బిక్కుబిక్కుమంటున్న 15 గ్రామాలు
దేవనకొండ మండలంలో 68 బోర్లు వేసేందుకు ఏఎండీ అనుమతి
2017లో కూడా 20 బోర్ల అనుమతి
1,170.65 ఎకరాల్లో యురేనియం నమూనాల సేకరణకూ ఆమోదం
తవ్వకాల్లో యురేనియం నిల్వలు తెలుసుకుని ఆపై మైనింగ్ చేసే యోచనలో ప్రభుత్వం
బోర్లు వెయ్యొద్దని 10 రోజులుగా 15 గ్రామాల ప్రజలు ఆందోళన
మైనింగ్ జరిపితే తమ జీవితాలు దుర్భరమవుతాయని ఆందోళన
కప్పట్రాళ్ల.. మొన్నటి వరకూ ఫ్యాక్షన్ భయంతో ఉలిక్కిపడిన ఊరు. ఇప్పుడీ ఊరుతో పాటు మరో 15 గ్రామాలు యురేనియం పేరు వింటే హడలిపోతున్నాయి. రేడియో ధార్మిక మూలకమైన యురేనియం మైనింగ్ జరిపితే తమ పొలాలు నిర్జీవమవుతాయని, ఆరోగ్యాలు గుల్ల అవుతాయని.. పీల్చేగాలి, తాగేనీరు, తినే తిండి అంతా కలుషితమై జీవితం దుర్భరమవుతుందని ఇక్కడి వారంతా ఆందోళన చెందుతున్నారు. యురేనియం తవ్వకాలు తమ ప్రాంతంలో జరిపేందుకు వీల్లేదని కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి కర్నూలు: అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) కేంద్ర ప్రభుత్వ సంస్థ. దేశంలో అణు, రేడియో ధార్మిక ఖనిజ నిక్షేపాలను ఏఎండీ అన్వేషించి, పరిశోధనలు జరిపి మైనింగ్ చేపడుతుంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల సమీపంలోని 15 గ్రామాల్లో యురేనియం నిల్వలున్నట్లు ఏఎండీ గ్రహించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో వీటి నిల్వలపై పరిశోధనలు జరిపేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ రీజినల్ ఆఫీసుకు రెండు దఫాలుగా అనుమతులిచ్చింది.
అప్పట్లో 20 బోర్లు వేశారు. మట్టి నమూనాలూ సేకరించారు. అనంతరం ఎక్కడా యురేనియం ప్రస్తావనలేదు. ఆ తర్వాత విజయవాడలోని కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఉప కార్యాలయం మరోసారి 50 మీటర్ల వరకూ 68 బోర్లు తవ్వేందుకు 2023 జూన్ 26న అనుమతులిచ్చింది. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులోని 1,170.65 ఎకరాల్లో బోర్లువేసి యురేనియం ఖనిజం నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసి నమూనాలు సేకరించేందుకు ఏఎండీ ఫేజ్–1కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.
అప్పుడు, ఇప్పుడు టీడీపీ పాలనలోనే
నిజానికి.. కర్నూలు జిల్లాలో యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా 2019 అక్టోబరులో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. యురేనియం తవ్వకాలతో ప్రజలకు, రైతులకు సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపించారు. కానీ, 2017లో తవ్వకాలకు అనుమతులిచ్చింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు కేంద్రంలో టీడీపీ భాగస్వామి కూడా.
ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ప్రజలు 10 రోజులుగా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నప్పుడు ఎందుకు కూటమి నేతలు మాట్లాడటంలేదని ప్రజలు ప్రశి్నస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రెండో విడత అనుమతులపై ఆందోళన
ఇప్పుడు తాజాగా రెండో విడత కింద 68 బోర్లకు అనుమతులివ్వడం, 50 మీటర్ల వరకూ తవ్వకాలు జరపడంతో ఇక్కడ యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే రెండో దఫాలో 15 గ్రామాల పరిధిలో బోర్లకు తవ్వకాలు జరుపుతున్నారని ప్రజల్లో భయం మొదలైంది.
దీంతో.. కప్పట్రాళ్లతో పాటు దేవనకొండ మండలంలోని పి. కోటకొండ, జిల్లేడు, గుండ్లకొండ, దుప్పనగుర్తి, బంటుపల్లి, ఈదులదేవరబండ, నెల్లిబండ, మాదాపురం, నేలతలమరి, చెల్లెల చెలిమల, బేతపల్లితో పాటు పలు గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. ఫ్యాక్షన్ దెబ్బకు అభివృద్ధికి నోచుకోకుండా దెబ్బతిన్న కప్పట్రాళ్ల, పి. కోటకొండ, ఈదులదేవరబండతో పాటు సమీప గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయని ఈ క్రమంలో తవ్వకాలు సరికాదనే నిర్ణయానికి వచ్చారు.
చీని, మిర్చి, పత్తితో పాటు మంచి వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగుచేస్తూ ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతూ, పిల్లలను మంచి చదువులు చదివించుకుంటున్నామని ఇప్పుడు యురేనియం తవ్వకాలు జరిపితే పంటలు పండకపోవడంతో పాటు గ్రామాలను వదిలివెళ్లాల్సి ఉంటుందని.. లేదంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందనే భావన వారిలో ఏర్పడింది. దీంతో 10 రోజులుగా ఆందోళనకు దిగుతున్నారు.
కప్పట్రాళ్లతో పాటు కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో దేవనకొండలో భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తవ్వకాలు జరిపితే ఆత్మహత్యలకు తెగిస్తామని కూడా తేల్చిచెప్పారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో.. తవ్వకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించిన తర్వాతే పనులు చేయాలని, అంతవరకూ తవ్వకాలు జరపొద్దని కలెక్టర్ రంజిత్ బాషా ఏఎండీని ఆదేశించారు.
ప్రాణాలు పోయినా లెక్కచేయం
యురేనియం తవ్వకాలు జరిపితే మా ఊళ్లు, బతుకులు ఛిద్రమవుతాయి. గతంలో బోర్లు వేశారు. మళ్లీ ఇప్పుడు వేస్తామంటున్నారు. ఆర్డీఓ యురేనియం తవ్వకాలు జరగవంటున్నారు. మరి బోర్లు వేయడం ఎందుకు? తవ్వకాలు జరపబోమని కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేదాకా ఆందోళన చేస్తాం. మా ప్రాణాలు పోయినా లెక్కచేసేది లేదు. – నాగరాజు, దుబ్బనుగుర్తి
ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం..
మా కప్పట్రాళ్ల పేరు వింటే నరుక్కోవడాలు, సంపుకోవడాలే! ఎస్పీ రవికృష్ణ దేవుడిలా వచ్చి మా ఊరు దత్తత తీసుకుని ఊరినే మార్చాడు. బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటూ సంతోషంగా బతుకుతాండాం. ఇప్పుడు యురేనియం తవ్వకాలంటూ భయపడెతాండారు. తవ్వకాలు మొదలైతే ఊళ్లు వదిలి వెళ్లాలంటున్నారు. ఊరు వదిలే సమస్యేలేదు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం. – సుంకులమ్మ, కప్పట్రాళ్ల గ్రామం
ఈదుల దేవరబండలో రాస్తారోకో..
కర్నూలు(అర్బన్): యురేనియం నిక్షేపాల వెలికితీతను ఆపాలని సోమవారం దేవనకొండ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈదుల దేవరబండ గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి వచ్చిన డీఎస్పీ వెంకట్రామయ్య మాట్లాడుతూ ‘ఈనెల 4న సమావేశం నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలనుకున్నాం. ఈలోపు రోడ్డెక్కారు.. సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కావొచ్చు ప్రజలు అపోహ పడేలా చేశారు. వాటిని పోగొట్టే బాధ్యత మాపై ఉందన్నారు.
బాబు హయాంలోనే అనుమతి
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో ఎక్కడైనా మంచి జరిగితే చంద్రబాబు ఖాతాలో వేయడం, చెడు జరిగితే మాత్రం వైఎస్ జగన్‌పై నెట్టడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చారని మంత్రి రామానాయుడు చెప్పడాన్ని విరూపాక్షి తీవ్రంగా ఖండించారు.
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2017లోనే మొదటిసారి కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల గుర్తింపునకు డ్రిల్లింగ్ కోసం 27 బోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో జారీ చేశారని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2019 నుంచి ఐదేళ్లపాటు యురేనియం నిక్షేపాల గుర్తింపు, తవ్వకాల కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ యురేనియం నిక్షేపాల గుర్తింపు కోసం 68 బోర్లు వేయడానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. యురేనియం నిక్షేపాలను గుర్తించి తవ్వకాలు చేపడితే తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందన్న భయంతోనే దేవనకొండ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment