
సాక్షి, హైదరాబాద్ : పార్టీలు మారేవారిని చీరి చింతకు కట్టాలే అని నీతులు మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంపై ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన రాజకీయ వ్యభిచారులు కాంగ్రెస్ నాయకత్వంపై చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నామన్నారు. ఇదే నాయకత్వం వీళ్లకు బీఫామ్ ఇచ్చిన విషయాన్ని గమనించాలని అన్నారు. దమ్ముంటే ఆ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
రాజకీయ ఫిరాయింపులు వ్యభిచారమేనన్న కేసీఆర్ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలతో రాజకీయ వ్యబిచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజకీయ వ్యబిచారం చేసే వారిని చేయించే వారిని ఏమనాలని అన్నారు. ‘జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ నేతలు.. మరి 6 సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా.. స్వయంగా సీఎం కూతురు కూడా ఓడిపోయింది. అంటే మీకు ప్రజా మద్దత లేనట్లే కదా. నియోజక వర్గ అభివృద్ధి కోసమే ఫిరాయించామని ఎమ్మెల్యేలు అంటున్నారు. పార్టీ మారక పోతే నియోజకవర్గ అభివృద్ధి చేయనని సీఎం అన్నారా’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment