సాక్షి, హైదరాబాద్/నాగర్‌కర్నూల్: అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ అంశం అక్కడి గిరిపుత్రులు, పర్యావరణ ప్రేమికులు, ఇతర వర్గాల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా, పలు రకాల చెంచు జాతులు, అత్యంత జీవవైవిధ్యం గల ప్రదేశంగా ఈ అభయారణ్యానికి పేరుంది. ఇక్కడ యురేనియం అన్వేషణ కోసం సర్వేలకు కేంద్రం తుది అనుమతి లభిస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయనే చర్చ సాగుతోంది. ఈ ఏడాది మే 22న ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ సలహా మండలి భేటీలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో కేంద్ర అణుఇంధనశాఖ పరిధిలోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) సర్వేలు చేపట్టేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. అన్వేషణపై ఏఎండి నుంచి అందిన ప్రతిపాదనల్లో స్పష్టత కొరవడిందనే అభిప్రాయం భేటీలో వ్యక్తమైంది. ప్రస్తుతానికి సర్వే కోసమే అనుమతినిస్తున్నట్టు పేర్కొనడంతోపాటు సాంకేతిక అంశాలు, ఎలా తవ్వకాలు జరుపుతారన్న దానిపై ఆధారాలు పరిశీలించాకే ఏఎండీకి తుది అనుమతినిచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ అనుమతులు యురే నియం వెలికితీతకు ఇచ్చిన ఆమోదముద్రేనని పర్యావరణవేత్తలుహెచ్చరిస్తున్నారు.
తాజా ప్రతిపాదనలు కోరిన కేంద్ర అటవీ శాఖ
యురేనియం నిల్వల అన్వేషణపై సాంకేతికాంశాలు, సర్వే నిర్వహణ పూర్తి వివరాలు, పత్రాలను తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపించాలని ఏఎండీకి కేంద్ర అటవీశాఖ సూచించింది. సర్వే చేపట్టే విధానం, తదితర విషయాలపై స్పష్టమైన సమాచారం, వివరాలను ఫారం–సీ రూపంలో నిర్ణీత ఫార్మాట్‌లో కొత్త ప్రతిపాదనల రూపంలో పంపించాలని ఏఎండీకి రాష్ట్ర అటవీశాఖ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల్లో ఈ అంశాలన్నింటికి సమాధానం లభిస్తే అప్పుడు అనుమతిపై ఆలోచించవచ్చని, అందువల్ల ఇప్పుడే ఏదో జరిగిపోతుందని భావించడానికి లేదంటున్నారు
యురేనియం నిక్షేపాలు ఉన్న కేంద్రాలను గుర్తిస్తున్న మ్యాప్
తుది నిర్ణయమేదీ తీసుకోలేదు: పీసీసీఎఫ్ పీకే ఝా
అమ్రాబాద్ అభయారణ్యంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు అవసరమైన సర్వేకు అనుమతిపై తాజాగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదని ‘సాక్షి’ ప్రతినిధితో అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) ప్రశాంత్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఏఎండీ గత ప్రతిపాదనల్లో స్పష్టత లేనందున నిర్ణీత ఫార్మాట్‌లో పూర్తి వివరాలు, సమాచారంతోపాటు, ఆయా సాంకేతిక అంశాలపైనా స్పష్టతతో కూడిన వివరణలు అవసరమవుతాయన్నారు. కేంద్రం నుంచి స్పందనలు, సూచనలు, సలహాలను బట్టి తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికిప్పుడు యురేనియం నిల్వల అన్వేషణకు అనుమతిపై రాష్ట్ర అటవీశాఖ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు.
వైఎస్సార్ నిలిపేశారు.. అయినా!
నల్లమలలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం 2611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ అభయారణ్యం. 445.02 చదరపు కిలో మీటర్ల బఫర్ జోన్‌గా ఏర్పాటు చేశారు. 2008 నుంచి నల్లమలలో ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అప్పట్లో డీబీర్ అనే ఎమ్మెన్సీకి కేంద్ర ప్రభుత్వం ఈ అన్వేషణ బాధ్యత అప్పగిస్తే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీన్ని నిలిపివేశారు. అన్ని రాజకీయ పార్టీలూ కేంద్రం నిర్ణయంపై ఆందోళనలు నిర్వహించాయి. అప్పుడు కాస్త వెనక్కు తగ్గినట్లు అనిపించినా.. 2012 మే నెలలో అమ్రాబాద్ మండలంలోని తిర్మలాపూర్ (బీకే)లో వ్యవసాయ పొలాల వద్ద అడవి ప్రాంతంలో 27 బోర్లు వేశారు. బోర్లు ఉచితంగా వేస్తున్నారని రైతులు సంతోషపడ్డారు. అసలు విషయం తెలియడంతో బోరు బావుల తవ్వకాలను అడ్డుకొని బోరు వాహనాలపై దాడి చేశారు. అయితే యురేనియం కోసం నిర్వహించిన సర్వే సత్పలితాలు ఇవ్వడంతో దానికి కొనసాగింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే అటవీశాఖ ముసుగులో 2017 మే, జూన్ నెలలో పదర మండలం ఉడిమిళ్ల, పదర, మన్ననూర్ తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహించి చెట్ల కొలతలు చేపట్టారు.
డ్రిల్లింగ్‌తో ముప్పే!
రాష్ట్రంలోని అటవీప్రాంతాల్లోని మొత్తం 4బ్లాకుల్లో యురేనియం నిల్వల అన్వేషణ చేపట్టాలని ఏఎండీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని ఒకచోట 20–25 చదరపు ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టవచ్చునని తెలుస్తోంది. అయితే సర్వేలో భాగంగా చేపట్టే డ్రిల్లింగ్‌తో అటవీ సమతుల్యతపై ప్రభావం చూపడంతో పాటు అక్కడి ప్రజల జీవనవిధానం ఇబ్బందుల్లో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభావితమయ్యే గ్రామాలు..
పదర మండలం పరిధిలో: ఉడిమిళ్ల, పెట్రాల్‌చెన్ పెంట, చిట్లంకుంట, చెన్నంపల్లి, వంకేశ్వరం, పదర, కోడోన్‌పల్లి, రాయగండి తాండా, జోతినాయక్‌తండా, కండ్ల కుంట.
అమ్రాబాద్ మండలం పరిధిలో: కుమ్మరోనిపల్లి, జంగంరెడ్డిపల్లి, కల్ములోనిపల్లి, తెలుగుపల్లి, మాచారం, మన్ననూర్, ప్రశాంత్‌నగర్ కాలనీ, అమ్రాబాద్. వీటితో పాటు అచ్చంపేట పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం
అడవిని వదలబోం
తరతరాలుగా ఈ అడవితల్లినే నమ్మకొని జీవిస్తున్నాం. ఇప్పుడు యురేనియం అంటూ తవ్వకాలు జరుపుతారని అనుకుంటున్నరు. ఏడాదిగా ఇదే మాట నడుస్తున్నది. అడవి తల్లిని నమ్ముకొని బతుకుతున్నం. ఎవరొచ్చినా అడవిని వదిలేది లేదు.
– వీరయ్య, చెంచు, కొమ్మెనపెంట
కార్యాచరణ రూపొందిస్తాం
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి యూరేనియంపై అభిప్రాయాలు సేకరించాం. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి గ్రామంలో తిరిగి ప్రజలను చైతన్యం చేస్తాం. ఈ ప్రాంత బిడ్డలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలు జరపనివ్వం.
– వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్.
అస్తిత్వం కోల్పోనున్న చెంచులు
నల్లమలలో 112 చెంచుపెంటల్లో దాదాపు 12వేల మంది చెంచులు నివసిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల అడవిని నమ్ముకొని జీవిస్తున్న చెంచులు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చి పండింది. వేగంగా అంతరిస్తున్న ఆదిమ జాతుల్లో చెంచులు కూడా ఉన్న నేపథ్యంలో వారి చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల్సిన సమయంలో యురేనియం తవ్వకాల పేరిట ఆదిమ జాతిని మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలతో ప్రజాసంఘాలు, పార్టీలు, చెంచులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.
తవ్వకాలను అడ్డుకుంటాం
నల్లమలలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం. యురేనియం పేరుతో అటవీ సంపదను కాజేయాలని చూస్తున్నారు. దీని రేడియేషన్‌తో జీవకోటి మనుగడకు ముప్పు నెలకొంది. దేశంలోనే పెద్దదైన అమ్రాబాద్ రిజర్వుఫారెస్టు, వన్యప్రాణులకు తీవ్ర నష్టంతోపాటు కృష్ణానది జాలాలు కూడా కలుషితమవుతాయి.
– నాసరయ్య (యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు)
Comments
Please login to add a commentAdd a comment