సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాల విషయంలో ఎలాంటి తప్పుచేయదు, చేయబోదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. యురేనియం పరిశోధన, తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, భవిష్యత్‌లో ఇవ్వబోదని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలున్నా యని భావించినా బయటకు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదన్నారు. ఆదివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశంపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వేసిన ప్రశ్నకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో సహా కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎంఐఎం సభ్యుడు అమీనుల్ జాఫ్రీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ వేసిన అనుబంధ ప్రశ్నలు లఘు చర్చకు దారితీశాయి. సభ్యులు వెలిబుచ్చిన ఆందోళనలు, సందేహాలపై కేటీఆర్ వివరణనిచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ మండలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలని, నిక్షేపాల అన్వేషణను ఆపే అవకాశం ఉంటే పరిశీలించి కేంద్రానికి పంపించాలని పలువురు సభ్యులు సూచించారు. దీనిపై సీఎంతో మాట్లాడి, కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.
బాధ్యతారాహిత్యం...
యురేనియం విషయంలో కొందరు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండగానే అనుమతులిచ్చిన విషయాన్ని మరిచి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలను సీఎం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమన్నారు. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం అన్వేషణకు అనుమతి ఇచ్చిందన్నారు. దీనిపై ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిధిలోని అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) అన్వేషణకు సంబంధించిన పనులు చేస్తోందన్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదన్నారు.
భయాందోళనలు వాస్తవమే...
యురేనియం తవ్వకాలపై ప్రజల్లో భయాందోళన లు ఉన్న మాట వాస్తవమేనని కేటీఆర్ అన్నారు. ఏఎండీ అన్వేషణ పూర్తయ్యాక, ప్రభుత్వాల నుంచి తవ్వకాలకు అనుమతి లభిస్తే యురేనియం కార్పొరేషన్ వాటి ని చేపడుతుందన్నారు. అయితే యురేనియంను గుడ్డిగా వ్యతిరేకించడం కూడా సరికాదన్నారు. ఏఎండీ ఉద్ధేశం కేవలం విద్యుత్ ఉత్పాదనకే అయి ఉండదని, న్యూక్లియర్ రియాక్టర్లు, అణ్వాయుధాలు, అంతరిక్ష పరిశోధనలు, సెటిలైట్లలో వాడే ఇంధనంగా, అంతరిక్ష ప్రయోగాలకు యురేనియం ఉపయోగిస్తారన్నారు. యురేనియం ఉందని తేలినా శుద్ధిచేసే వరకు రేడియేషన్ రాదని తెలిపారు. రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకు సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తారని, 2016లో జరిగిన బోర్డు సమావేశంలో యురేనియం మైనింగ్‌కు అనుమతులు ఇవ్వలేదన్నా రు. ఈ నిక్షేపాల అన్వేషణకు సంబంధించి ఒక్క చెట్టు కొట్టరాదని, కాలినడకన వెళ్లాలని, రాత్రి పూట పనిచేయరాదని, బోర్లు వేశాక వాటిని మూసేసి యధాతథస్థితికి తీసుకురావాలంటూ మినిట్స్‌లో పొందుపరిచినట్లు కేటీఆర్ తెలిపారు.
తప్పు చేయబోం : కేటీఆర్
Published Mon, Sep 16 2019 1:59 AM | Last Updated on Mon, Sep 16 2019 5:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment