సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) సమర్పించిన ప్రతిపాదనలను తాజాగా రాష్ట్ర వన్యప్రాణి మండలి తిరస్కరించింది. దీంతో గత నాలుగేళ్లుగా యురేనియం సర్వేతో ముడిపడి సాగుతున్న చర్చ ముగిసినట్టయింది. సోమవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. చదవండి: యురేనియం అన్వేషణకు నో..
కేంద్ర వన్య›ప్రాణి మండలి, కేంద్ర అటవీ శాఖకు ఈ తీర్మానాన్ని పంపాలని ఈ సమావేశం నిర్ణయించింది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల వెలికితీతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ కేంద్రం గత మే నెలలో కోరింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. దీనిపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమావేశం కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమై యురేనియం సర్వే సాధ్యం కాదని పేర్కొంటూ గతంలోని ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడింది. చదవండి: మినిట్స్ వచ్చేదాకా... వేచిచూద్దాం
ఇదీ జరిగిందీ..
అటవీ ప్రాంతం, చెట్లకు నష్టం వాటిల్లకుండా యంత్రాలను వాడకుండా సర్వే నిర్వహిస్తామని ఏఎండీ సమర్పించిన ప్రతిపాదనలను 2016లో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం ఆమోదించింది. అడవికి ఎలాంటి నష్టం కలిగించరాదని, ఉన్న రోడ్లు, బండి, కాలినడక మార్గాలనే ఉపయోగించాలని, కేవలం సర్వేకే పరిమితం కావాలని, నిల్వలను వెలికి తీయొద్దని, చెట్లకు, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం కలిగించొద్దంటూ ఈ సమావేశంలో మినిట్స్‌ను రికార్డ్ చేశారు.. దీనికి భిన్నంగా గతేడాది మళ్లీ సవరించిన ప్రతిపాదనలు ఏఎండీ పంపించింది. అడవిలోపలికి భారీ యంత్రాలు, వాహనాలు తీసుకెళ్తామని, అందుకు రోడ్డు, చెట్లు, పొదలను తొలగించాలని 200, 300 మీటర్ల లోతున 4 వేల బోర్లు వేస్తామని, నల్లమల అటవీ ప్రాంత వ్యాప్తంగా ఈ బోరింగ్ పాయింట్లు ఉంటాయని, దాదాపు ఐదేళ్ల పాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతినివ్వాలంటూ ఈ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. గతంలో ఆమోదించిన ప్రతిపాదనలకు భిన్నంగా ఉన్న కొత్తగా అనుమతులివ్వలేమని, కొత్త ప్రతిపాదనలను ఫారమ్–సీలో.. అంటే ఎన్ని బోర్లు వేస్తారు, ఎలా వేస్తారు, భారీ యంత్రాలు ఎలా తీసుకెళ్తారు, చెట్లకు ఎంత నష్టం వాటిల్లుతుంది, జీవవైవిధ్యంపై ప్రభావం, దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, వివరాలు అందజేయాలని ఏఎండీకి రాష్ట్ర అటవీశాఖ సూచించింది. ఈ పరిణామాలపై ఇటు అక్కడి గిరిజనులు, పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీతకు అనుమతించబోమంటూ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ఫీల్డ్ డైరెక్టర్ నుంచి నివేదిక..
ఏఎండీ పంపించిన కొత్త ప్రతిపాదనలను ఏటీఆర్ పరిధిలోని ఫీల్డ్ డైరెక్టర్‌కు పంపించగా, పార్ట్–3 ఫార్మాట్‌లో వాటిని తిరస్కరిస్తూ అటవీశాఖకు నివేదిక అందింది. ఏటీఆర్‌లో యురేనియం నిల్వలపై సర్వే, వెలికితీత ప్రతిపాదనల పరిశీలన సాధ్యం కాదంటూ క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ పంపించింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటి వల్ల అడవికి, జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని ఈ నివేదికలో ఫీల్డ్‌డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ డ్రిల్లింగ్ వల్ల ఇక్కడి ప్రాంతం కలుషితమై ఆ నీళ్లు కృష్ణానదిలో కలసి, హైదరాబాద్‌కు సరఫరా అయ్యే నీటిలో కూడా యురేనియం కలుషితాలు చేరితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నివేదికను రాష్ట్ర వన్యప్రాణి మండలి సమక్షంలో ఉంచడంతో పాటు ఏఎండీ తాజా ప్రతిపాదనలను పరిశీలించి ఇవి ఆచరణ సాధ్యం కాదంటూ ఈ సమావేశం తిరస్కరించింది. ఏఎండీ ప్రతిపాదనలను రాష్ట్ర వన్యప్రాణి బోర్డు తిరస్కరించినందు వల్ల కేంద్ర బోర్డు కూడా దీన్ని తిరస్కరించడం లాంఛనమే కానుంది
Comments
Please login to add a commentAdd a comment