
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ తీర్మానించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి కుంతియా అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలు, రైతులు, వ్యవసాయ సమస్యలు, డెంగీ జ్వరాలు, యాదాద్రిలోని చిత్రాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన నేతలు.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే అంశాలపై ఏఐసీసీ ఆదేశాల ప్రకారం త్వరలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.
ఉద్యమాలకు సంబంధించి పలు కమిటీలు వేయాలని, త్వరలో పెద్దఎత్తున ఉద్యమ కార్యచరణ చేపట్టాలని నిర్ణయించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం ఆదివారం యాదగిరిగుట్టకు వెళ్లనుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్‌బాబు, వీహెచ్, పొన్నాల, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, కొండపల్లి విద్యాసాగర్ ఈ బృందంలో ఉన్నారు. ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సభ్యత్వనమోదు కార్యక్రమం షెడ్యూల్ నిర్ణయించనున్నారు. ఇప్పటికే 22 లక్షల సభ్యత్వం ఉండగా, దానిని 40 లక్షలకు పెంచాలని పార్టీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపైనా చర్చించింది.
Comments
Please login to add a commentAdd a comment