్నారని ప్రజల్లో భయం మొదలైంది. దీంతో.. కప్పట్రాళ్లతో పాటు దేవనకొండ మండలంలోని పి. కోటకొండ, జిల్లేడు, గుండ్లకొండ, దుప్పనగుర్తి, బంటుపల్లి, ఈదులదేవరబండ, నెల్లిబండ, మాదాపురం, నేలతలమరి, చెల్లెల చెలిమల, బేతపల్లితో పాటు పలు గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. ఫ్యాక్షన్ దెబ్బకు అభివృద్ధికి నోచుకోకుండా దెబ్బతిన్న కప్పట్రాళ్ల, పి. కోటకొండ, ఈదులదేవరబండతో పాటు సమీప గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయని ఈ క్రమంలో తవ్వకాలు సరికాదనే నిర్ణయానికి వచ్చారు. చీని, మిర్చి, పత్తితో పాటు మంచి వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగుచేస్తూ ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతూ, పిల్లలను మంచి చదువులు చదివించుకుంటున్నామని ఇప్పుడు యురేనియం తవ్వకాలు జరిపితే పంటలు పండకపోవడంతో పాటు గ్రామాలను వదిలివెళ్లాల్సి ఉంటుందని.. లేదంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందనే భావన వారిలో ఏర్పడింది. దీంతో 10 రోజులుగా ఆందోళనకు దిగుతున్నారు. కప్పట్రాళ్లతో పాటు కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో దేవనకొండలో భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తవ్వకాలు జరిపితే ఆత్మహత్యలకు తెగిస్తామని కూడా తేల్చిచెప్పారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో.. తవ్వకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించిన తర్వాతే పనులు చేయాలని, అంతవరకూ తవ్వకాలు జరపొద్దని కలెక్టర్ రంజిత్ బాషా ఏఎండీని ఆదేశించారు.ప్రాణాలు పోయినా లెక్కచేయంయురేనియం తవ్వకాలు జరిపితే మా ఊళ్లు, బతుకులు ఛిద్రమవుతాయి. గతంలో బోర్లు వేశారు. మళ్లీ ఇప్పుడు వేస్తామంటున్నారు. ఆర్డీఓ యురేనియం తవ్వకాలు జరగవంటున్నారు. మరి బోర్లు వేయడం ఎందుకు? తవ్వకాలు జరపబోమని కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేదాకా ఆందోళన చేస్తాం. మా ప్రాణాలు పోయినా లెక్కచేసేది లేదు. – నాగరాజు, దుబ్బనుగుర్తి ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం.. మా కప్పట్రాళ్ల పేరు వింటే నరుక్కోవడాలు, సంపుకోవడాలే! ఎస్పీ రవికృష్ణ దేవుడిలా వచ్చి మా ఊరు దత్తత తీసుకుని ఊరినే మార్చాడు. బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటూ సంతోషంగా బతుకుతాండాం. ఇప్పుడు యురేనియం తవ్వకాలంటూ భయపడెతాండారు. తవ్వకాలు మొదలైతే ఊళ్లు వదిలి వెళ్లాలంటున్నారు. ఊరు వదిలే సమస్యేలేదు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం. – సుంకులమ్మ, కప్పట్రాళ్ల గ్రామం ఈదుల దేవరబండలో రాస్తారోకో..కర్నూలు(అర్బన్): యురేనియం నిక్షేపాల వెలికితీతను ఆపాలని సోమవారం దేవనకొండ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈదుల దేవరబండ గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి వచ్చిన డీఎస్పీ వెంకట్రామయ్య మాట్లాడుతూ ‘ఈనెల 4న సమావేశం నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలనుకున్నాం. ఈలోపు రోడ్డెక్కారు.. సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కావొచ్చు ప్రజలు అపోహ పడేలా చేశారు. వాటిని పోగొట్టే బాధ్యత మాపై ఉందన్నారు.బాబు హయాంలోనే అనుమతిఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో ఎక్కడైనా మంచి జరిగితే చంద్రబాబు ఖాతాలో వేయడం, చెడు జరిగితే మాత్రం వైఎస్ జగన్‌పై నెట్టడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చారని మంత్రి రామానాయుడు చెప్పడాన్ని విరూపాక్షి తీవ్రంగా ఖండించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2017లోనే మొదటిసారి కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల గుర్తింపునకు డ్రిల్లింగ్ కోసం 27 బోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో జారీ చేశారని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2019 నుంచి ఐదేళ్లపాటు యురేనియం నిక్షేపాల గుర్తింపు, తవ్వకాల కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ యురేనియం నిక్షేపాల గుర్తింపు కోసం 68 బోర్లు వేయడానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. యురేనియం నిక్షేపాలను గుర్తించి తవ్వకాలు చేపడితే తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందన్న భయంతోనే దేవనకొండ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారని తెలిపారు. -
యురేనియం తవ్వకాలపై ఆందోళనలు
-
పురుగు మందు డబ్బాలతో నిరసన.. కర్నూలులో యురేనియం తవ్వకాలపై ఉద్రిక్తత
సాక్షి,కర్నూలు: జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. యురేనియం తవ్వకాలపై స్థానిక గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఐఏఎస్ అధికారులు తిరిగి వెనక్కి వెళ్లారు. పురుగు మందు డబ్బాలు.. పెట్రోలు సీసాలతో రాస్తా రోకోలతో ప్రజల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశం నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.మరోవైపు, దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్‌లో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల ప్రభావం 100 కిలోమీటర్ల మేర ప్రభావం ఉంటుందనే ప్రచారంతో దేవనకొండ మండలంతో పాటు పత్తికొండ మండల పరిసర ప్రాంతాల ప్రజలు సైతం ఆందోళన చేపట్టారు. కప్పట్రాళ్ల, కోటకొండ, పల్దొడ్డి గ్రామాల రైతులు సైతం యురేనియం తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇవాళ యురేనియం తవ్వకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కర్నూలు-బళ్లారి రహదారిలో బైఠాయించారు. కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, ప్రజల ఆందోళనతో యురేనియం తవ్వకాల పనులను అధికారులు నిలిపివేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
యురేనియం వార్.. కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత
కర్నూలు, సాక్షి: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.చదవండి: రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్! -
నల్లమలలో ‘యురేనియం’ అంకానికి తెర!
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) సమర్పించిన ప్రతిపాదనలను తాజాగా రాష్ట్ర వన్యప్రాణి మండలి తిరస్కరించింది. దీంతో గత నాలుగేళ్లుగా యురేనియం సర్వేతో ముడిపడి సాగుతున్న చర్చ ముగిసినట్టయింది. సోమవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. చదవండి: యురేనియం అన్వేషణకు నో.. కేంద్ర వన్య›ప్రాణి మండలి, కేంద్ర అటవీ శాఖకు ఈ తీర్మానాన్ని పంపాలని ఈ సమావేశం నిర్ణయించింది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల వెలికితీతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ కేంద్రం గత మే నెలలో కోరింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. దీనిపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమావేశం కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమై యురేనియం సర్వే సాధ్యం కాదని పేర్కొంటూ గతంలోని ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్స్టాప్ పడింది. చదవండి: మినిట్స్ వచ్చేదాకా... వేచిచూద్దాం ఇదీ జరిగిందీ.. అటవీ ప్రాంతం, చెట్లకు నష్టం వాటిల్లకుండా యంత్రాలను వాడకుండా సర్వే నిర్వహిస్తామని ఏఎండీ సమర్పించిన ప్రతిపాదనలను 2016లో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం ఆమోదించింది. అడవికి ఎలాంటి నష్టం కలిగించరాదని, ఉన్న రోడ్లు, బండి, కాలినడక మార్గాలనే ఉపయోగించాలని, కేవలం సర్వేకే పరిమితం కావాలని, నిల్వలను వెలికి తీయొద్దని, చెట్లకు, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం కలిగించొద్దంటూ ఈ సమావేశంలో మినిట్స్‌ను రికార్డ్ చేశారు.. దీనికి భిన్నంగా గతేడాది మళ్లీ సవరించిన ప్రతిపాదనలు ఏఎండీ పంపించింది. అడవిలోపలికి భారీ యంత్రాలు, వాహనాలు తీసుకెళ్తామని, అందుకు రోడ్డు, చెట్లు, పొదలను తొలగించాలని 200, 300 మీటర్ల లోతున 4 వేల బోర్లు వేస్తామని, నల్లమల అటవీ ప్రాంత వ్యాప్తంగా ఈ బోరింగ్ పాయింట్లు ఉంటాయని, దాదాపు ఐదేళ్ల పాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతినివ్వాలంటూ ఈ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. గతంలో ఆమోదించిన ప్రతిపాదనలకు భిన్నంగా ఉన్న కొత్తగా అనుమతులివ్వలేమని, కొత్త ప్రతిపాదనలను ఫారమ్–సీలో.. అంటే ఎన్ని బోర్లు వేస్తారు, ఎలా వేస్తారు, భారీ యంత్రాలు ఎలా తీసుకెళ్తారు, చెట్లకు ఎంత నష్టం వాటిల్లుతుంది, జీవవైవిధ్యంపై ప్రభావం, దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, వివరాలు అందజేయాలని ఏఎండీకి రాష్ట్ర అటవీశాఖ సూచించింది. ఈ పరిణామాలపై ఇటు అక్కడి గిరిజనులు, పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీతకు అనుమతించబోమంటూ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫీల్డ్ డైరెక్టర్ నుంచి నివేదిక.. ఏఎండీ పంపించిన కొత్త ప్రతిపాదనలను ఏటీఆర్ పరిధిలోని ఫీల్డ్ డైరెక్టర్‌కు పంపించగా, పార్ట్–3 ఫార్మాట్లో వాటిని తిరస్కరిస్తూ అటవీశాఖకు నివేదిక అందింది. ఏటీఆర్‌లో యురేనియం నిల్వలపై సర్వే, వెలికితీత ప్రతిపాదనల పరిశీలన సాధ్యం కాదంటూ క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ పంపించింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటి వల్ల అడవికి, జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని ఈ నివేదికలో ఫీల్డ్‌డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ డ్రిల్లింగ్ వల్ల ఇక్కడి ప్రాంతం కలుషితమై ఆ నీళ్లు కృష్ణానదిలో కలసి, హైదరాబాద్‌కు సరఫరా అయ్యే నీటిలో కూడా యురేనియం కలుషితాలు చేరితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నివేదికను రాష్ట్ర వన్యప్రాణి మండలి సమక్షంలో ఉంచడంతో పాటు ఏఎండీ తాజా ప్రతిపాదనలను పరిశీలించి ఇవి ఆచరణ సాధ్యం కాదంటూ ఈ సమావేశం తిరస్కరించింది. ఏఎండీ ప్రతిపాదనలను రాష్ట్ర వన్యప్రాణి బోర్డు తిరస్కరించినందు వల్ల కేంద్ర బోర్డు కూడా దీన్ని తిరస్కరించడం లాంఛనమే కానుంది -
యురేనియం సర్వేపై మీ వైఖరేమిటి?
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం నిక్షేపాల అన్వేషణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం ని ల్వలు ఎక్కడెక్కడున్నాయన్న దానిపై సర్వే చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కోరింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమావేశం సూచించింది. గతంలో జరిగిందిదీ..: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం 200, 300 మీటర్ల లోతున అటవీ ప్రాంతవ్యాప్తంగా 4 వేల బోర్లు వేస్తామని, దాదాపు ఐదేళ్ల్లపాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతినివ్వాలంటూ గతేడాది టమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) నుంచి ప్రతి పాదనలు వచ్చాయి. గత ప్రతిపాదనలకు భిన్నంగా ఉన్న ఈ కొత్త ప్రతిపాదనలను తిరస్కరిస్తూ సంబంధిత ఫైల్‌ను జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు తాజా గా తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల వారం, పదిరోజుల క్రితమే ఈ మేరకు నివేదికను హైదరాబాద్‌లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి నివేదించినట్టు తెలుస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటివల్ల అడవికి, జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. అడవిలో ప్రతిపాదిత బోరు వేసే పాయింట్లను ఏఎండీ సాంకేతిక బృందం వచ్చి చూపిస్తే తప్ప గుర్తించలేమని, ఈ బృందాల ప్రవేశానికి కూడా స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఈ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర వన్యప్రాణి మండలి సమక్షంలో ఉంచి, ఏటీఆర్‌లో యురేనియం నిల్వలపై సర్వే, వెలికితీత సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు తెలియజేసే అవకాశముందని సమాచారం. -
యురేనియం కలకలం!
అమ్రాబాద్: నల్లమలలో మళ్లీ యురేనియం తవ్వకాల కలకలం మొదలైంది. గతేడాది మూడు నెలల పోరాటం అనంతరం నల్లమలలో యురేనియం సర్వేకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రోడ్లు, బోర్లు వేస్తూ యురేనియం తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలన అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని అడవిని, అడవిలో వేసిన రోడ్లను పరిశీలించేందుకు మంగళవారం అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ ఏకే సిన్హా, జిల్లా అటవిశాఖ అధికారి జోజీ వచ్చారు. వీరిని నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు అమ్రాబాద్ సమీపంలోని ఎల్మపల్లి స్టేజీ వద్ద వారిని అడ్డుకున్నారు. అంతకుముందు నల్లమల యురేనిం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకుడు నాసరయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా యురేనియం తవ్వకాలకు అనుమతిస్తే ఊరుకోమని నిలదీశారు. తవ్వకాలకు అనుమతులిచ్చి నల్లమలోని ప్రజలు, వన్యప్రాణులు, నదీ జలాలను నాశనం చేయొద్దని కోరారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ బీసన్న, ఎస్ఐ పోచయ్య అక్కడికి వచ్చి జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. అటవీశాఖ అధికారులతో కలిసి ముగ్గురిని పంపే ప్రయత్నం చేశారు. అటవీశాఖ అధికారులు కొద్దిసేపు అమ్రాబాద్ అటవీశాఖ కార్యాలయంలో వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు. అధికారులు ఎవరూ మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. పదిహేనుమందిపై కేసు అధికారులను అడ్డుకున్న నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకులు నాసరయ్యతో నాటు మరో పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులను అడ్డగించడం సరైంది కాదని కౌన్సెలింగ్ ఇచ్చారు. -
యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి అటామిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ)కు రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి. యురేనియం నిల్వలున్నాయో లేదో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్‌తోపాటు వెలికితీతకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని రాష్ట్ర అటవీ శాఖ స్పష్టం చేసింది. గత ఏఎండీ ప్రతిపాదనలకు పూర్తి భిన్నంగా ప్రస్తుత ప్రాజెక్టు స్వరూపం మారడం తో నల్లమలలో 4 వేల బోర్లు వేసి యురేనియం అన్వేషిస్తామంటూ ఏఎండీ పంపించిన కొత్త ప్రతి పాదనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అటవీ శాఖ స్పష్టీకరించింది. యురేని యం అన్వేషణకు 2016 డిసెంబర్లో తెలం గాణ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం ఇచ్చిన అనుమతులు, ఒప్పందాలు రద్దయినట్టుగా ఏఎండీ, కేంద్ర అటవీశాఖ, కేంద్ర వన్యప్రాణి బోర్డుకు తాజాగా లేఖల ద్వారా స్పష్టం చేసింది. కలిసొచ్చిన నిబంధనలు.. నల్లమలలో ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం లో యురేనియం అన్వేషణలో అడవికి నష్టం కలి గించేలా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదనే అటవీ నిబంధనల్లో పొందుపరచడం రాష్ట్ర అటవీ అధికారులకు కలిసొచ్చింది. అందుకు విరుద్ధంగా ఏఎండీ ప్రతిపాదిత చర్యలున్నందున గతంలో ఆమోదించిన ప్రతిపాదనలకు ఎలాంటి విలువలేకుండా పోయిందని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 2016లో జరిగిన వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో పర్యావరణవేత్తలుగా ఉన్న పలువురు సభ్యులు టైగర్ రిజర్వ్‌లో అన్వేషణకు ఎలాంటి తవ్వకాలు జరపరాదని, అందుబాటులో ఉన్న మార్గాలు, ఇతర నియమ, నిబం ధనలను మినిట్స్‌లో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2016 సమావేశంలోని నమోదు చేసిన మినిట్స్‌కు వ్యతిరేకంగా తాజా ప్రతిపాదనలున్నందున గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్టు అటవీశాఖ ప్రకటించింది. శాస్త్ర, సాంకేతికపరమైన అవసరాల కోసం యురేనియం అన్వేషణ అవసరం పడితే అది ఎలా చేస్తారు, దానికి అనుసరించే పద్ధతులు, సాంకేతికతకు సంబంధించి ఏఎండీ కొత్త ప్రతిపాదనలను స్టేట్ వైల్డ్‌లైఫ్ బోర్డుకు పంపిస్తే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఉభయసభల తీర్మానంతో.. రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసేం దుకు అనుమతివ్వబోమని కౌన్సిల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. యురేనియం నిక్షేపాల పరిశోధన, తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ ఉభయసభల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడంతో అటవీ అధికారులు తాజాగా శాఖాపరంగా తమ వైఖరి స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అటవీ శాఖ పూర్తిస్థాయిలో కట్టుబడిఉందని, డ్రిల్లింగ్ చేయకుండా యురేనియం నిక్షేపాల అన్వేషణ చేపడతామంటూ ఏఎండీ సమర్పించిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఇచ్చిన అనుమతులు కూడా రద్దయినట్టుగా లేఖ ద్వారా వెల్లడించింది. -
‘ముఖ్యమంత్రులు కాదు.. ప్రజలు శాశ్వతం’
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్టోబర్ 10 నుంచి 16 వరకు ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక అంశాలపై తీర్మానాలు చేశామని అన్నారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక దేశంలో తిరోగమనంలో వెళ్తుందని దుయ్యబట్టారు. గోదావరి నీళ్లు కృష్ణా నదిలోకి తరలించడం మంచి నిర్ణయమని.. కానీ అందరి అభిప్రాయాలను తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని చాడ వెంకట్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రులు శాశ్వతం కాదని, ప్రజలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా పని చేస్తే పతనం తప్పదని హెచ్చరించారు. యురేనియం తవ్వకాలను సీపీఎం పార్టీ వ్యతిరేకిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం తవ్వకాలకు సంబంధించిన పనులను నిలిపివేయాని పేర్కొన్నారు. యురేనియం వెలికితీత కారణంగా మానవ మనుగడకే ప్రమాదకరమని, కృష్ణా నది నీళ్లు సైతం కలుషితమవుతాయని తెలిపారు. దీనిపై పెద్ద ఎత్తున సీపీఐ ఆందోళన కార్యక్రమం చేపడుతుందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. -
‘రేవంత్... నా ముద్దుల అన్నయ్య’
సాక్షి, హైదరాబాద్ : తనకు యురేనియం విషయంలో ఏబీసీడీలు కూడా తెలియవని, పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ అవకాశం ఇవ్వనందుకే తాను టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడానంటూ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తాను చాలా బాధపడ్డానని ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్ పేర్కొన్నారు. రేవంత్ తనకు ముద్దుల అన్నయ్య అని, ఆయన మాట్లాడిన మాటలకు తాను స్పందించాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడూ భావించలేదని చెప్పారు. -
‘గతంలో అనుమతులిచ్చాం.. ఇప్పుడు వద్దంటున్నాం’
సాక్షి, హైదరాబాద్ : నల్లమలలో యురేనియం అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. రాష్ట్ర జంతు పరిరక్షణ బోర్డుతో సమావేశం ఏర్పాటు చేసి అనుమతులు వెనక్కు తీసుకోవాలని కోరారు. లేకపోతే అచ్చంపేట నుంచి ‘ఛలో ప్రగతి భవన్’ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ అధికార ప్రతినిధుల సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. యురేనియం కంటే బొగ్గు గనుల వల్ల ఎక్కువ నష్టం ఉంటుందని కిషన్‌రెడ్డి అనడం ఆయన అవగాహనారాహిత్యమన్నారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలను పిలుచుకొని తెలుసుకోవాలని కేంద్రమంత్రికి సలహా ఇచ్చారు. యురేనియం ద్వారా గాలి, నీరు కాలుష్యమవుతాయని.. అడవి, చెంచులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చామని ఒప్పుకున్న మల్లురవి, కడపలో జరుగుతున్న నష్టం చూశాక వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. యురేనియం పేరుతో తెలంగాణ ప్రజల మీద దాడి చేసినట్టవుతుందనీ, రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి మైనింగ్‌ను రద్దు చేయించాలని సూచించారు. మరోవైపు నేటి నుంచి కాంగ్రెస్ నేతలు టీవీ చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు మల్లు రవి వెల్లడించారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు టీవీ చర్చలకు దూరంగా ఉంటుండగా కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రాష్ట్ర ప్రతిపాదననే కేంద్రం అంగీకరించింది
సాక్షి, న్యూఢిల్లీ: నల్లమల అడవుల్లో యురేనియం అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో చేసిన ప్రతిపాదననే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం చైర్మన్‌గా వ్యవహరించే వన్యప్రాణి బోర్డు–2016 డిసెంబర్లో వైస్ చైర్మన్ అయిన అప్పటి అటవీ శాఖ మంత్రి జోగురామన్న అధ్యక్షతన సమావేశమై నల్లమల అడవుల్లో 2 వేల హెక్టార్లలో యురేనియం అన్వేషణకు ఆమోదం తెలిపిందని చెప్పారు. నాడు యురేనియం అన్వేషణకు ఆమోదం తెలిపిన టీఆర్ఎస్.. నేడు దానికి వ్యతిరేకం అని అసెంబ్లీలో తీర్మానాలు చేస్తూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందన్నారు. యురేనియం తవ్వకాలపై అన్ని వర్గాల నుంచి కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంపై కిషన్‌రెడ్డి స్పందించారు. గురువారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధ్యయనం కోసమే.. నేషనల్ మినరల్ పాలసీలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖనిజ సంపద లభ్యత, వాటి నాణ్యత, ప్రయోజనాలపై అధ్యయనం జరిపేందుకు కేంద్రం యురేనియం అన్వేషణ జరుపుతోందని కిషన్‌రెడ్డి చెప్పారు. దీని లో భాగంగా నల్లమల అడవుల్లో యురేనియం ఏ స్థాయిలో ఉంది, దాని నాణ్యతెంత, భవిష్యత్తు తరాలకు అది ఏ మేరకు ఉపయోగపడుతుందన్న విషయాలపై అధ్యయనం జరిపించేందుకు అన్వేషణ మాత్రమే జరుపుతోందన్నారు. అయితే ఎక్కడా కూడా తవ్వకాలకు ఎలాంటి అనుమతులివ్వలేదని చెప్పారు. హైదరాబాద్‌లో ఎన్ఆర్సీ (నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్) చేపట్టడంపై కిషన్‌రెడ్డిని ప్రశ్నించగా.. జమ్మూ కశ్మీర్ తర్వాత హైదరాబాద్‌లోనే అధిక సంఖ్యలో రోహింగ్యాలున్నారని.. అక్కడ ఎన్ఆర్సీ చేపట్టడం అన్నది కేవలం ప్రతిపాదన మాత్రమేనని బదులిచ్చారు. -
‘యురేనియంపై టీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి’
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ పార్టీ యురేనియం తవ్వకాలపై రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో యురేనియం తవ్వకాలకు టీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక సంప్రదింపుల తరువాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని, అయితే ఇప్పటి వరకు యురేనియం తవ్వకాల గురించి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని అనేక ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలపై పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యురేనియం తవ్వాకాలపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని, గతంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు యురేనియం నిక్షేపాల వెలికితీత గురించి అన్వేషణలు చేశాయని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లమలలో యురేనియం గురించి పరిశోధనలు చేసిందని, అధికారం ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా ఊసరవెల్లిలా మాటలు మార్చుతుందని ఆరోపించారు. కేంద్ర పభుత్వం అనేక సంప్రదింపుల తర్వాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని, ప్రస్తుతం టీఆర్ఎస్ అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసిందని మండిపడ్డారు. గ్యాస్, బొగ్గు, బంగారం, సీసం, విద్యుత్ ఎంత ఉన్నదో తెలుసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని, కాగా ఇంత వరకు అసలు ఎంత యురేనియం ఉందో ఇంకా తేల్చలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
పవన్‌కల్యాణ్ మీటింగ్‌కు మనమెందుకు?: సంపత్
సాక్షి, హైదరాబాద్: ‘పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో యురేనియం తవ్వకాలకు ఏం సంబంధం? జనసేన బ్యానర్‌పై స్టార్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి 130 సంవత్సరా ల చరిత్ర కలిగిన పార్టీ ప్రతినిధులుగా మనం వెళ్లడం ఏంటి? టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీహెచ్‌లాంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడం ఏంటి? మన బలం తో పవన్‌ను హీరో చేయడమెందుకు? అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ కాంగ్రెస్ ముఖ్య నేతలను నిలదీశారు. పవన్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై మంగళవారం జరిగిన టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వాడివేడిగానే చర్చ జరిగింది. తవ్వకాలపై ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిశామని, మాజీ ఎమ్మెల్యే వంశీ పోరాటం చేస్తున్నారని, ఉత్తమ్ సీఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కల్పించుకొని దీన్ని పునరావృతం కానివ్వమని అన్నారు. -
అభివృద్ధి పేరుతో అంతం చేస్తారా?
చర్ల: అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ తెగలను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాయని గోండ్వానా సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. సోమవారం చర్లలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షుడు వాసం నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ఆదివాసీ తెగలను అందమొందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని ఆరోపించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. నల్లమల ప్రాంతం రెండు రాష్ట్రాలు, ఆరు జిల్లాల నైజర్గిక స్వరూపాన్ని కలిగి ఉండగా 1961 జనాభా లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో ఆదిమ జాతి తెగలలోని చెంచు కులస్తులు సుమారు 45 వేల మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ప్రభుత్వాల వ్యవహార శైలి వల్ల 10 వేలకు పడిపోయిందని ఆరోపించారు. ఆదిమ తెగలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆదివాసీ తెగలు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 10 వేల మంది ఉన్న చెంచు తెగలో కేవలం 150 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రమే ఉన్నారంటే ఆ తెగను ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేస్తుందో గ్రహించవచ్చని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టాలని యోచిస్తున్న నల్లమల అటవీ ప్రాంతం రెండు రాష్ట్రాలు, ఆరు జిల్లాలను కలుపుకుని విస్తరించి ఉండగా ఆ అటవీ ప్రాంతంలో 250 రకాల పక్షిజాతులు, వేలాది రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయని అన్నారు. యురేనియం తవ్వకాల వల్ల వీటి మనుగడ లేకుండా పోతుందని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాల ఇటువంటి నష్టాలు కలుగనున్న నేపథ్యంలో పర్యావరణ శాస్త్రవేత్తలు ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో గతంలో మంచినీటి పరీక్షల పేరుతో 40 బోర్లు వేశారని మళ్లీ కేంద్ర ప్రభుత్వం 2 వేల ఎకరాల్లో 4 వేలకు పైగా బోరు వేసి భూగర్భంలో ఉన్న యురేనియాన్ని బయటకు తీయాలని చూస్తోందని అన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల అటవులు అంతమవ్వడంతో పాటు అటవీ ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగిస్తున్న చెంచు తెగ అంతరించిపోతుందని అన్నారు. తక్షణమే అలాంటి ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఖనిజ సంపదను దోచుకోవడాన్ని బుర్జువా రాజకీయ వేత్తలు కుట్రలు చేస్తున్నారని వీటిని ప్రతీ ఆదివాసీ ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లేకుంటే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన పిలుపునిచ్చారు. గిరిజనేతరలు స్వాధీనంలోకి వెళ్లిన భూ వ్యవహరంపై రెవెన్యూ యంత్రాంగం తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలైన 1/70, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రభుత్వాలు గుర్తించి వాటిని కాపాడాలని అన్నారు. ఇత్తు పండగ, కొత్తల పండగలకు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
యురేనియం అన్వేషణ ఆపేయాలి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు, నిపుణులతో కూడిన అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంలోని అంశాలపై ఇంకా స్పష్టతివ్వాలని పేర్కొంది. పలు డిమాండ్లను అఖిలపక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయోమయానికి గురిచేస్తున్నారు.. సోమవారం దస్పల్లా హోటల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ‘యురేనియం ఆపాలి.. నల్లమలను పరిరక్షించాలి’అంశంపై ఈ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. యురేనియం పరిశోధన, అన్వేషణ, వెలికితీత ఏ రూపంలో ఉన్నా వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంద న్నారు. యురేనియం అన్వేషణ నల్లమలపై ఎక్కుపెట్టిన తుపాకీ అని, దాన్ని తప్పక దించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, యురేనియం అన్వేషణకు అనుమతించబోమని చెప్పా లని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. యురేనియం తవ్వకాలు, అన్వేషణ ఆపేస్తామన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అనంతరం మాజీ న్యాయమూర్తి గోపాల్‌గౌడ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో నిపుణులు, పర్యావరణవేత్తలు బాబూరావు, కె.పురుషోత్తంరెడ్డి, డి.నర్సింహారెడ్డి, ప్రొ.జయధీర్ తిరుమలరావు, కొండవీటి సత్యవతి, వి.సంధ్య, అరవింద్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నేత వీహెచ్, మూమెంట్ అగెన్ట్ యూరోనియం ప్రతినిధి కె.సజయ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఇమ్రాన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు. -
యురేనియంకు అనుమతించం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమల అడవులతోపాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా యురేనియం తవ్వకాలను అనుమతించేదిలేదని శాసనసభ తీర్మానించింది. యురేనియం నిక్షేపాల తవ్వకాలను వ్యతిరేకిస్తూ గనులు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికతతో పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదముందని.. యురేనియం తవ్వకాల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం ఏకీభవిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. అరుదైన జంతు జీవజాలం, వృక్షజాలంతో జీవవైవిధ్యానికి ఆలవాలమైన అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే ప్రమాదముందని, మానవాళితోపాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పు పరిణమించే అవకాశాలున్నందున యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సవరణలతో మళ్లీ... ముందుగా నల్లమల అడవుల్లో మాత్రమే యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే దానిపై కాంగ్రెస్ సభ్యులు కొన్ని సవరణలు కోరుతూ చర్చకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ తీర్మానాన్ని అప్పటికే ఆమోదించినందున అవకాశం ఇవ్వడం కుదరదని స్పీకర్ తేల్చిచెప్పారు. యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని మీరే అడిగి.. ఇప్పుడు చర్చకు పట్టుబట్టడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. అయినా సభ్యులు బిగ్గరగా మాట్లాడుతుండటంతో కేటీఆర్ కాంగ్రెస్ సభ్యుల దగ్గరకు వెళ్లి మాట్లాడి సర్ది చెప్పడంతో వారు కూర్చున్నారు. అనంతరం ఆ తీర్మానానికి సవరణలు చేసి సభలో మళ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నల్లమల అటవీ ప్రాంతమే కాదు... రాష్ట్రంలో ఎక్కడా యురేనియం తవ్వకాలను అనుమతించబోమంటూ సవరణ చేశారు. ఆ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని స్పీకర్ పోచారం ప్రకటించారు. ఐక్యంగా ముందుకు...: కేటీఆర్ యురేనియం తవ్వకాల విషయంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వ్యతిరేక పోరాటంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. యురేనియం విషయంలో రెండు అంశాలు ఉన్నాయని, ఒకటి అన్వేషణ కాగా రెండోది తవ్వకాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏఎండీకి మైదాన ప్రాంతంలో అన్వేషణకు ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదే అటవీ ప్రాంతమైతే రాష్ట్ర వన్య సంరక్షణ మండలి అనుమతి తప్పనిసని చెప్పారు. 1992 నుంచి 2013 వరకు అన్వేషణ, తవ్వకాలకు అనుమతులిచ్చారని... తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. అన్వేషణ అనేది పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉన్నా మైనింగ్‌కు మాత్రం రాష్ట్ర ఆమోదం అవసరమన్నారు. అప్పుడే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని అమలు చేస్తుందన్నారు. కేంద్రం జాతి ప్రయోజనాలు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే సంఘటితంగా ముందుకు సాగుదామన్నారు. అన్వేషణ కూడా ఆపాల్సిందే: భట్టి విక్రమార్క రాష్ట్రంలో యురేనియం తవ్వకాల విషయంలోనే కాకుండా యురేనియం అన్వేషణను కూడా కేంద్రం ఆపాల్సిందేనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. నల్లమల అటవీ ప్రాంతమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని సవరించడంపట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, పాషా ఖాద్రీ మాట్లాడారు. -
ప్రకటనలు కాదు తీర్మానం చేయాలి: సీతక్క
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అధిక సంఖ్యలో పులులు సంచరించే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతానికి యురేనియం తవ్వకాలతో ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు మౌనం వహించిందో చెప్పాలని నిలదీశారు. ఈ తవ్వకాల వల్ల నల్లమల నాశనమవుతుందని, తద్వారా పరిసర నదులు ప్రభావితమై ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. -
తప్పు చేయబోం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాల విషయంలో ఎలాంటి తప్పుచేయదు, చేయబోదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. యురేనియం పరిశోధన, తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, భవిష్యత్‌లో ఇవ్వబోదని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలున్నా యని భావించినా బయటకు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదన్నారు. ఆదివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశంపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వేసిన ప్రశ్నకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో సహా కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎంఐఎం సభ్యుడు అమీనుల్ జాఫ్రీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ వేసిన అనుబంధ ప్రశ్నలు లఘు చర్చకు దారితీశాయి. సభ్యులు వెలిబుచ్చిన ఆందోళనలు, సందేహాలపై కేటీఆర్ వివరణనిచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ మండలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలని, నిక్షేపాల అన్వేషణను ఆపే అవకాశం ఉంటే పరిశీలించి కేంద్రానికి పంపించాలని పలువురు సభ్యులు సూచించారు. దీనిపై సీఎంతో మాట్లాడి, కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. బాధ్యతారాహిత్యం... యురేనియం విషయంలో కొందరు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండగానే అనుమతులిచ్చిన విషయాన్ని మరిచి, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలను సీఎం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమన్నారు. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం అన్వేషణకు అనుమతి ఇచ్చిందన్నారు. దీనిపై ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిధిలోని అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) అన్వేషణకు సంబంధించిన పనులు చేస్తోందన్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదన్నారు. భయాందోళనలు వాస్తవమే... యురేనియం తవ్వకాలపై ప్రజల్లో భయాందోళన లు ఉన్న మాట వాస్తవమేనని కేటీఆర్ అన్నారు. ఏఎండీ అన్వేషణ పూర్తయ్యాక, ప్రభుత్వాల నుంచి తవ్వకాలకు అనుమతి లభిస్తే యురేనియం కార్పొరేషన్ వాటి ని చేపడుతుందన్నారు. అయితే యురేనియంను గుడ్డిగా వ్యతిరేకించడం కూడా సరికాదన్నారు. ఏఎండీ ఉద్ధేశం కేవలం విద్యుత్ ఉత్పాదనకే అయి ఉండదని, న్యూక్లియర్ రియాక్టర్లు, అణ్వాయుధాలు, అంతరిక్ష పరిశోధనలు, సెటిలైట్లలో వాడే ఇంధనంగా, అంతరిక్ష ప్రయోగాలకు యురేనియం ఉపయోగిస్తారన్నారు. యురేనియం ఉందని తేలినా శుద్ధిచేసే వరకు రేడియేషన్ రాదని తెలిపారు. రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకు సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారని, 2016లో జరిగిన బోర్డు సమావేశంలో యురేనియం మైనింగ్‌కు అనుమతులు ఇవ్వలేదన్నా రు. ఈ నిక్షేపాల అన్వేషణకు సంబంధించి ఒక్క చెట్టు కొట్టరాదని, కాలినడకన వెళ్లాలని, రాత్రి పూట పనిచేయరాదని, బోర్లు వేశాక వాటిని మూసేసి యధాతథస్థితికి తీసుకురావాలంటూ మినిట్స్‌లో పొందుపరిచినట్లు కేటీఆర్ తెలిపారు. -
ఉరేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు
-
మేము తప్పు చేయం.. యురేనియంపై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వదు. నల్లమలలో యురేనియం ఉందా లేదా అని తెలుసుకోవటానికి మాత్రమే ఏఎమ్‌డీ వాళ్లు పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడు.. అటవిని కూల్చరు. 2009లో తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తవ్వుతున్నది బీజేపీ అని మేము చెప్పవచ్చు.. కానీ, మేము చెప్పం. యురేనియం తవ్వకాలపై సీఎంతో చర్చించి అధికారికంగా తీర్మానం పెట్టేలా ప్రయత్నం చేస్తాం. మేము తప్పు చేయం.. చెయ్యబోం’’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనమండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా యురేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కొందరు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలవకుండా వారు మాట్లాడుతున్నారని అన్నారు. వార్తా పేపర్లు కూడా తప్పులు ప్రచురిస్తున్నాయని తెలిపారు. నర్సీ రెడ్డి పేపర్ చూసి మాట్లాడినట్టు ఉన్నారని, పేపర్లో రాసినట్టు ఏమీ ఉండదన్నారు. ఒక ఎంపీ అక్కడి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళ పనులు చేయకూడదని, బోర్లు తవ్విన వాటిని పూడ్చాలని చెప్పామన్నారు. -
‘కేటీఆర్ ట్వీట్ కొండంత అండనిచ్చింది’
సాక్షి, హైదరాబాద్: సేవ్ నల్లమల్ల పేరుతో మేధావులు, సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతో ఊపిరినిచ్చిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నల్లమల్లకు మద్దతుగా చేసిన ట్విట్ మాకు కొండంత అండగా అనిపించిందిని సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గతంలో వజ్ర నిక్షేపాలు రాబర్ట్ వాద్రాకు కేటాయిస్తే సీఎం కేసీఆర్‌తో కలిసి తామంతా ముక్తకంఠంతో ఖండించినట్లు ఆయన గుర్తుచేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇంత మంది అండగా ఉంటూ నాకు మరింత ధైర్యం ఇచ్చారన్నారు. నల్లమల్ల యూరేనియం తవ్వకాలపై కేసీఆర్ స్పందించటం లేదు అనటం పూర్తి అవాస్తవమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘టీఆర్ఎస్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకునే నైజం మాది కాదు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించాం. పోరాటం చేసే శక్తి మాకుంది. నల్లమల్లపై కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రధానమంత్రి స్వయంగా పులుల దినోత్సవం రోజు అమ్రాబాద్‌లో పులుల సంఖ్యను చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద పులులు ఉన్న అడవిగా ఆమ్రాబాద్‌కు పేరుంది. అడవులు కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ అటవిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యురేనియంపై నేను ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తా. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకొని మరో ఉద్యమానికి స్వీకారం చూడతాం. నా నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉన్న మీడియా,సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు. -
నల్లమల పై ఉరేనియం