సాక్షి, పెద్దఅడిశర్లపల్లి(నల్గొండ) : పీఏపల్లి మండల పరిధిలోని ‘లంబాపూర్–పెద్దగట్టు’ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు ఉంటాయా.. ఉండవా.. ఇన్నాళ్లు దీనిపై కొన్ని అనుమానాలు ఉన్నా తాజా ఘటనతో పటాపంచలయ్యాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్రతినిధులు మంగళవారం నీటి నమూనాల కోసం రావడంతో గ్రామస్తులు వారిని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయని, తాము పోరుబాట పట్టక తప్పదన్న నిర్ణయానికి ఇక్కడి గిరిజనులు వచ్చారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీప్రాంతంలోనే యురేనియం తవ్వకాలు ఉంటాయని ఇప్పటివరకు అనుకున్నారు. అక్కడ ‘సేవ్ నల్లమల’ అంటూ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. కానీ పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టు, లంబాపూర్ తదితర గ్రామాల అటవీప్రాంతంలోనూ తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారన్న విషయం బట్టబయలైంది. ఈ ప్రాంత ప్రజల్లో యురేనియం భయం వెంటాడుతుందన్న సమాచారం మేరకు ‘సాక్షి’ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుని వరుస కథనాలను ప్రచురించింది. కథనాలను చదివిన ఈ ప్రాంతవాసులు యురేనియంపై పోరుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
పెద్దగట్టు గ్రామస్తులతో ప్రజా సంఘాల సమావేశం
యురేనియంపై ప్రజలు చైతన్యవంతులను చేసేందుకు ప్రజా సంఘాలైన తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రజా సైన్స్ వేదిక, ఆదివాసీ హక్కుల జాతీయ హక్కుల వేదిక, తెలంగాణ గిరిజన సంఘాల ప్రతినిధులు మండలంలోని పెద్దగట్టు గ్రామస్తులతో మంగళవారం సమావేశం అయ్యారు. యురేనియంపై పోరుకు తాము అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తవ్వకాలను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం పలు ప్రజా సంఘాల సభ్యులు యురేనియం వ్యతిరేక పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల జాతీయ వేదిక అధ్యక్షులు మిడియం బాబురావు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, ధర్మానాయక్, తెలంగాణ ప్రజాసైన్స్ వేదిక అధ్యక్షుడు మువ్వ రామారావు, విద్యావంతుల జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాపానాయక్, శంకర్‌నాయక్, రైతు సంఘం నాయకులు కంబాలపల్లి ఆనంద్, పెరికె విజయ్‌కుమార్, విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, డేగ వి.టి., నామ శ్రీనివాస్, హరికృష్ణ, రమేశ్, సుదర్శన్, కొండల్‌రెడ్డి, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గోబ్యాక్ యూసీఐ...
యురేనియంపై ప్రజలను జాగృతం చేసేందుకు ప్రజా సంఘాలు ప్రజలతో సమావేశం ముగించుకొని వెళ్తున్న క్రమంలో పెద్దగట్టు గ్రామానికి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్రతినిధులు వస్తుండడాన్ని గమనించిన ప్రజా సంఘాలు, ప్రజలు వారి జీపును అడ్డుకున్నారు. అడ్డంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. గో బ్యాక్ యూసీఐ అంటూ నినాదాలు చేశారు. చాలాసేపు వరకు ఆందోళన చేపట్టడంతో అధికారులు చేసేదిలేక వెనుదిరిగారు. యూసీఐఎల్ ప్రతినిధుల వాహనంలో అప్పటికే వేరే గ్రామాల్లో సేకరించిన నీటి నమూనాలతో పాటు ఖాళీ క్యాన్లు దర్శనమిచ్చాయి. ఇదిలా ఉంటే యూసీఐఎల్ ప్రతినిధులు ప్రజా సంఘాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా గ్రామస్తులు, ప్రజా సంఘాలు వారిని నిలువరించి జీపును వెనుకకు తోశారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు.
యురేనియం వెలికితీయడం ప్రజలకు మరణశాసనం
యురేనియం వెలికి తీయడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతాయని, తాగునీరు కలుషితం కావడంతో పాటు ఇక్కడి ప్రజలపై పెను ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కడపలోని తుమ్మలపల్లి, జార్ఖండ్‌లోని తొలుగల్ ప్రాంతాల్లో యురేనియం ప్లాంట్‌లు ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉన్న యురేనియం ప్లాంట్‌ను జనవావాసాలకు మధ్య, కృష్ణా తీరంలో ఏర్పాటు చేయడం సమంజసం కాదు. యురేనియం వెలికితీయడం వల్ల జీవరాశులకు ప్రమాదం వాటిల్లుతుంది. ఒక విధంగా ప్రజలకు మరణశాసనం. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరోసిస్‌తో ఇబ్బందులు పడుతున్న తరుణంలో యురేనియం వెలికితీయడం ఎంతవరకు సమంజసం.
– మిడియం బాబురావు, ఆదివాసీ హక్కుల జాతీయ హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ
అభివృద్ధి పేరుతో ఆధిపత్యమా?
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులుగా బతుకీడుస్తున్న పెద్దగట్టు ప్రాంత ప్రజలను మరోసారి యురేనియం పేరుతో బయటికి గెంటివేయొద్దు. అభివృద్ధి పేరుతో గ్రామాలపై ఆధిపత్యం చెలాయించడం అన్యాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ఉపసంరించుకోవాలి. ఖనిజాల పేరుతో ఆదివాసులను ఆగంచేసే నిర్ణయాలు మంచివి కావు.
– అంబటి నాగయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
యురేనియం వెలికితీతను నిలిపివేయాలి
మానవ మనుగడతో పాటు జీవజాలానికి హానికరమైన యురేనియం వెలికితీతను ప్రభుత్వాలు విరమించుకోవాలి. యురేనియం వెలికితీతతో ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ప్రజల జీవితాలపై పెనుప్రభావం చూపే యురేనియం వెలికితీయడాన్ని ఆపివేయాలి.
– రామారావు, ప్రజా సైన్స్ వేదిక అధ్యక్షుడు
గిరిజనుల జీవితాలో చెలగాటం ఆడొద్దు
యురేనియం వెలికి తీసే చర్యలతో గిరిజనుల జీవితాలో చెలగాటం ఆడొద్దు. యురేనియం వెలికి తీయడం వల్ల ప్రజలు, జీవరాశులకు ప్రమాదం వాటిల్లుతుంది. కృష్ణా తీరం పరిసర ప్రాంతాల్లో యురేనియం వెలికి తీయడం వల్ల నీరు కలుషితం అవుతుంది. జనసంచారం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్ట్‌ను పచ్చటి పంట పొలాల నడుమ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదు.
– రవినాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment