
సాక్షి, హైదరాబాద్: నల్లమల్ల అడవి యూరేనియం తవ్వకాల వ్యతిరేక కమిటి చైర్మన్‌గా మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ తీర్మానించిన విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై గళమెత్తుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు.