Amrabad Tiger Reserve
-
Amrabad: అడవిపై ఈ–కన్ను.. ఎక్కడి నుంచైనా లైవ్‌లో వీక్షించే అవకాశం
►పగటి వేళ చెరువులో కొంతసేపు జలకాలాటలు ఆడిన ఓ పెద్దపులి, ఆ తర్వాత ఒడ్డునే ఉన్న ఓ చెట్టుకు శరీరం, తల రుద్దుకుంటూ సేదతీరింది. ►ఓ నీటిగుంటలో ఒక సాంబార్ జింక నిద్రిస్తుండగా అడవి కుక్కలు దాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశాయి. క్షణాల్లోనే అప్రమత్తమైన ఆ జింక వేగంగా తప్పించుకోవడంతో అడవి కుక్కలు నిరాశగా వెళ్లిపోయాయి. ►ఒకచోట రెండు, మూడు పులులు తమ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశాయి. ►ఎఫ్–6 (పులి) రాత్రి వేళ స్వేచ్ఛగా సంచరించడం స్పష్టంగా కన్పించింది. ►కొన్ని జంతువులు ఇతర జంతువులపై దాడికి దిగి, ఆకలి తీరాక పక్క నుంచి బలహీనమైన ఇతర వన్యప్రాణులు వెళుతున్నా పట్టించుకోలేదు. ►ఇలాంటి అనేక వీడియోలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో కెమెరాల్లో రికార్డయ్యాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,611 చ.కి.మీ పరిధిలో విస్తరించి పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పటిష్ట పరిచిన ఎల్క్ట్రానిక్–ఐ (ఈ–కన్ను) నిఘా వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు, వాటి సంరక్షణకు.. అటవీ ఆక్రమణలు, జంతువుల వేట, కలప స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు బాగా ఉపయోగపడుతోంది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతకాలం క్రితమే ప్రయోగాత్మకంగా ఏటీఆర్‌లో అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతానికి పది కెమెరాలను వినియోగంలోకి తీసుకురాగా.. పులులు, ఇతర జంతువులకు సంబంధించి వచ్చిన లైవ్ వీడియోలు, ఫొటోలు అబ్బురపరిచే విధంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కడినుంచైనా పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో అటవీ సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేకుండా, కీలకమైన, క్లిష్టమైన ప్రదేశాల్లో వారానికి ఏడు రోజులు 24 గంటల పాటు (24/7) కచ్చితత్వంతో అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు దీని ద్వారా వీలు కలిగింది. సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ విధానంలో... వివిధ సెన్సిటివ్ జోన్లలో హై రెజల్యూషన్ థర్మల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా మనుషులు, పులుల కదలికలను రికార్డ్ చేశారు. ఉన్నతా«దికారుల సెల్‌ఫోన్‌కు జంతువుల కదలికలు, ఇతర ఘటనలకు సంబంధించిన అలర్ట్‌లు, నోటిఫికేషన్లు వచ్చే సాంకేతికతను ఏర్పాటు చేశారు. రేడియో ఫ్రీక్వెన్సీతో ఇంటర్నెట్ అనుసంధానం అడవిలో ఇంటర్నెట్ నెట్వర్క్ కవర్ కాని చోట్ల రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల సర్వైలెన్స్ ద్వారా పులులు, వన్యప్రాణుల కదలికల్ని గమనిస్తూ పర్యవేక్షించగలుగుతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలు కన్వర్టయ్యే స్ట్రీమింగ్‌తో ఎక్కడి నుంచైనా లైవ్‌లో మానిటర్ చేసే అవకాశాలుండడం అధికారులకు ఉపకరిస్తోంది. అడవుల్లో మొబైల్ టవర్లు నెలకొల్పలేని మారుమూల అటవీ ప్రాంతాల్లో, సిగ్నల్స్ లేనిచోట రేడియో వేవ్ కమ్యూనికేషన్ ద్వారా...ఇంటర్నెట్ ఓవర్ రేడియా (ఐవోఆర్ఏ) విధానం ద్వారా వాకీటాకీలు పనిచేసేలా వ్యవస్థను రూపొందించారు. ఐటీ శాఖతో చర్చలు ఫారెస్ట్ కోడ్ ప్రకారం బీట్ ఆఫీసర్లు నెలలో 26 రోజుల పాటు రాత్రి వేళ అడవిలో తిరగాలి. టేకు చెట్లను కొట్టినా, అడవి నరికినా వాటిని వారు గుర్తించిపై అధికారులను అలర్ట్ చేయాలి. ప్రస్తుతం ఈ–ఐ ఏర్పాటుతో వీరి పని సులభంగా మారింది. ప్రస్తుతం ఏటీఆర్‌లో ఈ వ్యవస్థను మరింత విస్తృతం చేసే ఆలోచనతో అధికారులున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ స్థాయిలో చేసేందుకు తెలంగాణ ఐటీశాఖతో ఏటీఆర్ అధికారులు చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రస్తుతం పది కెమెరాలతోఏర్పాటు చేసిన విధానం వల్ల పరిమితంగానే అడవి కవర్ అవుతోంది. దీనిని మరింత విస్తృత పరచడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వంద నుంచి రెండువందల దాకా కెమెరాలు ఏర్పాటు చేస్తే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వాచ్ టవర్‌కు అడ్వాన్స్డ్ కెమెరా కోసం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ కోసం రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏటీఆర్కు దాదాపు వంద ఎంట్రీ పాయింట్లు ఉన్నందున, రెండువందల కీలక ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తే దేశంలోనే పటిష్టమైన నిఘా వ్యవస్థ కలిగిన టైగర్ రిజర్వ్‌గా దీనిని తీర్చిదిద్దవచ్చునని చెబుతున్నారు. అడవిలో కదలికలన్నీ తెలిసిపోతున్నాయ్.. వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ–ఐ కెమెరాలతో అడవిలో ఏం జరుగుతోందో తెలిసిపోతోంది. జంతువుల కదలికలను స్పష్టంగా చూడగలుగుతున్నాం. లోతైన లోయలు, కొన్ని ఇతర ప్రాంతాల్లో పర్యవేక్షణ చాలా కష్టంగా ఉంటుంది. వాకీటాకీలు పనిచేయని పరిస్థితులుంటాయి. ఇంటర్నెట్ ఓవర్ రేడియో విధానం ద్వారా మొబైల్ సిగ్నల్స్ లేకపోయినా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. – రోహిత్ గొప్పిడి, డీఎఫ్‌వో, నాగర్‌కర్నూల్ జిల్లా -
ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నల్లమల
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నల్లమల అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్తో కలసి మన్ననూరులో కొత్తగా నిర్మించిన ట్రీహౌస్, అదనపు కాటేజీలతోపాటు 8 సఫారీ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల్లోని పులుల సంరక్షణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2018లో 12గా ఉన్న పులుల సంఖ్య 2021లో 21కి పెరిగినట్టు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే వారిపై పీడీ యాక్ట్ నమో దు చేస్తున్నామని, సమాచారం తెలిపిన వారికి బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఎకో టూరిజంలో భాగంగా ప్యాకేజీలు.. టైగర్ స్టే ప్యాకేజీలో భాగంగా రెండ్రోజులు అడవిలో ఉండి టైగర్ సఫారీతోపాటు ట్రెక్కింగ్, కాటేజీల్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పటికే ఉన్న కాటేజీలకు మరో ఆరు కాటేజీలతోపాటు ఇటీవల నిర్మించిన ట్రీహౌస్æ కాటేజీ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఈనెల 26 నుంచి టైగర్ స్టే ప్యాకేజీ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో బుకింగ్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. సాధారణ కాటేజీలో ఇద్దరికి రూ.4,600, మడ్ హౌస్‌లో రూ. 6 వేలు, ట్రీ హౌస్‌లో రూ. 8 వేలతో ప్యాకేజీని ఖరారు చేశామన్నారు. బుకింగ్‌ల కోసం www.amrabadtigerreserve.com సంప్రదించొచ్చన్నారు. పులుల అభయారణ్యాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రీయాల్ చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కలెక్టర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
వైల్డ్ లైఫ్ టూరిజం పునః ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ‘ఎకోఫ్రెండ్లీ వైల్డ్ లైఫ్ టూరిజం’ తిరిగి ప్రారంభం కానుంది. 2021 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా మొదలైన ‘వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్’ని జతచేసిన సరికొత్త హంగులు, ఆకర్షణలతో శుక్రవారం అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పునఃప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా టైగర్ సఫారీ కోసం సమకూర్చిన కొత్తవాహనాలను ఫ్లాగ్‌ఆఫ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం మొదలుకానుంది. టూర్లో భాగంగా ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ని ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌తో మంత్రి ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటకులకు కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న ఆరు కాటేజీలను కూడా మంత్రి ప్రారంభిస్తారు. ఏటీఆర్ పరిధిలో పులుల కదలికల ఫొటోలు, పాదముద్రలు, ఇతర అంశాలతో తయారుచేసిన ‘ఏటీఆర్ టైగర్‌బుక్’ను ఆవిష్కరిస్తారు. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణకు కృషి చేస్తున్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఏటీఆర్‌క్లబ్’ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ ఇలా... టూరిజం ప్యాకేజీలో... టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటివి జతచేశారు. దాదాపు 24 గంటల పాటు ఇక్కడ గడపడంతో పాటు రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బస వంటివి అందుబాటులోకి తేనున్నారు. స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా వ్యవహరించనున్నారు. రాత్రిపూట అడవిలోని పర్క్యులేషన్ ట్యాంక్‌లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణకు నైట్‌విజన్ బైనాక్యులర్స్ ఏర్పాటు చేశారు. ఎకోఫ్రెండ్లీ చర్యల్లో భాగంగా... జ్యూట్‌బ్యాగ్ వర్క్‌షాపు, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌సెంటర్, బయో ల్యాబ్‌ల సందర్శన ఉంటుంది. -
కొత్త కొత్తగా.. టైగర్ సఫారీ
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కొత్త హంగులు, ఆకర్షణలతో ప్రజలకు మరోసారి ‘వైల్డ్ లైఫ్ టూరిజం’.. అందులో భాగంగా ‘టైగర్ సఫారీ’ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పచ్చటి అడవితో పాటు జీవవైవిధ్యానికి ప్రతీకగా పెద్ద పులుల ఆవాసం, విభిన్నరకాల పువ్వులు, ఔషధమొక్కలు, వాగులు, వంకలకు కేంద్రమై ఉంది. పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన ఏటీఆర్ పరిధిలో ఈ నెల 20వ తేదీన టైగర్ సఫారీని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పర్యాటకులకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనేది త్వరలోనే వెల్లడిస్తారు. 2021 నవంబర్‌లో ఏటీఆర్‌లోని ఫరాహాబాద్‌లో తొలిసారిగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టైగర్ సఫారీని ఏడాదికొకసారి నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అప్పట్లో కోవిడ్ రెండో దశ ఉధృతమవడంతో 2022లో ఈ సఫారీ నిర్వహణ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రారంభించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఏమిటీ ‘వైల్డ్ లైఫ్ టూరిజం’ ? వైల్డ్‌లైఫ్ టూరిజంలో టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని ఆకర్షణలను జతచేస్తున్నారు. దాదాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదదీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బసతో కొత్త అనుభూతిని కలిగించే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం నుంచి మొదలయ్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరిరక్షణ, పచ్చదనం కాపాడేందుకు అటవీశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్‌ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్‌లకు తీసుకెళ్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్‌నకు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్ సఫారీకి తీసుకెళ్ళడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా వ్యవహరించనున్నారు. ►గతంలో 2 పాత వాహనాలను టైగర్ సఫారీకి ఉపయోగించారు. ఇప్పుడు 8 కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తున్నారు. గతంలో 12 మందికి వసతి అవకాశం కల్పించగా ఇప్పుడు 24 మందికి వసతి ఏర్పాట్లు ఇస్తున్నారు. ►అతిథుల కోసం ఆధునిక వసతులు, సౌకర్యాలతో కొత్తగా 6 మట్టి కాటేజీలు నిర్మించారు. కొత్తగా ఏవి అందుబాటులోకి వచ్చాయంటే ? ►‘ట్రీహౌజ్’–చెట్టుపై నిర్మించిన ఇళ్లు కొత్తగా అందుబాటులోకి.. ‘ట్రీహౌజ్’ నుంచి రాత్రిపూట సమీపంలో పర్క్యులేషన్ ట్యాంక్‌లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణ ►అందుకోసం నైట్‌విజన్ బైనాక్యులర్స్ ఏర్పాటు ►కొత్తగా ఎయిరోకాన్ హౌజ్ తదితరాల ఏర్పాటు ►గతంలో పైనుంచి ఒకరూట్లోనే సఫారీ నిర్వహించారు. ఇప్పుడు కిందనున్న చెరువు దాకా (ఉమామహేశ్వరం గుడి) వెళ్లాలని అనుకునే వారికి అదనపు చార్జీలతో మరో కొత్తరూట్ ఏర్పాటు ►ఈ ప్యాకేజీ టూర్లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే వీలు కల్పిస్తారు. ►2023 జనవరి 4వ వారం నుంచి జూన్ 30 వరకు (ప్రతీరోజు 24 మంది చొప్పున) ఈ ప్యాకేజీని ఉపయోగించుకునే వీలుంది. ►ఒక్కరికి, ఇద్దరికి లేదా ఒక గ్రూపునకు సంబంధించి టికెట్ ధరలు ఎంత ఉంటాయనే దానిపై ఇంకా అటవీశాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో వైల్డ్‌లైఫ్ టూరిజం/ సఫారీ ప్యాకేజీలో భాగంగా ఇద్దరికి రూ.4,600, ఆరుగురికి రూ.9,600గా ధరలు నిర్ణయించారు. ఈసారి ఇంకా కొంగొత్తగా.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అటవీ, జంతుప్రేమికులకు మరింత ఆహ్లాదం పంచే విధంగా చర్యలు చేపట్టాం. ఏటీఆర్‌లో కెమెరా ట్రాప్‌లకు చిక్కిన పులుల ఫొటోలతో రూపొందించిన ‘టైగర్ బుక్ ఆఫ్ ఏటీఆర్’ పుస్తక ఆవిష్కరణ, ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఏటీఆర్’ పేరిట పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న చెంచుగైడ్స్కు బహుమతులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గతేడాది టైగర్ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఇప్పుడు పులుల సంఖ్య గణనీయంగా పెరిగినందున సైటింగ్స్ మరింత పెరగవచ్చు. –ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి, అమ్రాబాద్ డీఎఫ్ఓ -
‘వైల్డ్ లైఫ్ టూరిజం’కి న్యూ లుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొంగొత్త హంగులతో ‘వైల్డ్ లైఫ్ టూరిజం’సిద్ధమవుతోంది. తెలంగాణలో పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో వచ్చేనెల రెండోవారంలో మొదలు కానుంది. ఏటీఆర్‌లోని ఫరాహాబాద్‌లో టైగర్ సఫారీని ఏడాదికొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ‘వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్’లను అందుబాటులోకి తెచ్చి గతేడాది నవంబర్ 14న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ప్యాకేజీ టూర్లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే వీలుకల్పించారు. గతేడాది ప్రారంభించిన ఈ టైగర్ సఫారీని ఈసారి మరిన్ని సౌకర్యాలతో మరింత ఆహ్లాదాన్ని పంచేలా జంతుప్రేమికులను అలరించేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది. రాత్రి అడవిలో ప్రకృతి ఒడిలో సేదతీరేలా...: టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీలను కలు సుకుని వారి జీవనశైలిని తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని అదనపు ఆకర్షణలను జతచేస్తున్నారు. దా దాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదతీ రేలా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టిఇళ్లలో బసతో కొత్త అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమ య్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరి రక్షణ, పచ్చదనం కాపాడేందు కు అటవీశాఖ నిర్వహిస్తు న్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్‌ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్‌లను చూపిస్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్‌కు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్ సఫారీకి తీసుకెళ్లడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. ఈసారి అంతా కొత్త కొత్తగా.. గత ఏడాదితో పోల్చితే కొత్త కాటేజీలు సిద్ధం చేయడంతో పాటు, టైగర్ సఫారీకి అనువైన 8 కొత్త వాహనాలను కొంటున్నాం. అట వీ, జంతుప్రేమికులకు ఆహ్లాదం పంచడంతోపాటు, ఇక్కడ గడిపే సమయం మధురానుభూతులను నింపేందుకు దోహ దపడే చర్యలు చేపడుతున్నాం. నూతనంగా అందుబాటులోకి తెస్తున్న కాటేజీలతో పాటు మట్టి ఇళ్లు, ఒక ట్రీ హౌస్, ఎయిరోకాన్ హౌస్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. గతేడాది టైగర్ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఈ ఏడాది సఫారీ ఏరియాలో కాకుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో తరచుగా పులులు తారసపడుతుండటాన్ని బట్టి సంఖ్య పెరిగినట్టుగా అంచనా వేస్తున్నాం. చెంచుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పుట్టగొడుగులు, తేనేటీగల పెంపకంలో శిక్షణనిస్తున్నాం. – ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి, అమ్రాబాద్ డీఎఫ్ఓ -
నల్లమలలో పెరిగిన పులులు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 21
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోర్ ఏరియా విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ఇప్పటివరకు 21 పులులు కెమెరాకు చిక్కాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎనీ్టసీఏ) నాలుగేళ్లకు ఒకసారి పులుల గణన చేపడుతుంది. 2018లో విడుదల చేసిన నివేదికలో అమ్రాబాద్ రిజర్వ్‌లో 12 పులులు ఉండగా, గతేడాది నాటికి వాటి సంఖ్య 16కి పెరిగింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో 21 పులులు చిక్కాయి. పులుల సంతతి పెంచేందుకు అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పెరుగుతున్న ఆడ పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మొత్తం విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ. కాగా, ఇందులో కోర్ ఏరియా 2,166.37 చ.కి.మీ. కోర్ ఏరియాపరంగా ఏటీఆర్ దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ సుమారు 200 వరకు పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పులులు రెండున్నర ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అమ్రాబాద్ రిజర్వ్‌లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడ పులుల సంఖ్య పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఆడపులులు ఏడు ఉండగా, మరో ఆరు పులి పిల్లలు ఉన్నాయి. ప్రజల మద్దతుతో... ఎనీ్టసీఏ మార్గదర్శకాల ప్రకారం పులుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పులుల వేటను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతోపాటు స్థానిక ప్రజల్లో పులుల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో అవగాహన కలి్పస్తోంది. తద్వారా పులుల సంరక్షణ కోసం స్థానిక ప్రజల మద్దతు పొందుతోంది. పులులకు ఆహారమయ్యే వన్యప్రాణుల సంతతి పెంచేందుకు ప్రత్యేకంగా 300 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. నల్లమలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరప్రాంతాల్లో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆడ పులులు, పిల్లల సంరక్షణ కోసం కృష్ణానది దాటి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కృష్ణాతీరంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే వారితో పులులకు ముప్పు పొంచి ఉండటంతో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాయింట్ రివర్ పెట్రోలింగ్ ద్వారా సుమారు 30 కి.మీ. పరిధిలో పులులు ఇరురాష్ట్రాల సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించేందుకు అవకాశం కలి్పస్తున్నారు. పులుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాయింట్ రివర్ పెట్రోలింగ్ చేపట్టాం. దీనిని ఇంకా విస్తరిస్తాం. పులుల ఆవాసాలకు ఇబ్బంది కలగకుండా స్థానికులకు అవగాహన కలి్పస్తున్నాం. ప్రజలు సైతం ఎంతగానో సహకరిస్తున్నారు. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
నల్లమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్
సాక్షి, నాగర్‌కర్నూల్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ విశిష్టతను కాపాడుతూనే వన్యప్రాణుల పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ చంద్రప్రకాశ్ గోయల్ తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద నల్లమల ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు 70 కి.మీ. రహదారిని ప్లాస్టిక్ రహితంగా మార్చడంతో పాటు ఆ ప్లాస్టిక్‌ను మన్ననూర్‌లో రీసైక్లింగ్ చేయిస్తామన్నారు. ఇందుకోసం 15 మంది స్థానిక చెంచులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. టైగర్ రిజర్వులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం దేశంలోనే తొలిసారన్నారు. అనంతరం మన్ననూర్లోని వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రం, బయోల్యాబ్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. అమ్రాబాద్ జంగిల్ సఫారీలో ప్రయాణించిన అధికారులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. నల్లమలలో చెంచు మహిళలకు ఉపాధి కల్పించేందుకు అపోలో ఫౌండేషన్ ఏర్పాటుచేసిన ప్యాకేజింగ్ వర్క్‌షాపు, అచ్చంపేట అటవీశాఖ కార్యాలయంలో చౌసింగా మీటింగ్ హాల్, ఔషధ మొక్కలతో ఏర్పాటుచేసిన మెడిసినల్ గార్డెన్‌ను ప్రారంభించారు. అలాగే అచ్చంపేటలో నిర్మించనున్న అటవీ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. -
అడవి ఒడి నుంచి విడదీసి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అమ్రాబాద్ అభయారణ్యం నుంచి అడవి బిడ్డలను తరలించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల అధికారులు తరచూ చెంచుపెంటలకు వస్తూ.. పక్కాఇళ్లు కట్టిస్తామని, భారీగా ప్యాకేజీ ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారని చెంచులు చెప్తున్నారు. తాము అడవి బయట బతకలేమని చెప్తున్నా వినడం లేదని.. చెంచుపెంటల్లోని గిరిజనేతరులకు గాలమేసి, వారితో ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ మధ్య చిచ్చుపెట్టి.. అడవి నుంచి గెంటివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. తమను బలవంతంగా మైదాన ప్రాంతాలకు తరలిస్తే బతకలేమని, చెంచుజాతి పూర్తిగా నశించిపోతుందని వాపోతున్నారు. ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా.. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతాన్ని రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ఏర్పాటు చేశారు. పులులు, ఇతర అడవి జంతువుల ఆవాసాన్ని పెంచడం కోసం, సంరక్షణ కోసం చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి చిరుతలు, వివిధ రకాల జంతువులను తీసుకొచ్చి నల్లమల పరిధిలో వదిలిపెట్టారు. అప్పట్లోనే అడవి మధ్యలో ఉన్న చెంచులను బయటికి తరలించాలని చూశారు. కానీ చెంచులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా పలుసార్లు ప్రయత్నాలు జరిగినా చెంచులతోపాటు ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. – తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర పరిధిలో (కృష్ణానదికి ఇవతల) మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో విస్తరించిన అటవీ ప్రాంతాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌గా నామకరణం చేసింది. ఇటీవల అభయారణ్యం నుంచి చెంచులను తరలించేందుకు అటవీ శాఖ మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. కొద్దిరోజుల నుంచి కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమ్రాబాద్ మండలం కొల్లంపెంటకు చెందిన చెంచుల కోసం మాచారంలో ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఇళ్లను ఇటీవల ఎఫ్‌డీవో రోహిత్‌రెడ్డి పరిశీలించారు. దీనితో అటవీ ఉత్పత్తులే జీవనాధారంగా బతుకీడుస్తున్న చెంచు కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. అటు గాలం.. ఇటు ఉచ్చు..! అటవీ అధికారులు కొద్దిరోజులుగా చెంచులపై ఒత్తిడి పెంచుతున్నారు. చెంచుపెంటల్లో సమావేశాలు ఏర్పాటు చేసి.. మైదాన ప్రాంతానికి తరలివెళ్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. 18ఏళ్లు నిండిన యువతను కూడా విడి కుటుంబంగా పరిగణిస్తామని.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) నుంచి రూ.15 లక్షల ప్యాకేజీని వర్తింపజేస్తామని గాలం వేస్తున్నారు. కొన్నిచోట్ల భూమి కూడా ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా చాలా వరకు చెంచులు అడవి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. – రెండు, మూడు చెంచుపెంటలు మినహా మిగతా చెంచు పెంటల్లో గిరిజనేతరులు సైతం జీవిస్తున్నారు. వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలులో ఎక్కువగా ఎస్సీ, బీసీ కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం పక్కా ఇల్లు, రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తామని అటవీ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో గిరిజనేతరుల్లో ఆశలు పెరిగాయి. అందులో కొందరు గిరిజనేతరులు అడవి బయటికి రావడానికి సుముఖత వ్యక్తం చేయగా.. దీన్ని ఆసరాగా చేసుకుని చెంచులపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. చెంచులు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టి ‘పని’ సాధించుకునే కుయుక్తులు పన్నుతున్నట్టుగా ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో రెండు ఊర్ల తరలింపు – తొలిదశలో అభయారణ్యంలోని ఫర్హాబాద్, కొల్లంపెంటలోని చెంచులను తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఈ రెండుచోట్ల 30 నుంచి 34 కుటుంబాలు జీవిస్తున్నాయి. – కొల్లంపెంటకు చెందిన చెంచులను మాచారంలో ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఇళ్లలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడే ఇళ్లతోపాటు భూమి కూడా ఇవ్వాలనే డిమాండ్ కొందరు చెంచుల నుంచి వ్యక్తమవుతోంది. మాచారం, దాని సమీపంలో ప్రభుత్వ భూముల్లేవు. ఇక్కడి మొల్కమామిడిలో ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన 29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. – ఫర్హాబాద్ చెంచులను లింగాల మండలం బాచారానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అక్కడి చెంచులు ఇందుకు అంగీకరించారనీ చెప్తున్నారు. కానీ ఫర్హాబాద్ చెంచులు, సమీపంలోని ఇతర పెంటల్లోని చెంచులు మన్ననూర్‌కుగానీ, వేరే ఏజెన్సీ గ్రామాలకుగానీ పంపితేనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్యాకేజీ రూ.15 లక్షలతోపాటు ఉచితంగా ఐదెకరాల వ్యవసాయ భూమి, పక్కా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తరలించే యత్నం ఎప్పట్నుంచో.. – 1999లో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు నల్లమలలోని కొన్ని చెంచు కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించారు. అమరగిరి వద్ద ప్రత్యేక పునారావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఇమడలేక ఇద్దరు చెంచులు మరణించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. – నల్లమలలో యురేనియం తవ్వకాలు, అభయారణ్యం పేరిట చెంచులను మరోసారి మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రారంభించారు. ఈ క్రమంలో కుటుంబానికి రూ.10 లక్షల నగదుతోపాటు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఇళ్లు నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పినా.. అడవి బిడ్డలు అంగీకరించలేదు. తర్వాత నగదుతోపాటు రంగారెడ్డి జిల్లా బాచారం దగ్గర ఇళ్ల నిర్మాణం, నగదు కాదనుకుంటే మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగదు ప్యాకేజీని రూ.15 లక్షలకు పెంచారు. – నల్లమలలోని వటువర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, కొమ్మనపెంట, కొల్లంపెంట, మల్లాపూర్, అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగిడిగుండాల, మేడిమొల్కల, ఈర్లపెంటల్లో 175 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో 80శాతం కుటుంబాలతో అంగీకార పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో చెంచుల వివరాలివీ.. చెంచు పెంటలు 112 కుటుంబాలు 2,630 జనాభా 9,514 కోర్ ఏరియాలోని చెంచుపెంటలు: నల్లమల పరిధిలోని అమ్రాబాద్, వటువర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, కొమ్మనపెంట, కొల్లంపెంట, మల్లాపూర్, లింగాల మండలం అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగిడిగుండాల, మేడిమొల్కల, ఈర్లపెంట. మా జాతి నశించిపోతుంది ఎంతోకాలంగా ఇక్కడే జీవిస్తున్నాం. ప్రభుత్వం మా చెంచులకు ఏవేవో ఆశలు కల్పించి అడవి నుంచి దూరం చేయాలని చూడటం భావ్యం కాదు. అడవి, వన్యప్రాణులతో కలిసి బతికే మా చెంచులను గ్రామాల్లోకి తీసుకుపోతే బతకలేరు. చెంచుపెంటల్లో ఉన్న చెంచులు సాగు చేసుకుంటున్న భూములకు ఎఫ్ఆర్సీ పట్టాలతోపాటు రైతుబంధు ఇచ్చి వ్యవసాయం చేసుకునేందుకు సహకరించాలి. ప్రభుత్వం బలవంతంగా అడవుల నుంచి తరలిస్తే మా చెంచు జాతి పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలి. – దాసరి నాగయ్య, చెంచు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అధికారుల మాటలు నమ్మబోం మా చెంచులను ఎలాగైనా అడవి నుంచి తరలించాలని వివిధ సంస్థలతోపాటు ప్రభుత్వ అధికారులు కుట్ర చేస్తున్నారు. ప్యాకేజీ ఇస్తామంటూ ఆరేళ్లుగా ఉత్త మాటలు చెప్తున్నారు. నమ్మకం కలిగించే చర్యలేవీ తీసుకోవడం లేదు. చెంచు కుటుంబాలకు 5 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి, ఇల్లుతోపాటు పిల్లలకు పాఠశాల, ఆస్పత్రి తదితర సౌకర్యాలు కల్పించాలి. ఆ తర్వాతే మాతో మాట్లాడాలి. – చిర్ర రాములు, చెంచు, సార్లపల్లి ఇబ్బంది బదులు.. దారి చూపిస్తే పోతాం.. అన్ని వసతులు కల్పిస్తే పోవడానికి మేం సిద్ధమే. ఆరేళ్లుగా ఫారెస్టు అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారు. పొలాలు సాగు చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. ఎక్కడో అడవిలో ఏ జంతువులు చనిపోయినా మాకు సంబంధం అంటూ కేసులు పెడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడుకుంటూ ఉండేకంటే.. మాకు దారి చూపిస్తే వెళ్లిపోవడానికి సిద్ధమే. – సత్తయ్య, గిరిజనేతరుడు, సార్లపల్లి బయటికొస్తే బతికేదెలా? చెంచులు అడవిలో చెట్లుచేమలు, జంతువులతో కలిసి, అడవిపైనే ఆధారపడి బతుకుతున్నారు. అడవిలో సహజసిద్ధంగా దొరికే వాటితోనే కడుపు నింపుకొంటున్నారు. వారితో అడవికి ఎలాంటి నష్టం లేకపోగా.. మేలే జరుగుతోంది. ఆదివాసీలు లేకుంటే మాఫియా పెట్రేగిపోవడం ఖాయం. దానివల్ల జీవ, పర్యావరణానికి విఘాతం కలిగే పరిస్థితి వస్తుంది. అసలు చెంచులు మైదాన ప్రాంతాల్లో జీవించగలరా? అడవిలో ఏళ్లకేళ్లుగా బతుకుతున్నవారు ఇప్పటికిప్పుడే అలవాట్లు మార్చుకోగలరా.. మైదాన ప్రాంతాల్లో మానసిక స్థితి, ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోగలిగే శక్తి చెంచులకు లేదు. ఏ ప్రభుత్వాలు కూడా వారి ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వలేవు. ముందుగా పక్కా ప్రణాళికతో వారిని విద్యావంతులుగా చేయాలి. కనీసం 7, 10 తరగతులు చదివినవారికి తగిన ఉద్యోగ అవకాశాలివ్వాలి. విద్యావంతులు పెరిగితే.. అడవిలో ఉండాలా? ఇంకెక్కడైనా ఉండాలా అన్నది చెంచులే నిర్ణయించుకుంటారు. సమాజంలో వివక్ష నుంచి తమను తాము కాపాడుకోగలుగుతారు. అంతేగానీ నిర్బంధంగా తరలిస్తే కొన్నాళ్లలో చెంచు జాతి కనుమరుగవుతుంది. పల్లెల్లో ఉన్నవారిని పట్టణాల్లో జీవించాలని ఏ ప్రభుత్వమైనా చెప్తుందా? అదే అడవిలో నివసిస్తున్న వారిని మైదాన ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడం ఎంత వరకు కరెక్టు. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఈ ఫొటోలో ఉన్న చెంచు కుటుంబం.. చిగుర్ల చిట్టెమ్మ, ఆమె భర్త ఈదయ్య, వారి ముగ్గురు కూతుళ్లు. తాతల కాలం నుంచీ వీరు సార్లపల్లిలో బతుకుతున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు బడికి పోతే.. తల్లిదండ్రులు, పెద్దబిడ్డ కలిసి అటవీ ఉత్పత్తుల సేకరణ, కూలీ పనులకు వెళ్తారు. చెంచులను అడవి నుంచి బయటికి తరలించేందుకు అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలను వారు తిరస్కరించారు. అయితే అధికారులు ఇక్కడి గిరిజనేతరులు కొందరిని రూ.15లక్షల ప్యాకేజీకి ఒప్పించి సంతకం చేయించారు. మిగతావారితోనూ సంతకం చేయించాలని.. అప్పుడే తరలింపు పని మొదలవుతుందని, డబ్బులు చేతికి అందుతాయని మెలికపెట్టారు. దీంతో సదరు గిరిజనేతరులు.. చెంచు కుటుంబాలపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. చిట్టెమ్మ దంపతులనూ ఒప్పించేందుకు ప్రయత్నించారు. దీనిపై మండిపడ్డ చిట్టెమ్మ కుటుంబం.. ‘‘ఎవరు ఎటైనా పోండి.. మాకు అవసరం లేదు. అడవిని వదిలి ఎక్కడో కాని రాజ్యంలో పోయి మేం బతకలేం. బలవంతంగా తీసుకుపోతే మా చావులే కళ్లజూస్తరు’’అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
అమ్రాబాద్‌కు ‘వైల్డ్’ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో వైల్డ్‌లైఫ్ టూరిజం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీ టూర్, ఆదివాసీ, గిరిపుత్రులతో మాట్లాడే అవకాశం తదితర అరుదైన అనుభవాలతో టూర్ అందుబాటులో రానుంది. ఏటీఆర్‌లోని ఫరాహబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ టైగర్ సఫారీకి సంబంధించి https:// amrabadtigerreserve.com వెబ్సైట్లో బుక్ చేసుకునే ప్రక్రియ ఆది లేదా సోమవారాల్లో (7, 8 తేదీల్లో) ప్రారంభించనున్నారు. ఈ నెల 14 నుంచి ఈ వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్ మొదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. దట్టమైన అమ్రాబాద్ అటవీ ప్రాంతం తొలుత రోజుకు 12 మందితో ఒక్క ట్రిప్ మాత్రమే ఉంటుంది. తెలంగాణకు చెందిన యువ ఐఎఫ్ఎస్ అధికారి, అమ్రాబాద్ ఎఫ్‌డీవో రోహిత్ గొప్పిడి ఆలోచనల నుంచి ఈ టైగర్ సఫారీ టూర్ కార్యరూపం దాల్చింది. వివరాలు ఆయన మాటల్లోనే... టూరిజం ఇలా సాగుతుంది..: మొదటిరోజు మధ్యాహ్నం టూర్ మొదలవుతుంది. భోజనం చేశాక అటవీ పరిరక్షణ, పచ్చదనం కాపాడేందుకు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి లఘుచిత్రాల ద్వారా పర్యాటకులకు అవగాహన కల్పిస్తాం. అక్కడే నెలకొల్పిన ల్యాబ్, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్‌ను చూపిస్తాం. టైగర్ రిజర్వ్ అంటే ఏమిటీ, పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత, అటవీశాఖ నిర్వహిస్తున్న విధుల గురించి తెలియజేస్తాం. ఆ తర్వాత అడవిలో ట్రెక్కింగ్ ఉంటుంది. సాయంత్రానికి తిరిగొచ్చాక రాత్రి పూట చుట్టూ చీకటి, చక్కటి ఆహ్లాదకరమైన అడవిలోనే ఏర్పాటు చేసిన కాటేజీల్లో టూరిస్ట్‌లు బస చేస్తారు. మరుసటి ఉదయమే సఫారీకి తీసుకెళ్తారు. తిరిగొచ్చాక మధ్యాహ్నానికి ఈ టూర్ ముగుస్తుంది. ఆహార పదార్థాలు పక్కనే ఉన్న మృగవాణి రిసార్ట్స్ నుంచి ఆర్డర్‌పై తెప్పించాలని నిర్ణయించాం. కొంతకాలం గడిచాక స్థానిక చెంచులతోనే ఆహారం సిద్ధం చేయించాలనే ఆలోచనతో ఉన్నాం. స్థానిక చెంచు స్వయం సహాయక మహిళా బృందం ద్వారా భోజనం సిద్ధం చేయడం ద్వారా వారికీ ఉపాధి లభించేలా చూడాలని చూస్తున్నాం. ప్రత్యక్ష అనుభూతి పొందేలా.. శ్రీశైలం దేవస్థానానికి వెళ్తూ మధ్యలో ఇక్కడి అడవిలో ఆగి వెళ్తున్నారు. ఆ తరహా పర్యాటకులు కాకుండా అ డవికి సంబంధించిన ప్రత్యక్ష అనుభూతి పర్యాటకులకు లభించాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి అందా లు, అడవి ప్రత్యేకతలు అందరికీ తెలిసేలా చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ రూపొందించారు. ఇద్దరికి రూ.4,600, ఆరుగురికి రూ.9,600.. వైల్డ్‌లైఫ్ టూరిజం/సఫారీ ప్యాకేజీలో భాగంగా ఇద్దరికి రూ.4,600, ఆరుగురికి రూ,9,600గా ధరలు నిర్ణయించాం. అడవి కాబట్టి బేసిక్ సౌకర్యాలు, సదుపాయాలతో దీన్ని నడిపిస్తాం. అమ్రాబాద్‌కు పర్యాటకులు రావాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించాం. అందువల్ల ఒక ప్యాకేజీ టూర్, ట్రెక్కింగ్, సఫారీ, కాటేజీలో రాత్రి బస వంటి అన్ని కలిపి అనుభూతి ఏర్పడాలనేది మా భావన. ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లు.. మొక్కుబడి టూరిజం ట్రిప్‌గా కాకుండా పర్యాటకులకు అడవికి వెళ్లొచ్చామనే అరుదైన అనుభూతి కలిగేలా ఈ ప్యాకేజీ రూపొందించాం. స్థానిక చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా శిక్షణ పొందుతున్నారు. పరిమిత సంఖ్యలోనే పర్యాటకులను అనుమతిస్తాం. 12 మంది నుంచి గరిష్టంగా 20, 25 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. – ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి -
అమ్రాబాద్‌లో ‘పులి గర్జన’
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ పులుల అభయారణ్యం(ఏటీఆర్)లో ఉన్న పులుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అక్కడ పధ్నాలుగు పులులున్నట్టుగా అటవీ అధికారులు గుర్తించారు. ఏటీఆర్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న వన్యప్రాణుల వివరాలనుఅటవీశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పులులతోపాటు మొత్తం 43 రకాల వన్యప్రాణులు ఉన్నట్టు అటవీశాఖ గుర్తించింది. నివేదిక ప్రకారం... వన్యప్రాణుల్లో అరుదైన హానీ బాడ్జర్ లాంటి జంతువులు, వందలాది రకాల పక్షిజాతులు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి ఏడాది నిర్వహించే కసరత్తులో భాగంగా స్టేటస్ ఆఫ్ టైగర్స్ అండ్ ప్రే బేస్ ఇన్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2021 (వైల్డ్‌లైఫ్ సెన్సెస్ రిపోర్ట్)ను శుక్రవారం విడుదల చేశారు. నల్లమల అటవీప్రాంతమైన (2,611 చదరపు కిలోమీటర్ల పరిధి) అమ్రాబాద్‌లోని కోర్ ఏరియాలో పరిశీలన చేశారు. లైన్ ట్రాన్సిక్ట్ మెథడ్, వాటర్ హోల్ సెన్సస్‌ల ఆధారంగా జంతువులను లెక్కించారు. పులులతోపాటు వాటి వేటకు ఆధారమైన శాఖాహార జంతువుల లభ్యతను కూడా పరిశీలించారు. ప్రతిచదరపు కిలోమీటరు విస్తీర్ణంలో జింకలు, చుక్కల దుప్పులు, అడవిపందులు, సాంబార్, లంగూర్ లాంటి జంతువులను లెక్కించారు. పులుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అటవీ సంరక్షణకు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని నివేదిక విడుదల సందర్భంగా పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. తెలంగాణలో 26 పులులు 2018లో జాతీయస్థాయిలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో పులుల సెన్సెస్ నిర్వహించగా తెలంగాణలో 26 పులులు(అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ కలిపి) ఉన్నట్లు వెల్లడైంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ కొత్త సెన్సెస్ నివేదికను కేంద్రం వెల్లడించనుంది. 2022 సెన్సెస్ నాటికి 32–34 దాకా పులుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కీలకంగా మారిన పులుల సంరక్షణ అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం, వన్యప్రాణులు ఇలా వివిధ అంశాలన్నీ పులుల సంఖ్య, వాటి స్వేచ్ఛాజీవనంపై ఆధారపడి ఉంటాయి. ఒక్కో పులి స్థిరనివాసంతోపాటు మనుగడ సాగించేందుకు 50 చ.కి.మీ. మేర అటవీ ప్రాంతం అవసరం. పులిపై ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో మిగతా వన్యప్రాణులు, జీవరాశులు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించుకోవడం కీలకంగా మారింది. మనుషుల వేలిముద్రలు, చేతిగుర్తుల మాదిరిగా ఏ రెండు పులుల చారలు, గుర్తులు ఒకేలా ఉండవు. 14 కంటే ఎక్కువగానే పులులుండొచ్చు... ‘అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పులులు, ఇతర జంతువుల సంఖ్య పెరగడం మంచి పరిణామం. ఇక్కడ 14 పులులున్నట్టుగా తేలింది. అయితే సెన్సెస్ చేసే ఏటీఆర్ పరిధిని మరింత విస్తృతపరిస్తే వీటి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. గతంతో పోల్చితే వీటి సంఖ్య 12 నుంచి 14కు పెరిగింది’ – బి.శ్రీనివాస్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స, ఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ -
Photo Feature: కెమెరాకు చిక్కిన వేటగాళ్లు
సాక్షి, అచ్చంపేట: గత నెల 3, 7 తేదీల్లో పది మంది వేటగాళ్లు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఉచ్చులు బిగించి.. అందులో చిక్కిన దుప్పి, సాంబార్లను గొడ్డళ్లతో నరికి చంపారు. వాటిని ముక్కలు చేసి తీసుకెళ్లారు. అయితే.. రిజర్వ్ ఫారెస్ట్‌లో బిగించిన కెమెరా ట్రాప్లను నెలకొకసారి అధికారులు పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం కెమెరా ట్రాప్లను పరిశీలిస్తుండగా, అచ్చంపేట గుంపన్‌పల్లికి చెందిన పది మంది వన్యప్రాణుల్ని వేటాడుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. వీరిని అదుపులోకి తీసుకుని ఈనెల 5న అచ్చంపేట కోర్టుకు తరలించగా, సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారని రేంజర్ మనోహర్ తెలిపారు. ఈ చిత్రాలను అటవీ అధికారులు సోమవారం విడుదల చేశారు. చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు? -
అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం
సాక్షి, నాగర్ కర్నూల్: అమ్రాబాద్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన నాలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన వారు అగ్నికీలల్లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత సోమవారం రాత్రి సైతం దోమలపెంట సమీపంలో అడవికి నిప్పంటుకుంది. వెంటనే రెండు అటవీశాఖ బృందాలతోపాటు 10 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని బ్లోయర్లు, డౌసింగ్‌ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించి అడవికి నష్టం వాటిల్లింది. చదవండి: పాకిస్తాన్లో హిందూ కుటుంబం దారుణ హత్య! -
ఐఎఫ్ఎస్ల బదిలీ.. సీఎస్ కీలక ఉత్తర్వులు
సాక్షి,హైదరాబాద్: అటవీశాఖలో పనిచేస్తున్న పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ములుగులోని ఫారెస్ట్‌కాలేజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) పర్సన్ ఇన్చార్జి, డీన్‌గా ఉన్న డా.జి.చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ /హైదరాబాద్ ఆర్ అండ్ డీ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్ఘీస్‌కు ఎఫ్సీఆర్ఐ పర్సన్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్ప గించారు. ఇక ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్‌గా బి.శ్రీనివాస్ నియమితులు కాగా ఆ స్థానంలో పనిచేస్తున్న డా.అశోక్ కుమార్ సిన్హా ను స్టేట్ ట్రేడింగ్ సర్కిల్ అదనపు పీసీసీఎఫ్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్‌గా ఉన్న ఎన్.క్షితిజను మహబూబ్‌నగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్‌గా బదిలీ చేశారు. -
జంతు సంరక్షణకు చర్యలేవీ..?
నాగార్జునసాగర్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ఫారెస్ట్‌లో భాగమైన నాగార్జునసాగర్ రిజర్వ్‌ఫారెస్ట్ కోర్ ఏరియాలో జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అనివార్యంగా మారింది. గతంలో పోలిస్తే జంతువుల సంఖ్య పెరిగినట్లుగా అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఫిబ్రవరి మాసంలోనే ఎండలు మండిపోతుండడంతో తాగునీటికి మూగజీవాలు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే తగు చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. కానరాని పులుల జాడ పలురకాల జంతువులు అటవీ ప్రాంతంలో తిరుగాడుతున్నప్పటికీ పులుల జాడ మాత్రం కనిపించడం లేదు. గతంలో ఇక్కడ పులులు తిరగడంతో టైగర్‌వ్యాలి అనే పేరున్న లోయ కూడా ఉంది. నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్లో దేవరకొండ, నాగార్జునసాగర్ కంబాలపల్లి రేంజ్‌లలో కలిపి 41వేలహెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. అభయారణ్యమంతా సాగర్ జలాశయంతీరం వెంట ఉంది. దేవరకొండ రేంజ్లో 26,785హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 30కెమెరాల ద్వారా 20కి పైగా చిరుతలు ఉన్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పెరిగిన జంతువుల సంఖ్య అడవిలో మనుబోతులు, దుప్పులు, కణితులు, ఎలుగుబంట్లు చౌసింగ, సింకార, రేస్‌కుక్కలు, హైనాలు, మూసిక జింకలు, నెమల్లు తదితర జంతువుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగినట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా.. గతంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే సంబంధిత అధికారులు ముందస్తుగానే మేల్కొ ని వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. గతంలో అటవీ ప్రాంతంలోకి జీవాలు రాకుండా కందకాలు తవ్వడంతో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ఆ కందకాల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. అటవిని ఆనుకుని ఉన్న తండాల ప్రజలు ఎవరైన సిగరెట్, బీడీ పీకలు పడేసిన అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముందుగా అధికారులు సమీప తండాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నీటి వసతికి చర్యలు చేపడుతున్నాం అటవీ ప్రాంతంలోని జంతువుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గతంలో అడవిలో శాసర్‌పీట్స్‌ను నిర్మించాం. వాటిలో నీటిని నింపేందుకు సిబ్బందిని ఆదేశించాం. అదే విధంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా సమీప తండాల్లో దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.– డీఎఫ్ఓ గోపి రవి -
20,000 చెట్లపై హైవేటు
సాక్షి, హైదరాబాద్ : అభయారణ్యంలో చెట్లు బిక్కుబిక్కుమంటు న్నాయి. హైవే విస్తరణకు అవి బలికానున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకుగాను వృక్షాలపై వేటు వేయనున్నారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 83 చ.కి.మీ. పరిధిలో (దాదాపు 20 వేల ఎకరాల్లో) యురేనియం తవ్వకాలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలోనే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలో మరో ఉపద్రవం ఎదురుకానుంది. రోడ్డు విస్తరణపేరిట పులుల అభయారణ్యంలోని నేష నల్ హైవే 765 మీదుగా దాదాపు 60 కి.మీ. పరిధిలో 20 వేల చెట్ల వరకు నేలకూలనున్నాయి. మార్కింగ్‌లు పూర్తి... నేషనల్ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో తోకపల్లి నుంచి హైదరాబాద్ వరకు చేపడుతున్న రోడ్డుప్రాజెక్టులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వేలాది చెట్లు కొట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ నేతృత్వంలో మార్కింగ్‌లు కూడా పూర్తయ్యాయి. ఆమ్రాబాద్ పులుల అభయార ణ్యం మీదుగా శ్రీశైలంకు వెళ్లే మార్గం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ నుంచి రాష్ట్ర అటవీశాఖకు అయిదారు నెలల కిందటే ప్రతిపాదనలు అం దాయి. వీటిని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధి కారులకు అటవీశాఖ పంపించింది. ఈ ప్రతి పాదనలకు అనుగుణంగా ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ నివేదికను సిద్ధం చేసింది. మరో వారం, పదిరోజుల్లోనే ఈ నివేదికపై మళ్లీ జిల్లా అటవీ అధికారి, డీఎఫ్‌వో, ఫీల్డ్ ఆఫీసర్లు వాల్యువేషన్ రిపోర్ట్‌ను సిద్ధం చేసి రాష్ట్ర అటవీ శాఖకు పంపిస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు, కేంద్ర వన్యప్రాణిబోర్డుకు ఈ నివేదికలు పంపించాక, ఈ ప్రాజెక్టు ఎప్పుడు ‘ప్రారంభించాలనే దానిపై నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్ని వేల చెట్లు పోతాయి, వాట విలువ ఏమిటీ, అడవి ఏ మేరకు నష్టపోతుంది, దెబ్బతినే అటవీ భూమి విస్తీర్ణం ఎంత తదితర వివరాలను ఈ నివేదికలో జిల్లా అటవీ అధికారులు పొందుపరుస్తారు. తదనుగుణంగా డబ్బు రూపంలో ఎంత పరిహారమివ్వాలి, కోల్పోయిన అటవీభూమికి ఇతర భూములు ఎక్కడ ఎన్ని ఎకరాల మళ్లించాలి.. తదితర అంశాలపై నేషనల్ హైవే నిర్ణయం తీసుకుంటుంది. శని, ఆదివారాల్లోనే రద్దీ... శ్రీశైలంకు వెళ్లే వాహనాల రద్దీ శని, ఆదివారాల్లోనే ఎక్కువగా ఉంటుందనేది అటవీ శాఖ అధికారుల అంచనా. మామూలు రోజుల్లో ఈ దారిలో వెళ్లే వాహనాల సంఖ్య వెయ్యిలోపే ఉంటుందని, వీకెండ్స్, సెలవురోజుల్లో రెండున్నర వేల వరకు వీటి సంఖ్య ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల రోడ్డు విస్తరణతో అడవికి నష్టం చేయడం సరికాదని పర్యవరణవేత్తలు కూడా సూచిస్తున్నారు. విస్తరణ ఎందుకు? ఇరుకైన సింగిల్ రోడ్డు వల్ల శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నేషనల్ హైవేస్ అథారిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ రోడ్డులో మూలమలుపులు ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని విస్తరణ ద్వారా సరిచేయాలని తెలిపింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మన్ననూరు గ్రామం నుంచి శ్రీశైలం దేవాలయానికి వెళ్లేందుకు ఉన్న శ్రీశైలం బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ చేపడతారు. దోమలపెంట గ్రామం వద్ద ఈ రోడ్డు ముగుస్తుంది. ఈ 60 కి.మీ. పరిధి అంతా కూడా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోనే ఉంది. రోడ్డు వెడల్పు వల్ల అడవికి, వేలాది చెట్లకు, జంతువులకు, పులుల అభయాణ్యానికి నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాహనాలు పెరిగి కాలుష్య ప్రభావం కూడా ఈ టైగర్ రిజర్వ్‌పై పడుతుంది.వాహనాల వేగం పెరిగి జంతువులు ప్రమాదాల బారిన పడే అవకాశం పెరుగుతుంది. -
అమ్రాబాద్‌లో అధికంగా యురేనియం
సాక్షి, నాగార్జునసాగర్: కృష్ణానది తీర ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో యురేనియం ఖనిజం తవ్వకాలు జరపాలని, అపారమైన నిల్వలు వెలికితీసి ఖర్మాగారాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రదేశమంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయతీరాలలోనే ఉండటంతో ఆయా ప్రాంతాలలోని నివాసితులంతా యురేనియం నిల్వలు వెలికి తీసేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యురేనియం ప్రాముఖ్యత ఏమిటి? దీన్ని ఎలా వెలికితీస్తారు? ఎలా శుద్ధి చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే దాదాపు 92 మూలకాల్లో యురేనియం ఒకటి. మొత్తం మూలకాల్లో దీని ద్వారా మాత్రమే అణువిద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అస్థిరమైన అణు నిర్మాణం, రేడియో ధార్మికత లక్షణాలు దీనికి కారణం. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ ఉత్పత్తిలో యురేనియం కీలక పాత్ర పోషిస్తుంది. నేల, నీరు మనిషితో పాటు అన్ని జంతువుల్లో అతి తక్కువ మోతాదులో యురేనియం ఉంటుంది. కానీ వీటి నుంచి వాణిజ్య స్థాయిలో యురేనియంను ఉత్పత్తి చేయలేం. అందువల్ల యురేనియం ఎక్కువగా ఉన్న ఖనిజాలను గుర్తించి వాటినుంచి యురేనియంను వేరుచేసి ఉపయోగిస్తారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని నల్లమల అడవులు గల ప్రాంతాల్లో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఇటువంటి ఖనిజాలు అభ్యమవుతున్నాయి. యురేనియం సాధారణంగా పిచ్‌బ్లెండ్, యురేనైట్ అనే ఖనిజాల్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఖనిజాల నుంచి ఎలా వేరు చేస్తారు? ముడి ఖనిజాన్ని ముందు బాగా వేడి చేస్తారు. ఫలితంగా అందులో ఉన్న కర్భన, గంధక సంబంధ పదార్థాలు తొలిగిపోతాయి. తర్వాత ఆమ్ల, క్షార ద్రవాలతో ఖనిజాన్ని శుద్ధిచేస్తారు. దీనివల్ల యురేనియం మినహాయించి మిగిలిన మూలకాలు ఇతర రూపాల్లోకి మారిపోతాయి. మిగిలిన ద్రవానికి సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నిషియం వంటి వాటిని కలుపుతారు. దీంతో యురేనియం ఉన్న పదార్థం అవక్షేపంగా మిగిలిపోతుంది. ఇది పసుపురంగులో ఉంటుంది. దీన్నే ఎల్లో కేక్ అంటారు. దీనిని మళ్లీ శుద్ధిచేసి అణువిద్యుత్ రియాక్టర్లలో ఉపయోగిస్తారు. ఎల్లో కెక్ నైట్రిక్ యాసిడ్‌తో కలిపి ఒక ద్రావణంగా తయారు చేస్తారు. ఈ ద్రావణానికి ట్రైబ్యూటైల్ ఫాస్పేట్, కిరోసిన్ లేదా తగిన హైడ్రోకార్బన్లను కలపడం ద్వారా యురేనియంను వేరు చేస్తారు. దీనికి ఆమ్లంతో కలిపిన నీటిని చేరుస్తారు. దీనివల్ల శుద్ధ యురేనైల్ నైట్రేట్ వేరవుతుంది. ఈ యురేనైల్ నైట్రేట్‌కు కొన్ని రసాయనాలను కలుపుతారు. అప్పుడు జరిగే రసాయన చర్య వల్ల యురేనియం ఫ్లోరైడ్ ఏర్పడుతుంది. దీని నుంచి ఫ్లోరైడ్‌ను వేరు చేస్తారు. అప్పుడు అణువిద్యుత్ రియాక్టర్లలో వాడే యురేనియం లోహం తయారవుతుంది. దీన్ని కనుగొన్నదెవరు ? యురేనియంను జర్మనీ రసాయనిక శాస్త్రవేత్త మార్టిన్‌క్లాప్రోత్ 1798లో కనుగొన్నారు. యురేనియం రేడియో ధార్మికత లక్షణాన్ని 1896లో హెన్రీ ఆంటోని బెక్యూరెల్ అనే శాస్త్రవేత్త తొలిసారి గుర్తించారు. శుద్ధి చేసిన యురేనియం వెండి రంగులో ఉంటుంది. యురేనియం సహజ సిద్ధంగా వెండికంటే దాదాపు 40 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. యురేనియం అణువులను విడగొట్టడం ద్వారా శక్తిని రాబట్టవచ్చని 1938లో ఒట్టోహన్, ఫిట్జ్, స్ట్రాట్స్మన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక టన్ను యురేనియం ద్వారా దాదాపు నాలుగు కోట్ల కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది 16 వేల టన్నుల బొగ్గు, లేదా 8 వేల బ్యారెళ్ల ముడిచమురు ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుకు సమా నం. అణువిద్యుత్తు, అణ్వాస్త్రాల్లో కాకుండా రంగురంగుల అద్దాల తయారీలోనూ యురేనియంను ఉపయోగిస్తారు. చిన్నచిన్న అణురియాక్టర్లలో యురేనియం ఐసోటోపులను తయారు చేసి వైద్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 2001 నాటికి ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయిన యురేనియం 35,767 మెట్రిక్ టన్నులు. అణ్వాస్త్రాల్లో ఉపయోగించే ప్లూటోనియం కూడా యురేనియం ద్వారానే లభిస్తుంది. అణు రియాక్టర్లలో ఇంధనంగా యురేనియంను వాడిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాల్లో ఫ్లూటోనియం ఒకటి. ఇంత విలువ కలిగిన యురేనియం నిల్వలు జిల్లాలోని పెద్దవూర, పెద్దఅడిశర్లపల్లి, నేరడుగొమ్ము, చందంపేట మండలాలతో పాటు మహబూబ్‌నగర్ నాగర్‌కర్నూల్ జిల్లాలో అపారమైన నిల్వలున్నాయి. సాగర్ తీరంలోగల పెద్దగట్టు, నంబాపూర్ తదితర ప్రాంతాల్లో 490 టన్నుల యురేనియం నిల్వలు లభించే అవకాశమున్నట్లుగా కేంద్ర అణుపరిశోధన సంస్థ గుర్తించింది. రిజర్వాయర్ వెంట 1337.62 ఎకరాల విస్తీర్ణంలో గనుల తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. ఇందులో 1140.91 ఎకరాలు అటవీశాఖ ఆధీనంలో ఉండగా 196.70 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి సేకరించాల్సి ఉంది. 2005లోనే యూసీఐల్ దాదాపుగా రూ.300 కోట్ల అంచనా వ్యయంతో యురేనియం ప్రాజెక్టు పనులను నిర్వహించేందుకు నిర్ణయించింది. పెద్దగట్టు ప్రాంతాన్ని మూడు బ్లాకులుగా విభజించింది. పెద్దగట్టుప్రాంతంలో మొదటి, రెండవ బ్లాకుల్లో అండర్ గ్రౌండ్మైనింగ్ నిర్వహించేందుకు నిర్ణయించారు. అప్పట్లో పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన విషయం తెలిసిందే. -
ఉరుముతున్న యురేనియం: మొదలైతే.. ఇరవై ఏళ్ల దాకా తవ్వకాలు
సాక్షి, నల్లగొండ: జిల్లాపై యురేనియం పిడుగు పడనుందా..? పదహారేళ్ల కిందట, 2003 లోనే అటకెక్కిన యురేనియం గనుల తవ్వకం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ల బూజు దులుపుతున్నారా..? పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని ‘లంబాపూర్–పెద్దగట్టు’ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాలని తలపెట్టి నివేదికలు కూడా పూర్తి చేసిన యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నాడు జరిగిన ప్రజాందోళనలతో వెనక్కి తగ్గింది. ఒక ఓపెన్ కాస్ట్మైన్ , మూడు భూగర్భ గనులతో పాటు మల్లాపూర్ వద్ద యురేనియం శుద్ధికర్మాగారం (ప్రాసెసింగ్ ప్లాంట్) ఏర్పా టు చేయాలన్న ప్రతిపాదనలు నివేదికల వరకు వచ్చి ఆగాయి. ఇప్పుడు మరో మారు లంబాపూర్–పెద్దగట్టు గనుల వ్యవహారం తెరపైకి వచ్చింది. మొదలైతే.. ఇరవై ఏళ్ల దాకా తవ్వకాలు దేవరకొండ నియోజకవర్గలోని పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లె)మండలంలోని లంబాపూర్, నామాపురం, ఎల్లాపురం, పులిచర్ల, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో ఒక ఓపెన్ కాస్ట్ గనితో పాటు, మరో మూడు భూగర్భ గనుల్లో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించి, 2003 వరకు డీపీఏ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) రూపొందించారు. ఈ గనులకు అనుంబంధంగా మల్లాపూర్‌లో ట్రీట్ మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. కానీ, అన్ని వర్గాలనుంచి వచ్చిన వ్యతిరేకతతో యూసీఐఎల్ అధికారులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లిలో కొత్త గనులు ఏర్పాటయ్యాయి. ఈ మధ్యలో నల్లమలలో తవ్వకాలు చేపట్టాలని నమూనా సేకరణల కోసం అచ్చంపేట నియోజకవర్గంలోని పల్లెలు, చెంచు పెంటల్లో పదుల సంఖ్యలో బోర్లు తవ్వారు. ఇప్పుడు అకస్మాత్తుగా నల్లగొండ జిల్లాలోనే తవ్వకాలు అంటూ కొత్త వార్తలు వెలువడ్డాయి. పాత నివేదికల ప్రకారం జిల్లాలో ఏర్పాటయ్యే గనుల ద్వారా ప్రతిరోజూ 1250 టీపీడీ (టన్ పర్ డే) ల చొప్పున ఇరవై ఏళ్ల పాటు తవ్వకాలు చేపట్టొచ్చని తేల్చారు. దీనికోసం 1301.35 ఎకరాలు అవసరమని గుర్తించారు. కాగా, ఇందులో 1104.64 ఎకరాలు రిజర్వ్ అటవీ భూమి కావడంతో అనుమతులు అవసరం అయ్యాయి. మరో 196.71 ఎకరాలు మాత్రమే అనుమతులు అక్కర్లేని భూమిగా గుర్తించారు. ఇక, మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాలని తలపెట్టిన ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 760 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాంతాల్లో భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వంనుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ అందలేని జిల్లా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రచారం, వార్తలు ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. నల్లమల అనుకుంటే.. కృష్ణపట్టెపై ఉరుము వాస్తవానికి గడిచిన కొద్ది రోజులుగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో యురేనియం వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధానంగా అమ్రాబాద్ మండల పరిధిలోని గ్రామాలు, చెంచు పెంటలు అట్టుడుకుతున్నాయి. ఆయా పార్టీలూ, ప్రజా సంఘాలు గ్రామాలను, చెంచు పెంటలను చుట్టివస్తున్నారు. సేవ్ నల్లమల ఉద్యమాలూ బయలుదేరాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామాలను వీడబోమని, పెంటలు దాటి బయటకు రామని అటు సాధారణ ప్రజలు, ఆదివాసీలైన చెంచులు తెగేసి చెబుతున్నారు. అమ్రాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతాన్నే ఆనుకుని ఉన్న దేవరకొండ నియోజకవర్గం పరిధిలో సుమారు ఏడు చదరపు కిలోమీటర్ల పరిధిలో తవ్వకాలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ఒక విధంగా అందరి దృష్టీ నల్లమలపై కేంద్రీకృతమై ఉండగా.. అసలు తవ్వకాలు అక్కడ కాదు, నల్లగొండ జిల్లాలో అని వార్తలు వెలువడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2003లోనే ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టారని భావిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లంబాపూర్–పెద్దగట్టు యురేనియం గనులకు అనుమతులు ఇచ్చిందని, పర్యావరణ అనుమతులూ లభించాయని జరుగుతున్న ప్రచారంతో ఈ ప్రాంతం ఒక్క సారిగా ఉలిక్కి పడుతోంది. అడ్డుకుని తీరుతం ‘పీఏపల్లి మండలంలో తిరిగి యురేనియం త వ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందు కు వచ్చి అనుమతులు ఇస్తే.. యూసీఐఎల్‌ను, వారి కార్యకలాపాలను అడ్డుకుని తీరుతం. తవ్వకాలు మొదలైతే.. కృష్ణా జలాలు పూర్తిగా విషతుల్యం కావడం అనివార్యం. ఈ ప్రాంత ప్రజలు, జీవజాతులపై, గాలిపై, నీరుపై తీవ్ర ప్రభావం చూపే యురేనియం తవ్వకాలు జరగనీయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దూకుడును అడ్డుకోవాలి..’ లంబాపూర్–పెద్దగట్టు యురేనియం ప్రాజెక్టుపై గతంలో ఉద్యమాలు చేపట్టిన మట్టిమనిషి సంస్థ వ్యవస్థాపకుడు వేనేపల్లి పాండురంగారావు పేర్కొన్నారు. -
నల్లమలలో అణు అలజడి!
సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ అంశం అక్కడి గిరిపుత్రులు, పర్యావరణ ప్రేమికులు, ఇతర వర్గాల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా, పలు రకాల చెంచు జాతులు, అత్యంత జీవవైవిధ్యం గల ప్రదేశంగా ఈ అభయారణ్యానికి పేరుంది. ఇక్కడ యురేనియం అన్వేషణ కోసం సర్వేలకు కేంద్రం తుది అనుమతి లభిస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయనే చర్చ సాగుతోంది. ఈ ఏడాది మే 22న ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ సలహా మండలి భేటీలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో కేంద్ర అణుఇంధనశాఖ పరిధిలోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) సర్వేలు చేపట్టేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. అన్వేషణపై ఏఎండి నుంచి అందిన ప్రతిపాదనల్లో స్పష్టత కొరవడిందనే అభిప్రాయం భేటీలో వ్యక్తమైంది. ప్రస్తుతానికి సర్వే కోసమే అనుమతినిస్తున్నట్టు పేర్కొనడంతోపాటు సాంకేతిక అంశాలు, ఎలా తవ్వకాలు జరుపుతారన్న దానిపై ఆధారాలు పరిశీలించాకే ఏఎండీకి తుది అనుమతినిచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ అనుమతులు యురే నియం వెలికితీతకు ఇచ్చిన ఆమోదముద్రేనని పర్యావరణవేత్తలుహెచ్చరిస్తున్నారు. తాజా ప్రతిపాదనలు కోరిన కేంద్ర అటవీ శాఖ యురేనియం నిల్వల అన్వేషణపై సాంకేతికాంశాలు, సర్వే నిర్వహణ పూర్తి వివరాలు, పత్రాలను తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపించాలని ఏఎండీకి కేంద్ర అటవీశాఖ సూచించింది. సర్వే చేపట్టే విధానం, తదితర విషయాలపై స్పష్టమైన సమాచారం, వివరాలను ఫారం–సీ రూపంలో నిర్ణీత ఫార్మాట్లో కొత్త ప్రతిపాదనల రూపంలో పంపించాలని ఏఎండీకి రాష్ట్ర అటవీశాఖ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల్లో ఈ అంశాలన్నింటికి సమాధానం లభిస్తే అప్పుడు అనుమతిపై ఆలోచించవచ్చని, అందువల్ల ఇప్పుడే ఏదో జరిగిపోతుందని భావించడానికి లేదంటున్నారు యురేనియం నిక్షేపాలు ఉన్న కేంద్రాలను గుర్తిస్తున్న మ్యాప్ తుది నిర్ణయమేదీ తీసుకోలేదు: పీసీసీఎఫ్ పీకే ఝా అమ్రాబాద్ అభయారణ్యంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు అవసరమైన సర్వేకు అనుమతిపై తాజాగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదని ‘సాక్షి’ ప్రతినిధితో అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ప్రశాంత్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఏఎండీ గత ప్రతిపాదనల్లో స్పష్టత లేనందున నిర్ణీత ఫార్మాట్లో పూర్తి వివరాలు, సమాచారంతోపాటు, ఆయా సాంకేతిక అంశాలపైనా స్పష్టతతో కూడిన వివరణలు అవసరమవుతాయన్నారు. కేంద్రం నుంచి స్పందనలు, సూచనలు, సలహాలను బట్టి తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికిప్పుడు యురేనియం నిల్వల అన్వేషణకు అనుమతిపై రాష్ట్ర అటవీశాఖ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. వైఎస్సార్ నిలిపేశారు.. అయినా! నల్లమలలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం 2611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ అభయారణ్యం. 445.02 చదరపు కిలో మీటర్ల బఫర్ జోన్‌గా ఏర్పాటు చేశారు. 2008 నుంచి నల్లమలలో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అప్పట్లో డీబీర్ అనే ఎమ్మెన్సీకి కేంద్ర ప్రభుత్వం ఈ అన్వేషణ బాధ్యత అప్పగిస్తే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీన్ని నిలిపివేశారు. అన్ని రాజకీయ పార్టీలూ కేంద్రం నిర్ణయంపై ఆందోళనలు నిర్వహించాయి. అప్పుడు కాస్త వెనక్కు తగ్గినట్లు అనిపించినా.. 2012 మే నెలలో అమ్రాబాద్ మండలంలోని తిర్మలాపూర్ (బీకే)లో వ్యవసాయ పొలాల వద్ద అడవి ప్రాంతంలో 27 బోర్లు వేశారు. బోర్లు ఉచితంగా వేస్తున్నారని రైతులు సంతోషపడ్డారు. అసలు విషయం తెలియడంతో బోరు బావుల తవ్వకాలను అడ్డుకొని బోరు వాహనాలపై దాడి చేశారు. అయితే యురేనియం కోసం నిర్వహించిన సర్వే సత్పలితాలు ఇవ్వడంతో దానికి కొనసాగింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే అటవీశాఖ ముసుగులో 2017 మే, జూన్ నెలలో పదర మండలం ఉడిమిళ్ల, పదర, మన్ననూర్ తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహించి చెట్ల కొలతలు చేపట్టారు. డ్రిల్లింగ్‌తో ముప్పే! రాష్ట్రంలోని అటవీప్రాంతాల్లోని మొత్తం 4బ్లాకుల్లో యురేనియం నిల్వల అన్వేషణ చేపట్టాలని ఏఎండీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని ఒకచోట 20–25 చదరపు ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టవచ్చునని తెలుస్తోంది. అయితే సర్వేలో భాగంగా చేపట్టే డ్రిల్లింగ్‌తో అటవీ సమతుల్యతపై ప్రభావం చూపడంతో పాటు అక్కడి ప్రజల జీవనవిధానం ఇబ్బందుల్లో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభావితమయ్యే గ్రామాలు.. పదర మండలం పరిధిలో: ఉడిమిళ్ల, పెట్రాల్‌చెన్ పెంట, చిట్లంకుంట, చెన్నంపల్లి, వంకేశ్వరం, పదర, కోడోన్పల్లి, రాయగండి తాండా, జోతినాయక్తండా, కండ్ల కుంట. అమ్రాబాద్ మండలం పరిధిలో: కుమ్మరోనిపల్లి, జంగంరెడ్డిపల్లి, కల్ములోనిపల్లి, తెలుగుపల్లి, మాచారం, మన్ననూర్, ప్రశాంత్‌నగర్ కాలనీ, అమ్రాబాద్. వీటితో పాటు అచ్చంపేట పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం అడవిని వదలబోం తరతరాలుగా ఈ అడవితల్లినే నమ్మకొని జీవిస్తున్నాం. ఇప్పుడు యురేనియం అంటూ తవ్వకాలు జరుపుతారని అనుకుంటున్నరు. ఏడాదిగా ఇదే మాట నడుస్తున్నది. అడవి తల్లిని నమ్ముకొని బతుకుతున్నం. ఎవరొచ్చినా అడవిని వదిలేది లేదు. – వీరయ్య, చెంచు, కొమ్మెనపెంట కార్యాచరణ రూపొందిస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి యూరేనియంపై అభిప్రాయాలు సేకరించాం. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి గ్రామంలో తిరిగి ప్రజలను చైతన్యం చేస్తాం. ఈ ప్రాంత బిడ్డలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలు జరపనివ్వం. – వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్. అస్తిత్వం కోల్పోనున్న చెంచులు నల్లమలలో 112 చెంచుపెంటల్లో దాదాపు 12వేల మంది చెంచులు నివసిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల అడవిని నమ్ముకొని జీవిస్తున్న చెంచులు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చి పండింది. వేగంగా అంతరిస్తున్న ఆదిమ జాతుల్లో చెంచులు కూడా ఉన్న నేపథ్యంలో వారి చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల్సిన సమయంలో యురేనియం తవ్వకాల పేరిట ఆదిమ జాతిని మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలతో ప్రజాసంఘాలు, పార్టీలు, చెంచులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తవ్వకాలను అడ్డుకుంటాం నల్లమలలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం. యురేనియం పేరుతో అటవీ సంపదను కాజేయాలని చూస్తున్నారు. దీని రేడియేషన్‌తో జీవకోటి మనుగడకు ముప్పు నెలకొంది. దేశంలోనే పెద్దదైన అమ్రాబాద్ రిజర్వుఫారెస్టు, వన్యప్రాణులకు తీవ్ర నష్టంతోపాటు కృష్ణానది జాలాలు కూడా కలుషితమవుతాయి. – నాసరయ్య (యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు) -
యురేనియం ప్రాజెక్టుకు బ్రేక్
అలాంటి చర్యలేమీ లేవు... వన్యప్రాణి బోర్డు ప్రకటన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిల్వల వెలికితీతకు బ్రేక్ పడింది. అక్కడ మైనింగ్ ద్వారా యురేనియం వెలికితీతకు చర్యలేమీ చేపట్టడం లేదంటూ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సోమవారం జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది. అయితే నిజానికి ఇక్కడ లభించే యురేనియం అంత నాణ్యమైనది కాదు గనక పెద్దగా ఉపయోగముండదన్న కేంద్ర యురేనియం కార్పొరేషన్ నివేదికల వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మైనింగ్ ద్వారా యురేనియాన్ని వెలికితీయాలని కాకుండా అధ్యయనం, పరిశీలన చేయాలని మాత్రమే ప్రతిపాదిస్తున్నట్లు తాజా సమావేశంలో బోర్డు వివరణ ఇచ్చింది. యురేనియం నిల్వల కోసం అన్వేషణకు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని పులుల రిజర్వ్‌లో అనుమతి, కవ్వాల్ అభయారణ్యంలో పగటి పూట భారీ వాహనాలకు అనుమతి తదితరాల నుంచి కూడా బోర్డు వెనక్కు తగ్గింది. మరోవైపు బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి తమ్మిడిహెట్టి గ్రామం వద్ద బ్యారేజీ నిర్మాణానికి వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోని పులుల అభయారణ్యాల మీదుగా 1,081 హెక్టార్లలో రాష్ట్ర పరిధిలోని 622 హెక్టార్ల మేర అటవీ భూమిని ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు అంగీకారం తెలిపింది. ఇక, బెజ్జూరు అడవుల్లో రాబందుల అభయారణ్యం ఏర్పాటు కానుంది. కర్ణాటక తర్వాత ఇది దక్షిణాదిలోనే రెండోది! కవ్వాల్’ రాకపోకలపై అధ్యయన కమిటీ: కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి భారీ వాహనాల రాకపోకలపై అధ్యయనానికి నలుగురు సభ్యుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ మండలి నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ నుంచి మంచిర్యాల మధ్య మార్గంలోని టైగర్ రిజర్వ్ నుంచి వాహనాల రాకపోకలపై కమిటీ అధ్యయనం చేయనుంది. సోమవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.