సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ పులుల అభయారణ్యం(ఏటీఆర్)లో ఉన్న పులుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అక్కడ పధ్నాలుగు పులులున్నట్టుగా అటవీ అధికారులు గుర్తించారు. ఏటీఆర్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న వన్యప్రాణుల వివరాలనుఅటవీశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పులులతోపాటు మొత్తం 43 రకాల వన్యప్రాణులు ఉన్నట్టు అటవీశాఖ గుర్తించింది. నివేదిక ప్రకారం... వన్యప్రాణుల్లో అరుదైన హానీ బాడ్జర్ లాంటి జంతువులు, వందలాది రకాల పక్షిజాతులు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
ప్రతి ఏడాది నిర్వహించే కసరత్తులో భాగంగా స్టేటస్ ఆఫ్ టైగర్స్ అండ్ ప్రే బేస్ ఇన్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2021 (వైల్డ్‌లైఫ్ సెన్సెస్ రిపోర్ట్)ను శుక్రవారం విడుదల చేశారు. నల్లమల అటవీప్రాంతమైన (2,611 చదరపు కిలోమీటర్ల పరిధి) అమ్రాబాద్‌లోని కోర్ ఏరియాలో పరిశీలన చేశారు. లైన్ ట్రాన్సిక్ట్ మెథడ్, వాటర్ హోల్ సెన్సస్‌ల ఆధారంగా జంతువులను లెక్కించారు. పులులతోపాటు వాటి వేటకు ఆధారమైన శాఖాహార జంతువుల లభ్యతను కూడా పరిశీలించారు. ప్రతిచదరపు కిలోమీటరు విస్తీర్ణంలో జింకలు, చుక్కల దుప్పులు, అడవిపందులు, సాంబార్, లంగూర్ లాంటి జంతువులను లెక్కించారు. పులుల సంఖ్య పెరిగేందుకు వీలుగా అటవీ సంరక్షణకు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని నివేదిక విడుదల సందర్భంగా పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు.
తెలంగాణలో 26 పులులు
2018లో జాతీయస్థాయిలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో పులుల సెన్సెస్ నిర్వహించగా తెలంగాణలో 26 పులులు(అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ కలిపి) ఉన్నట్లు వెల్లడైంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ కొత్త సెన్సెస్ నివేదికను కేంద్రం వెల్లడించనుంది. 2022 సెన్సెస్ నాటికి 32–34 దాకా పులుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కీలకంగా మారిన పులుల సంరక్షణ
అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం, వన్యప్రాణులు ఇలా వివిధ అంశాలన్నీ పులుల సంఖ్య, వాటి స్వేచ్ఛాజీవనంపై ఆధారపడి ఉంటాయి. ఒక్కో పులి స్థిరనివాసంతోపాటు మనుగడ సాగించేందుకు 50 చ.కి.మీ. మేర అటవీ ప్రాంతం అవసరం. పులిపై ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో మిగతా వన్యప్రాణులు, జీవరాశులు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించుకోవడం కీలకంగా మారింది. మనుషుల వేలిముద్రలు, చేతిగుర్తుల మాదిరిగా ఏ రెండు పులుల చారలు, గుర్తులు ఒకేలా ఉండవు.
14 కంటే ఎక్కువగానే పులులుండొచ్చు...
‘అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పులులు, ఇతర జంతువుల సంఖ్య పెరగడం మంచి పరిణామం. ఇక్కడ 14 పులులున్నట్టుగా తేలింది. అయితే సెన్సెస్ చేసే ఏటీఆర్ పరిధిని మరింత విస్తృతపరిస్తే వీటి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. గతంతో పోల్చితే వీటి సంఖ్య 12 నుంచి 14కు పెరిగింది’
– బి.శ్రీనివాస్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స, ఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment