Wildlife Board
-
అటవీ పరిహారం పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వన్యప్రాణుల దాడుల్లో (పులులతో సహా) మరణాలు, పంట నష్టాలకు పరిహారం పెంచాలని రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రూ.ఐదు లక్షలు ఉన్న పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నారు. సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (లక్షకు మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (మూడు లక్షలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా, పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు ఆరువేలు ఉన్న పరిహారాన్ని రూ.7,500కు పెంచాలని, పండ్ల తోటలకు నష్టపరిహారం కూడా రూ.7,500కు (గరిష్టంగా యాభై వేల దాకా) పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. సోమవారం అరణ్య భవన్లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు – జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనల కమిటీ సమావేశాలు జరిగాయి. ►అటవీశాఖ నేతృత్వంలో అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ వివరించారు. రాష్ట్రంలో మొదటి సారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్ లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు ►హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. ►హరిణి వసస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి నిబంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతిని ఇచ్చారు. జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్ నిర్మాణం కానుంది. ►శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను అమ్రాబాద్ లో ఉన్న వన్యప్రాణి సంరక్షణ దృష్టిలో పెట్టుకుని బోర్డు తిరస్కరించింది. ఇతర రోడ్డు, ఇరిగేషన్, (కడెం పరిధిలో లక్ష్మీపూర్ లిప్ట్, నాగార్జున సాగర్ పరిధిలో పెద్ద గుట్ట లిప్ట్) కేబుల్ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూ టీమ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సభ్యులు కోవ లక్ష్మి, రాఘవ, బానోతు రవి కుమార్, అనిల్ కుమార్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ.పర్గెయిన్, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు. -
యురేనియం ప్రాజెక్టుకు బ్రేక్
అలాంటి చర్యలేమీ లేవు... వన్యప్రాణి బోర్డు ప్రకటన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిల్వల వెలికితీతకు బ్రేక్ పడింది. అక్కడ మైనింగ్ ద్వారా యురేనియం వెలికితీతకు చర్యలేమీ చేపట్టడం లేదంటూ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సోమవారం జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది. అయితే నిజానికి ఇక్కడ లభించే యురేనియం అంత నాణ్యమైనది కాదు గనక పెద్దగా ఉపయోగముండదన్న కేంద్ర యురేనియం కార్పొరేషన్ నివేదికల వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మైనింగ్ ద్వారా యురేనియాన్ని వెలికితీయాలని కాకుండా అధ్యయనం, పరిశీలన చేయాలని మాత్రమే ప్రతిపాదిస్తున్నట్లు తాజా సమావేశంలో బోర్డు వివరణ ఇచ్చింది. యురేనియం నిల్వల కోసం అన్వేషణకు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని పులుల రిజర్వ్‌లో అనుమతి, కవ్వాల్ అభయారణ్యంలో పగటి పూట భారీ వాహనాలకు అనుమతి తదితరాల నుంచి కూడా బోర్డు వెనక్కు తగ్గింది. మరోవైపు బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి తమ్మిడిహెట్టి గ్రామం వద్ద బ్యారేజీ నిర్మాణానికి వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోని పులుల అభయారణ్యాల మీదుగా 1,081 హెక్టార్లలో రాష్ట్ర పరిధిలోని 622 హెక్టార్ల మేర అటవీ భూమిని ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు అంగీకారం తెలిపింది. ఇక, బెజ్జూరు అడవుల్లో రాబందుల అభయారణ్యం ఏర్పాటు కానుంది. కర్ణాటక తర్వాత ఇది దక్షిణాదిలోనే రెండోది! కవ్వాల్’ రాకపోకలపై అధ్యయన కమిటీ: కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి భారీ వాహనాల రాకపోకలపై అధ్యయనానికి నలుగురు సభ్యుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ మండలి నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ నుంచి మంచిర్యాల మధ్య మార్గంలోని టైగర్ రిజర్వ్ నుంచి వాహనాల రాకపోకలపై కమిటీ అధ్యయనం చేయనుంది. సోమవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. -
సీఎం చైర్మన్‌గా వైల్డ్‌లైఫ్ రాష్ట్ర మండలి ఏర్పాటు
వైస్ చైర్మన్‌గా అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: అటవీ సంరక్షణ, వన్యప్రాణుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ‘వైల్డ్‌లైఫ్’ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైర్మన్‌గా, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న వైస్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో అటవీ ప్రాంతానికి చెందిన ముగ్గురు శాసనసభ్యులు, వన్యప్రాణుల కోసం కృషి చేస్తున్న ముగ్గురు ఎన్జీవో సభ్యులు, 10 మంది పర్యావరణ వేత్తలు, 12 మంది వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. మూడేళ్ల కాల పరిమితితో ఈ వైల్డ్‌లైఫ్ బోర్డు పనిచేస్తుంది. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు, అటవీ విస్తీర్ణం పెంచేందుకు చేయాల్సిన కృషి తదితర అంశాలపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. ఈ మేరకు మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి ఉత్తర్వులు జారీ చేశారు. వైల్డ్‌లైఫ్ సభ్యులు వీరే.. ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, కె.కనకయ్య, జి.బాలరాజ్, ఎన్జీవో సభ్యులు అనిల్ కుమార్ వి ఏపూర్, ఎం.షఫతుల్లా, ఎం. ఇందిరతో పాటు పర్యావరణ వేత్తలు డాక్టర్ కార్తికేయన్, వాసుదేవన్, కె.జగన్మోహన్ రావు (రిటైర్డ్ ఐఎఫ్ఎస్), అవినాశ్ విశ్వనాథన్, డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ వాసుదేవరావు, ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ హెచ్‌వోడీ, హైటికోస్ కార్యదర్శి ఇమ్రాన్ సిద్ధిఖీ, ఫరీదా టాంపాల్, రాథోడ్ జనార్దన్, కనక లక్కేరావు, 12 మంది అధికారులు సభ్యులుగా ఉన్నారు.