కలెక్టరేట్ వద్ద 5 గంటలకు పైగా 15 గ్రామాల ప్రజల ఆందోళన
కర్నూలు(సెంట్రల్): కర్నూలు కలెక్టరేట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు పోలీసుల అడ్డగింపు..మరోవైపు యురేనియం బాధిత గ్రామాల ప్రజల ఆందోళనతో అట్టుడికింది. దేనకొండ మండలం కప్పట్రాళ్ల పరిసరాల్లో ఎలాంటి యురేనియం తవ్వకాలు చేపట్టబోమని కలెక్టర్ వచ్చి ప్రకటన చేయాలని 15 గ్రామాల ప్రజలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ గ్రామాలను పరిరక్షించాలని, తాము నమ్ముకొని ఉన్న భూములు, ఇళ్ల సమీపంలో యురేనియం తవ్వకాలు చేపడితే తమ గతి ఏమిటని, వచ్చే రోగాలకు బాధితులెవరని, పంటలు పండే భూములు బీడుగా మారితే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తూ 5 గంటల పాటు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనను విరమించలేదు.
తమకు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే కలెక్టర్ తనకు బదులుగా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను మొదట పంపారు. ఆమె కలెక్టర్ తరపున వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వారు ఒప్పుకోలేదు. కలెక్టరే రావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు కలెక్టర్‌కు బదులుగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆందోళనకారుల దగ్గరకు వచ్చారు. అందరూ ఏక కంఠంతో యురేనియం తవ్వకాలు ఆపాలని నినదించారు.
తమ గ్రామాలను కాపాడాలని అభ్యరి్థంచారు. యురేనియం తవ్వకాలు చేపడితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని, అధికారులే తమకు న్యాయం చేయాలని కోరడంతో జేసీ స్పందిస్తూ...ప్రస్తుతానికి ఆందోళన అక్కర్లేదని, కేంద్ర పర్యావరణ అనుమతులు రాలేదని, అప్పటివరకు యురేనియం తవ్వకాల నిర్థారణ కోసం గాని, యురేనియం తవ్వకాలు కాని చేపట్టబోమని చెప్పారు. అయితే అనుమతులు రాగానే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారని, అప్పుడు అభ్యంతరాలను ప్రజలు తెలుపవచ్చని సూచించారు.
జేసీ ప్రసంగానికి అడ్డంకులు
జేసీ డాక్టర్ నవ్య ప్రసంగానికి కొందరు యువకులు అడ్డు తగిలారు. తాము అసలు యురేనియం తవ్వకాలపై ఎలాంటి ముందడుగు వేయడానికి వీలు లేదంటే అనుమతులు వచి్చన తరువాత గ్రామసభలు పెడతామని ఎలా మాట్లాడుతారని జేసీని ప్రశి్నంచారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారిని వారించారు. మరోవైపు ఆందోళనలో చురుగ్గా ఉన్న యువకుల వివరాలను పోలీసులు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా ముందుగా జాగ్రత్తగా తీసుకొని ఉంటారని ఆమె వివరించారు.
మొత్తంగా జేసీ వివరణతో తరువాత కప్పట్రాళ్ల చుట్టుపక్కల యురేనియం తవ్వకాలు చేపడతారని స్పష్టంగా అర్థమైపోయింది. కాగా, ప్రజలు ఎంత కోరినా కలెక్టర్ మాత్రం బయటకు రాకపోవడంతో గమనార్హం. ఆందోళనకు సీపీఎం నేతలు జి.రామకృష్ణ, పి.నిర్మల, పీఎస్ రాధాకృష్ణ, వీరశేఖర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల, కోటకొండ, బేతపల్లి, నెల్లిబండ, గుడిమిరాళ్ల, బంటుపళ్లి, గుండ్లకొండ తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment