సాక్షి, హైదరాబాద్ : నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు ఊటీ లాంటి నల్లమల ప్రాంతాన్ని పాలకులు లూటీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో తామంతా ఉద్యమిస్తే తవ్వకాలు నిర్ణయంపై వెనక్కు తగ్గారని, కానీ కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
‘నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టు. చెంచులు, ఆదివాసీలు బతుకుతున్న ప్రాంతం. ఇక్కడ తవ్వకాలను మేం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. బహుళ జాతి కంపెనీలకు కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి ఇక్కడి ప్రజలను, అటవీ సంపదను బలి చేస్తారా. విదేశాల్లో, కడపలో కూడా యురేనియం తవ్వకాలను ఆపేశారు. యురేనియం తవ్వకాల వల్ల పుట్టబోయే బిడ్డలకు కూడా అంగవైకల్యం ఏర్పడుతుంది. ప్రకృతి పూర్తిగా నాశనమవుతుంది.
శ్రీశైలం నదీ జలాలు కలుషితం అవుతాయి. నాగార్జునసాగర్ నీరు తాగే హైదరాబాద్ ప్రజలపై కూడా ఈ ప్రభావం పడనుంది. గతంలో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటాలు చేస్తాం. ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. తవ్వకాల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం ఆగదు’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment