vamshichand reddy
-
‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు ఊటీ లాంటి నల్లమల ప్రాంతాన్ని పాలకులు లూటీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో తామంతా ఉద్యమిస్తే తవ్వకాలు నిర్ణయంపై వెనక్కు తగ్గారని, కానీ కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టు. చెంచులు, ఆదివాసీలు బతుకుతున్న ప్రాంతం. ఇక్కడ తవ్వకాలను మేం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. బహుళ జాతి కంపెనీలకు కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి ఇక్కడి ప్రజలను, అటవీ సంపదను బలి చేస్తారా. విదేశాల్లో, కడపలో కూడా యురేనియం తవ్వకాలను ఆపేశారు. యురేనియం తవ్వకాల వల్ల పుట్టబోయే బిడ్డలకు కూడా అంగవైకల్యం ఏర్పడుతుంది. ప్రకృతి పూర్తిగా నాశనమవుతుంది. శ్రీశైలం నదీ జలాలు కలుషితం అవుతాయి. నాగార్జునసాగర్ నీరు తాగే హైదరాబాద్ ప్రజలపై కూడా ఈ ప్రభావం పడనుంది. గతంలో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటాలు చేస్తాం. ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. తవ్వకాల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం ఆగదు’అన్నారు. -
చీరి చింతకు కట్టాలే ; మరి ఇప్పుడేం చేస్తారో..!
సాక్షి, హైదరాబాద్ : పార్టీలు మారేవారిని చీరి చింతకు కట్టాలే అని నీతులు మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంపై ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన రాజకీయ వ్యభిచారులు కాంగ్రెస్ నాయకత్వంపై చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నామన్నారు. ఇదే నాయకత్వం వీళ్లకు బీఫామ్ ఇచ్చిన విషయాన్ని గమనించాలని అన్నారు. దమ్ముంటే ఆ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. రాజకీయ ఫిరాయింపులు వ్యభిచారమేనన్న కేసీఆర్ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలతో రాజకీయ వ్యబిచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజకీయ వ్యబిచారం చేసే వారిని చేయించే వారిని ఏమనాలని అన్నారు. ‘జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నేతలు.. మరి 6 సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా.. స్వయంగా సీఎం కూతురు కూడా ఓడిపోయింది. అంటే మీకు ప్రజా మద్దత లేనట్లే కదా. నియోజక వర్గ అభివృద్ధి కోసమే ఫిరాయించామని ఎమ్మెల్యేలు అంటున్నారు. పార్టీ మారక పోతే నియోజకవర్గ అభివృద్ధి చేయనని సీఎం అన్నారా’ అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్ గూటి పక్షులు!
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు లోక్‌సభ స్థానానికి సంబంధించి ఓ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కాంగ్రెస్ గూటి నుంచి వచ్చిన వారే కావడం విశేషం. బీజేపీ తరఫున బరిలో ఉన్న డీకే అరుణ 20ఏళ్లు పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలందిస్తూ పక్షం రోజుల క్రితమే కాషాయం కండువా కప్పుకున్నారు. నవాబ్‌పేట మండలానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రముఖ ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ అధినేత సత్యనారాయణ రెడ్డి సోదరుడైన శ్రీనివాస్‌రెడ్డి 2005లో నవాబ్‌పేట మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సింగిల్ విండో చైర్మన్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత 2009 స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ గురుకుంట ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి సైతం పదహారేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయనను కాంగ్రెస్ అధిష్టానం మహబూబ్‌నగర్ నుంచి బరిలో దింపింది. అయితే.. గతంలో ఒకే పార్టీలో పని చేసిన ముగ్గురు అభ్యర్థులు ప్రస్తుతం వేర్వేరు పార్టీల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతుండడంతో ఎవరు గెలుస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇద్దరు సీనియర్లు.. పాలమూరు బరిలో ఉన్న ముగ్గురు ప్రధాన అభ్యర్థుల్లో డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డికి రాజకీయ అనుభవం ఎక్కువే ఉందని చెప్పాలి. బీజేపీ అభ్యర్థి డీకేది రాజకీయ కుటుంబ నే పథ్యం. ఆమె తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ మాజీ ఎమ్మెల్యే. భర్త డీకే భరతసింహారెడ్డి గద్వాల మాజీ ఎమ్మెల్యే. తండ్రి, భర్త నుంచి రాజకీయ వారసత్వ పునికి పుచ్చుకున్న అరుణ 1996లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. అదే సమయంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాత 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె గద్వా ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2000లో వనపర్తి జిల్లా పరిధిలోని పాన్‌గల్ జెడ్పీటీసీగా గెలుపొందారు. జెడ్పీ చైర్‌పర్సన్‌కు పోటీ పడి రెండు ఓట్లతో పదవి కి దూరమయ్యారు. 2002లో పీసీసీ మహిళా కార్యదర్శిగా నియామకమై.. అప్పటి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలే ని పోరాటాలు చేశారు. ఆర్డీఎస్ సాధన కోసం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2003లో నెట్టెంపాడు సాధన కోసం గద్వాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి ప్రాజెక్టు సాధించారు. 2009లో గద్వాల ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా పని చేశారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లోనూ మంత్రిగా ఉన్నారు. 2014లో గద్వాలలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదో సారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఆమె గత నెల 19న కమలం గూటికి చేరుకుని ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. విద్యార్థి దశ నుంచే.. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి సైతం 2003–04 నుంచే కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్యూఐలో చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధ్యక్షుడిగా, 2005లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2006 ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2011లో ఎన్ఎస్యూఐ ఎలక్షన్ కమిషన్ పీఆర్వో, 2012 ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీచంద్‌రెడ్డి 2018లో ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ దక్కించుకుని మరోసారి బరిలో దిగుతున్నారు. -
‘డిండి’పై సభలో దుమారం
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్ అంశంపై గురువారం శాసనసభ కాసేపు అట్టుడికింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో దీన్ని అనుసంధానించకుండా వేరుగా చేపట్టాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గతంలో ఇదే విషయమై సీఎంకు లేఖ రాశారంటూ కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఈ ప్రాజెక్టుపై 10 నిమిషాలకుపైగా ఆయన ప్రశ్నలు వేయడంతో వంశీ మైక్ కట్ కావడం, ఆయన పోడియంలోకి దూసుకెళ్లడం, మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగడంతో సభ గరంగరంగా సాగింది. శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని.. ప్రశ్నోత్తరాల సందర్భంగా వంశీచంద్ మాట్లాడుతూ ‘‘డిండికి శ్రీశైలం నుంచే నీటిని తీసుకుంటామని జీవో ఇచ్చారు. 2015లో శంకుస్థాపన సందర్భంగా ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. అప్పుడు శ్రీశైలం ఫోర్‌షోర్ అని చెప్పి ఇప్పుడు పాలమూరుకు అనుసంధానించారు. మేమే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పాలమూరుతో అనుసంధానిస్తే రాజకీయ అశాంతి నెలకొంటుందని మంత్రులు ఆందోళన వెలిబుచ్చారు’’అని పేర్కొన్నారు. ఈ సమయంలో వంశీచంద్ మైక్‌ను స్పీకర్ మధుసూదనాచారి కట్ చేసి అధికార పార్టీ సభ్యుడు గువ్వల బాలరాజుకు ఇచ్చారు. దీంతో వంశీచంద్ నిరసన వ్యక్తం చేశారు. అయినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో వంశీ పోడియంలోకి దూసుకెళ్లగా ఆయనకు స్పీకర్ మైక్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిండికి వేరుగా నీటిని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం వంశీచంద్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి సభలోనే కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి డిండిపై చర్చ జరుగుతుంటే జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతిరెడ్డి సభలో లేరు. కాంగ్రెస్ నేతలు జిల్లాకో మాట మాట్లాడుతున్నారు. ఇది వారి కుటిలనీతి’’అని దుయ్యబట్టారు. డిండి ప్రాజెక్టు ఆలస్యంపై ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించాల్సింది గాంధీభవన్‌లో కానీ సభలో కాదని విమర్శించారు. ‘‘ఆ పార్టీ నేతలు హర్షవర్దన్‌రెడ్డి, పవన్‌కుమార్‌లు గండుపిల్లి కూడా లేని దగ్గర పెద్ద పులులున్నాయని, ఆముదం మొక్క కూడా లేనిచోట మహా వృక్షాలు ఉన్నాయని ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేశారు. నిజంగా నీళ్లు రావాలని కాంగ్రెస్ కోరుకుంటే మొదట కేసులు ఉపసంహరించుకొని ప్రాజెక్టుకు సహకరించాలి’’అని సూచించారు. ప్రజాధనం వృథా కావొద్దనే.. : హరీశ్ శ్రీశైలం నుంచి డిండికి నీటిని వేరుగా తీసుకుంటే అదనంగా పంప్‌హౌస్, సర్జ్‌పూల్ వంటి నిర్మాణాలతో అధిక మొత్తం ఖర్చవుతుందని, దీనికితోడు భూసేకరణ, ఇతర అనుమతులతో ఆలస్యం జరుగుతుందని హరీశ్‌రావు పేర్కొ న్నారు. ఈ దృష్ట్యా పాలమూరులో భాగంగా నిర్మిస్తున్న పంప్‌హౌస్ ద్వారానే 2 టీఎంసీల నీటిని తీసుకొని అందులో 1.5 టీఎంసీలను పాలమూరు అవసరాలకు, మరో 0.5 టీఎంసీ డిండి అవసరాలకు మళ్లించాలని నిర్ణయించామని, దీని ద్వారా ప్రజాధనం వృథా కాదన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎలాంటి నష్టం ఉండదని, అన్ని జిల్లాలకు సమానంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. కృష్ణాలో రాష్ట్రానికి కేటాయింపులు పెరగనున్నాయన్నారు. ‘డిండి’కి వ్యతిరేకం కాదు మీడియాతో వంశీచంద్ డిండి ప్రాజెక్టును పాలమూరు ప్రాజెక్టుతో అనుసంధానించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నాం తప్ప డిండి ప్రాజెక్టును కాదని వంశీచంద్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ డిండి ప్రాజెక్టును పాలమూరుతో అనుసంధానం చేస్తే మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు శాసనసభలోనే అబద్ధాలు చెప్పారని విమర్శించారు. డిండితో పాలమూరు ప్రాజెక్టును అనుసంధానిస్తే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాజకీయ అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. -
‘దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది’
హైదరాబాద్: ప్రభుత్వ తీరు వల్ల సాగునీటి ప్రాజక్టుల్లో దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోనుందని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. డిండి వల్ల నల్గొండ, పాలమూరు జిల్లాల మద్య గొడవ జరగవచ్చునని అధికార పార్టీ ఎమ్మేల్యేలు అంటున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతగాని తనం వల్లే.. ప్రాజెక్టుల్లో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. డిండి, పాలమూరు ఒకే సోర్స్ ద్వారా నిర్మిస్తే దక్షిణ తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి, కల్వకుర్తికి నీరు ఇవ్వకపోతే యుద్దం చేస్తామని హెచ్చరించారు. -
'డిండి' పై పూటకో మాట: వంశీచంద్ రెడ్డి
హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకం ఫై ప్రభుత్వం పూటకో మాట చెబుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు ఎస్ఎల్బీసీ ద్వారా తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2007లో జీవో ఇచ్చింది.. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వాలని రూపకల్పన చేశారు. దీని వల్ల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సాగుకు నష్టం జరుగుతుందన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు నర్లపూర్ నుంచి కాకుండా సెపరేట్ గా తీసుకపోవాలన్నారు. డిండి ఎత్తిపోతలఫై మహబూబ్ నగర్, నల్గొండ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
కల్వకుర్తి కాంగ్రెస్‌దే..
బీజేపీ అభ్యర్థిపై 78 ఓట్లతో గెలిచిన వంశీచంద్‌రెడ్డి కల్వకుర్తి, న్యూస్‌లైన్: ఈవీఎంలో సాంకేతిక లోపంతో నెలకొన్న మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి విజేత ఎవరో తేలిపోయింది. హోరాహోరీగా సాగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి టి.ఆచారిపై 78 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సోమవారం వెల్దండ మండలం జూపల్లి గ్రామంలోని 119వ పోలింగ్‌బూత్‌లో జరిగిన రీపోలింగ్ విజేతను నిర్ణయించింది. ఈ బూత్ పరిధిలో వంశీచంద్‌రెడ్డికి 328 ఓట్లు, ఆచారికి 450, టీఆర్ఎస్ అభ్యర్థి జి.జైపాల్‌యాదవ్‌కు 55 ఓట్లు పడ్డాయి. ఈనెల 16న సాధారణ ఎన్నికల లెక్కింపు సందర్భంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జూపల్లి గ్రామ 119వ పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఈవీఎం సాంకేతిక లోపంతో ఫలితాన్ని చూపలే కపోయింది. దీంతో ఫలితాన్ని నిలిపివేశారు. సోమవారం ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు. తర్వాత చల్లా వంశీచంద్‌రెడ్డిని విజేతగా ప్రకటించారు. కాగా, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,61,799 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి 42,782 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి టి. ఆచారికి 42,704 ఓట్లు వచ్చాయి. 29,844 ఓట్లతో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి జి.జైపాల్‌యాదవ్ మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డికి 13,818, స్వతంత్ర అభ్యర్థి కె.నారాయణరెడ్డికి 24,095 ఓట్లు పోలయ్యాయి.