అడవి ఎదపై అణుకుంపటి | Dileep Reddy Article On Nallamala Uranium Search | Sakshi
Sakshi News home page

అడవి ఎదపై అణుకుంపటి

Published Fri, Jul 19 2019 12:52 AM | Last Updated on Fri, Jul 19 2019 1:14 AM

Dileep Reddy Article On Nallamala Uranium Search - Sakshi

తెలంగాణ–ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో ఇపుడు ‘యురేనియం’ తవ్వకం కలకలం సృష్టిస్తోంది. మన్ననూరు పులుల అభయారణ్యం ఉనికికే ఇది ప్రమాదం. అరుదైన చెంచు తెగ మనుగడకు శాపం. యురేనియం నిల్వల అన్వేషణ, తవ్వకాల కోసం సర్కారు సాగిస్తున్న ప్రయత్నాలొకవైపు, తలెత్తుతున్న నిరసనోద్యమాలు మరోవైపు.. ‘అమ్రాబాద్‌’ చుట్టూ వాతావరణం వేడెక్కుతోంది. సమగ్ర నిర్వచనం లేని అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సిందేనా? 

‘‘మైళ్లకు మైళ్ల దూరం అందమైన ఇప్పచెట్ల అడవి ఉన్న చోటే స్వర్గం. కానీ, మైళ్లకు మైళ్ల ఇప్పచెట్ల అడవి ఉండీ అందులో ఓ అటవీ రక్షకుడుంటే నరకం’’
పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌లోని ఓ గిరిజన తెగలో ఈ సామెత వాడుకలో ఉంది. రక్షకులే భక్షకులవుతున్న కాలమిది. అటవీ అధికారులో, చట్టబద్ద ప్రాధికార సంస్థలో, అటవీ శాఖో, ప్రభుత్వాలో... ఏవైతేనేం, కట్టలు తెంచుకున్న స్వార్థం, అవినీతి, పరస్పర విరుద్ద విధనాలతో అడవుల్ని ధ్వంసం చేస్తున్నాము. పెంచాల్సిన పరిస్థితుల్లో అడవుల విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. పర్యావరణపరంగా యోచిస్తే కొన్ని చర్యలు, తను కూర్చున్న కొమ్మని మనిషి తానే నరుక్కున్నట్టుంటాయి. అడవుల్ని బలిపెట్టడం ఇటువంటిదే! ఫలితమే పెచ్చుమీరిన కాలుష్యం, జీవవైవిధ్య విధ్వంసం, సహజవనరుల నాశనం, వాతావరణ మార్పులు. అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాలను పౌరసమాజం అడ్డుకునే క్రమంలో ఘర్షణ తప్పటం లేదు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో ఇపుడు ‘యురేనియం’ తవ్వకం కలకలం సృష్టిస్తోంది. పులుల అభయారణ్యం ఉనికికే ఇది ప్రమాదం. చెంచు తెగ మనుగడకు శాపం.

యురేనియం నిల్వల అన్వేషణ, తవ్వకాల కోసం సర్కారు సాగిస్తున్న అంచెలంచెల యత్నాలొకవైపు, ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న నిరసనోద్యమాలు మరో వైపు.. ‘అమ్రాబాద్‌’ చుట్టూ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల తదుపరి చర్యలు ఎలా ఉంటాయో! నిర్వచనం లేని అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సిందేనా? ప్రస్తుత–భవిష్యత్తరాల ప్రయోజనాలు మనకు పట్టవా? చెంచులు, గిరిజన జాతుల ప్రగతి మనం ప్రచారం చేసే అభివృద్ధిలో భాగం కాదా? వారి కనీస మనుగడనే లక్ష్యపెట్టని అభివృద్ధి ఎవరికోసం? ఇటువంటి ప్రశ్నలెన్నో? జనాన్ని ఉద్యమాలవైపు పురిగొల్పుతున్నాయి. సాంకేతికత విస్తరించి, సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన పరిస్థితుల్లో ఉద్యమ స్వరూప –స్వభావాలూ మారిపోయాయి. ప్రభుత్వాలు మరింత స్పృహతో, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరముంది.

దూళి కూడా శాపమే!
యురేనియం తవ్వకాలు, వెలికితీత, రవాణా, నిల్వ, వినియోగం.. ఇవన్నీ భయం కలిగించేవే! దాని స్వభావం–ప్రభావం అలాంటిది. యురేనియం గనుల సంఖ్య, గనుల విస్తీర్ణం ఎక్కువ చేయడానికి కేంద్రం యత్నిస్తోంది. ప్రస్తుత ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచేలా రూ.1,05,700 కోట్ల ఖర్చుతో 13 గనులను ఏర్పాటు చేసే యత్నాల్లో యురేనియం కార్పొరేషన్‌ ఆప్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐల్‌) ఉంది. ఇందులో చిత్రియాల్‌ (నల్గొండ), మన్ననూర్‌–అమ్రాబాద్‌ (శ్రీశైలం అడవుల్లో) కూడా ఉన్నాయి. ఈ కార్పొరేషన్‌కు ఇప్పటికే ఏడు గనులు జార్ఖండ్‌లో, ఒకటి ఏపీ(కడప)లో ఉన్నాయి. రెండు అవసరాల కోసం ఈ యురేనియం అన్వేషణ. యురేనియం ముడి పదార్థంగా దేశంలో అణు విద్యుత్‌ ఉత్పత్తిని 22,000 మెగావాట్లకు తీసుకెళ్లడం, దేశ రక్షణ కోసం బాంబుల తయారీకి దీని ఉప ఉత్పత్తిని వాడటం లక్ష్యం. చెప్పు కోవడానికి ఈ కారణాలు బాగానే ఉన్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అణు విద్యుదుత్పత్తి అసాధారణ ఖర్చుతో కూడుకున్నదే కాక ప్రమాదభరితమైంది.

న్యూక్లియర్‌ పదార్థాలు, అణు ధార్మికత వల్ల పర్యావరణ విధ్వంసమే కాక అడవులు–ఇతర సహ జవనరులు, తరాల తరబడి జీవరాశి ఆయురారోగ్యాలు క్షీణిస్తాయి. అణు వ్యర్థాలు, ఆ కణాలు కలిసిన నీరు, చివరకు ఆ రేణువుల ధూళి, గాలి కూడా ప్రమాదమే! తవ్వకాలు, వెలికితీత జరుగుతున్న చోట ఇప్పటికే కాలుష్యాల దుష్ప్ర భావంతో క్యాన్సర్‌ వంటి తీవ్ర వ్యాధులు, రేడియేషన్‌ ప్రభావంతో గర్భస్రావ్యాలు, అంగ వైకల్య జననాలు... ఇలా ఎన్నెన్నో సమస్యలతో జనం సతమతమౌతున్నారు. అందుకే, అగ్ర రాజ్యాలన్నీ ఈ రకం ఉత్పత్తిని నిలిపివేశాయి.  దేశ రక్షణకు అవసరమైన అణు బాంబులు మన వద్ద ఉన్నాయి. బాంబుల తయారీకి అవసరమైన యురేనియం, ఉప ఉత్పత్తులు ఇప్పటికే టన్నుల కొద్ది ఉన్నాయి. ఆరు దేశాల నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటున్నాము. అంతర్జాతీయ ఆంక్షల తొలగింపు నేపథ్యంలో ఇంకా దిగుమతి చేసుకోవచ్చు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా యురేనియం తవ్వకాలు, అదీ, అపార సహజ సంపదకు నెలవైన నల్లమల అడవుల్లో చేయడం దారుణం. అడవికి, ఔషధ మొక్కల వంటి విలువైన అటవీ సంపదకు, పులుల అభయారణ్యానికి, చెంచులు, వన్యప్రాణులు ఇతర జీవరాశికి నష్టమే కాకుండా భూగర్భ జలాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలు సమీపంగా ఉన్నందున ఆ నీళ్లు కలుషితమవుతాయి. వాటిని తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాలు, గ్రామాల తాగు, సాగు అవసరాలకు వాడుతున్నందున సగటు మనిషి మనుగడ, భవిష్యత్తరాల బతుకు అగమ్యగోచరమౌతుంది.

మరోమార్గం చూసుకోవాలి
క్లీన్‌ ఎనర్జీ అయినంత మాత్రాన ఇంత ఖర్చుకు, ఇన్ని ప్రమాదాలకూ సిద్ధపడాల్సిందేనా? మేధావులు, ఉద్యమకారుల ప్రశ్న. యూనిట్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తి వ్యయమే రూ.30 వరకుంటుంది. భద్రతకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ, దీర్ఘకాలిక ఖర్చుల్నీ లెక్కిస్తే యూనిట్‌ ధర ఇంకా పెరగొచ్చని పాలసీనిపుణుడు దొంతి నర్సింహారెడ్డి అంటున్నారు. ఇంత చేశాక కూడా ప్రమాదాలు జరగవనే గ్యారెంటీ లేదు. రష్యా, జపాన్‌ వంటి సాంకేతిక నైపుణ్యపు దేశాలే చెర్నోబిల్, ఫుకుషిమా ప్రమాదాలపుడు విలవిల్లాడాయి. ఇక, అందులో వందో వంతు భద్రతకూ భరోసాలేని మన వంటి దేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి? ఎన్ని వేల, లక్షల కుటుంబాలకు, భవిష్యత్తరాలకది శాపంగా మారుతుందో ఊహకూ అందని భయం! ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం శిలాజ ఇంధన వినియోగం తగ్గించి, పునర్వినియోగ యోగ్య ఇంధనాలకు వెళ్లాలనే మాట నిజమే! అయితే, అది అణువిద్యుత్తే కానవసరం లేదు.

భారీ ప్రాజెక్టులు కాకుండా చిన్న, మధ్యతరగతి జల విద్యుత్తు, సౌర, పవన విద్యుత్తు కావొచ్చు. అవి ప్రమాదరహితం. సౌర విద్యుదుత్పత్తి వ్యయం ఇప్పటికే బాగా తగ్గింది. ఇంకా తగ్గించే పరిశోధనలు జరగాలి. వందల, వేల ఎకరాల్లో పలకలు (ప్యానల్స్‌) వేయడం కాకుండా వికేంద్రీకృత పద్ధతిన ఇళ్లపైన, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేసుకునే వ్యవస్థను బలోపేతం చేయాలి. అణువిద్యుత్తే అనివార్యమైతే పది రూపాయలు ఎక్కువ పెట్టయినా యురేనియం దిగుమతి చేసుకోవాలే తప్ప ప్రమాద భరితమైన తవ్వకాలు జరపొద్దని సామాజిక కార్యకర్తలంటారు. అడవిని కల్లోల పరచి ప్రకృతి సంపదను విధ్వంసం చేయొద్దనేది వారి వాదన. ఇప్పుడు తెలంగాణ,ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి వైఖరి తీసుకుంటాయన్నది ఆసక్తికరం. కృష్ణా–గోదావరి (కేజీ) బేసిన్‌ సహజవాయు ఉత్పత్తి సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక న్యాయమైన అంశాన్ని లేవనెత్తారు. ప్రాజెక్టు తాలూకు కష్ట– నష్టాల్ని స్థానికులుగా మేం భరిస్తున్నపుడు ప్రయోజనాల్లో తమకు సహ జసిద్ధమైన వాటా ఉండాలని కేంద్రంతో వాదించారు. ఆ స్ఫూర్తిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అంది పుచ్చుకోవాలి.

తీరు మారుతున్న ఉద్యమాలు
ఒకప్పటిలా ఉద్యమాలంటే కేవలం ధర్నాలు, రాస్తారోకోలు కాదు. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని ప్రజాఉద్యమాలు కొత్త బాట పట్టాయి. సంప్రదాయ, సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రజాభిప్రాయాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల రానున్న ప్రమాద తీవ్రతపై సమాచారాన్ని చిట్టచివరి వ్యక్తికీ చేర్చి మద్దతు కూడగడుతున్నారు. ప్రజాందోళనల్ని సమైక్యపరచి ఉద్యమోధృతి పెంచుతున్నారు. పారిస్‌ వంటి అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో పర్యావరణ అంశాల్ని, జీవవైవిధ్య ప్రమాదాల్ని ఎత్తి చూపుతూ ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) తదితర సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారు. అరుదైన జాతులు అంతరించిపోయే ప్రమాదాల్ని ఎత్తిచూపి ప్రపంచ దృష్టి ఆకర్షిస్తున్నారు.

పంజాబ్‌–హర్యానా సరిహద్దుల్లోని గోరక్‌పూర్‌లో ఇటువంటి ఆందోళన వచ్చినపుడు అక్కడి కృష్ణజింక, చుక్కల జింక మనుగడ ఎంతటి ప్రమాదంలోకి జారనుందో అధ్యయనం చేశారు. ఎమ్సీ మెహతా, డా‘‘ సాయిభాస్కర్‌ వంటి నిపుణులు ఆధారాలతో జాతీయ హరిత ట్రిబునల్‌ (ఎన్‌జీటీ) ముందు వాదించి, సానుకూల నిర్ణయాలు వచ్చేలా చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమకారులు ‘ఆవాజ్‌’ తదితర వేదికల్ని వాడుకుంటూ సంతకాల సేకరణ ద్వారా జనాభిప్రాయాన్ని ప్రోది చేసి, విశాల ఉద్యమాల్ని నిర్మిస్తున్నారు. అన్ని పద్ధతుల్లో ఒత్తిడి పెంచి, ప్రభుత్వాలు మొండిగా, ఏకపక్షంగా వ్యవహరించలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. ఉద్యామాల్లో స్థానికత, వ్యూహం–ఎత్తుగడ కొరవడితే లక్ష్య సాధన కష్టం. నాగార్జునసాగర్‌ అణురియాక్టర్‌ వ్యతిరేకోద్యమం విజయవంతమైతే కూడంకులం పోరాటాలు విఫలమవ్వడం ఇందుకు ఉదా‘‘గా ప్రముఖ పర్యావరణవేత్త డా‘‘ పురుషోత్తమ్‌రెడ్డి పేర్కొంటారు.

అడవికేది రక్ష?
యురేనియం తవ్వకాలకు ‘ఇంకా అనుమతులివ్వలేద’ని అటవీ అధికారులు పక్కా సాంకేతిక భాష మాట్లాడుతున్నారు. మరో పక్క అన్నీ జరిగి పోతూనే ఉన్నాయి. అడవుల్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికన్నా అటవీ అధికారులపైనే ఎక్కువగా ఉంది. మనవన్నీ పరస్పర విరుధ్ద విధానాలే! చెంచుల వల్ల అడవి అంతరిస్తోందని వారిని బయటకు తరలించే చర్యలు తీసుకుంటారు. ఇదంతా ఖనిజ తవ్వకాలు జరిపే కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేందుకే! దానికి ‘అభివృద్ధి’ ముసుగు కప్పే పాలకవర్గాలు అదే చెంచుల్ని, గిరిజనుల్ని, సదరు అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయవు. నిజానికి చెంచులు, ఇతర గిరిజన జాతులు అడవికి రక్షగా ఉంటారే తప్ప అడవినెప్పుడూ పాడు చేయరు.

వారి జీవనోపాధి పరిరక్షిస్తూ వారినే అటవీ రక్షకులుగా వాడే సమన్వయ చర్యలేవీ ప్రభుత్వాలు చేపట్టవు. అడవి అంచుల్లో, చెట్లు అంతరించిన చోట పోడు వ్యవసాయం చేసుకోండని ప్రత్యామ్నాయం చూపించి వారిని ప్రోత్సహిస్తారు. అందుకోసం, అడవి మధ్యలోంచి వారిని బలవంతంగా తరలిస్తారు. వారికి భూమి హక్కులు కల్పించాలని ‘అటవీ హక్కుల చట్టం’ సుస్పష్టంగా చెబుతున్నా, దాన్ని సవాల్‌ చేస్తూ మన ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకెక్కుతాయి. ఇంత వైరుధ్యముంటుంది. చట్టాలు అమలు చేయా ల్సిన సమయంలో నిద్ర నటించి, గిరిజనావాసాల్లో గిరిజనేతరు లొచ్చి భూములు ఆక్రమిస్తున్నా ఉపేక్షిస్తారు. ప్రాజెక్టుల కోసం అడవుల్ని నరికినపుడు ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం లభించే నష్టపరిహార (కంపా) నిధుల్నీ సవ్యంగా వినియోగించరు. రక్షకులే భక్షకులుగా మారు తుంటే ఇక అడవికేది రక్ష? జనం అప్రమత్తం కావడమొకటే పరిష్కారం.


దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement