సాక్షి, నల్లగొండ: జిల్లాపై యురేనియం పిడుగు పడనుందా..? పదహారేళ్ల కిందట, 2003 లోనే అటకెక్కిన యురేనియం గనుల తవ్వకం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ల బూజు దులుపుతున్నారా..? పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని ‘లంబాపూర్–పెద్దగట్టు’ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాలని తలపెట్టి నివేదికలు కూడా పూర్తి చేసిన యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నాడు జరిగిన ప్రజాందోళనలతో వెనక్కి తగ్గింది. ఒక ఓపెన్ కాస్ట్‌మైన్ , మూడు భూగర్భ గనులతో పాటు మల్లాపూర్ వద్ద యురేనియం శుద్ధికర్మాగారం (ప్రాసెసింగ్ ప్లాంట్) ఏర్పా టు చేయాలన్న ప్రతిపాదనలు నివేదికల వరకు వచ్చి ఆగాయి. ఇప్పుడు మరో మారు లంబాపూర్–పెద్దగట్టు గనుల వ్యవహారం తెరపైకి వచ్చింది.
మొదలైతే.. ఇరవై ఏళ్ల దాకా తవ్వకాలు
దేవరకొండ నియోజకవర్గలోని పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లె)మండలంలోని లంబాపూర్, నామాపురం, ఎల్లాపురం, పులిచర్ల, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో ఒక ఓపెన్ కాస్ట్ గనితో పాటు, మరో మూడు భూగర్భ గనుల్లో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించి, 2003 వరకు డీపీఏ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) రూపొందించారు. ఈ గనులకు అనుంబంధంగా మల్లాపూర్‌లో ట్రీట్ మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. కానీ, అన్ని వర్గాలనుంచి వచ్చిన వ్యతిరేకతతో యూసీఐఎల్ అధికారులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లిలో కొత్త గనులు ఏర్పాటయ్యాయి.
ఈ మధ్యలో నల్లమలలో తవ్వకాలు చేపట్టాలని నమూనా సేకరణల కోసం అచ్చంపేట నియోజకవర్గంలోని పల్లెలు, చెంచు పెంటల్లో పదుల సంఖ్యలో బోర్లు తవ్వారు. ఇప్పుడు అకస్మాత్తుగా నల్లగొండ జిల్లాలోనే తవ్వకాలు అంటూ కొత్త వార్తలు వెలువడ్డాయి. పాత నివేదికల ప్రకారం జిల్లాలో ఏర్పాటయ్యే గనుల ద్వారా ప్రతిరోజూ 1250 టీపీడీ (టన్ పర్ డే) ల చొప్పున ఇరవై ఏళ్ల పాటు తవ్వకాలు చేపట్టొచ్చని తేల్చారు. దీనికోసం 1301.35 ఎకరాలు అవసరమని గుర్తించారు. కాగా, ఇందులో 1104.64 ఎకరాలు రిజర్వ్ అటవీ భూమి కావడంతో అనుమతులు అవసరం అయ్యాయి. మరో 196.71 ఎకరాలు మాత్రమే అనుమతులు అక్కర్లేని భూమిగా గుర్తించారు. ఇక, మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాలని తలపెట్టిన ట్రీట్‌మెంట్ ప్లాంట్ కోసం 760 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాంతాల్లో భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వంనుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ అందలేని జిల్లా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రచారం, వార్తలు ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి.
నల్లమల అనుకుంటే.. కృష్ణపట్టెపై ఉరుము
వాస్తవానికి గడిచిన కొద్ది రోజులుగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో యురేనియం వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధానంగా అమ్రాబాద్ మండల పరిధిలోని గ్రామాలు, చెంచు పెంటలు అట్టుడుకుతున్నాయి. ఆయా పార్టీలూ, ప్రజా సంఘాలు గ్రామాలను, చెంచు పెంటలను చుట్టివస్తున్నారు. సేవ్ నల్లమల ఉద్యమాలూ బయలుదేరాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామాలను వీడబోమని, పెంటలు దాటి బయటకు రామని అటు సాధారణ ప్రజలు, ఆదివాసీలైన చెంచులు తెగేసి చెబుతున్నారు.
అమ్రాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతాన్నే ఆనుకుని ఉన్న దేవరకొండ నియోజకవర్గం పరిధిలో సుమారు ఏడు చదరపు కిలోమీటర్ల పరిధిలో తవ్వకాలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ఒక విధంగా అందరి దృష్టీ నల్లమలపై కేంద్రీకృతమై ఉండగా.. అసలు తవ్వకాలు అక్కడ కాదు, నల్లగొండ జిల్లాలో అని వార్తలు వెలువడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2003లోనే ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టారని భావిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లంబాపూర్–పెద్దగట్టు యురేనియం గనులకు అనుమతులు ఇచ్చిందని, పర్యావరణ అనుమతులూ లభించాయని జరుగుతున్న ప్రచారంతో ఈ ప్రాంతం ఒక్క సారిగా ఉలిక్కి పడుతోంది.
అడ్డుకుని తీరుతం
‘పీఏపల్లి మండలంలో తిరిగి యురేనియం త వ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందు కు వచ్చి అనుమతులు ఇస్తే.. యూసీఐఎల్‌ను, వారి కార్యకలాపాలను అడ్డుకుని తీరుతం. తవ్వకాలు మొదలైతే.. కృష్ణా జలాలు పూర్తిగా విషతుల్యం కావడం అనివార్యం. ఈ ప్రాంత ప్రజలు, జీవజాతులపై, గాలిపై, నీరుపై తీవ్ర ప్రభావం చూపే యురేనియం తవ్వకాలు జరగనీయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దూకుడును అడ్డుకోవాలి..’ లంబాపూర్–పెద్దగట్టు యురేనియం ప్రాజెక్టుపై గతంలో ఉద్యమాలు చేపట్టిన మట్టిమనిషి సంస్థ వ్యవస్థాపకుడు వేనేపల్లి పాండురంగారావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment