యురేనియం ప్రాజెక్టుకు బ్రేక్
అలాంటి చర్యలేమీ లేవు... వన్యప్రాణి బోర్డు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిల్వల వెలికితీతకు బ్రేక్ పడింది. అక్కడ మైనింగ్ ద్వారా యురేనియం వెలికితీతకు చర్యలేమీ చేపట్టడం లేదంటూ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సోమవారం జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది. అయితే నిజానికి ఇక్కడ లభించే యురేనియం అంత నాణ్యమైనది కాదు గనక పెద్దగా ఉపయోగముండదన్న కేంద్ర యురేనియం కార్పొరేషన్ నివేదికల వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
మైనింగ్ ద్వారా యురేనియాన్ని వెలికితీయాలని కాకుండా అధ్యయనం, పరిశీలన చేయాలని మాత్రమే ప్రతిపాదిస్తున్నట్లు తాజా సమావేశంలో బోర్డు వివరణ ఇచ్చింది. యురేనియం నిల్వల కోసం అన్వేషణకు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని పులుల రిజర్వ్‌లో అనుమతి, కవ్వాల్ అభయారణ్యంలో పగటి పూట భారీ వాహనాలకు అనుమతి తదితరాల నుంచి కూడా బోర్డు వెనక్కు తగ్గింది. మరోవైపు బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి తమ్మిడిహెట్టి గ్రామం వద్ద బ్యారేజీ నిర్మాణానికి వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోని పులుల అభయారణ్యాల మీదుగా 1,081 హెక్టార్లలో రాష్ట్ర పరిధిలోని 622 హెక్టార్ల మేర అటవీ భూమిని ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు అంగీకారం తెలిపింది. ఇక, బెజ్జూరు అడవుల్లో రాబందుల అభయారణ్యం ఏర్పాటు కానుంది. కర్ణాటక తర్వాత ఇది దక్షిణాదిలోనే రెండోది!
కవ్వాల్’ రాకపోకలపై అధ్యయన కమిటీ: కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి భారీ వాహనాల రాకపోకలపై అధ్యయనానికి నలుగురు సభ్యుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ మండలి నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ నుంచి మంచిర్యాల మధ్య మార్గంలోని టైగర్ రిజర్వ్ నుంచి వాహనాల రాకపోకలపై కమిటీ అధ్యయనం చేయనుంది. సోమవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.