సియోల్: ఉత్తరకొరియా మొట్టమొదటి సారిగా రహస్య యురేనియం శుద్ధి కేంద్రాన్ని బయటి ప్రపంచానికి చూపింది. ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఇటీవల అణ్వాయుధాల తయారీలో వినియోగించే యురేనియం శుద్ధి కేంద్రాన్ని సందర్శించినట్లు అధికార కేసీఎన్‌ఏ తెలిపింది. ‘నిపుణుల కృషిని కిమ్ కొనియాడారు. పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అమెరికా, మిత్ర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరిన్ని అణ్వాయుధాల అవసరం ఉంది. వీటి తయారీకి ప్రయత్నాలు సాగించాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు’అని వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రంలోని పొడవైన బూడిదరంగు పైపుల వరుసల మధ్య కిమ్ తిరుగుతున్న ఫొటోలను కేసీఎన్‌ఏ బయటపెట్టింది.
ఈ కేంద్రం ఎక్కడుంది? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, యోంగ్‌బియోన్‌లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమా కాదా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫొటోల్లోని వివరాలను బట్టి ఉత్తరకొరియా సిద్ధం చేసిన అణు బాంబులు, శుద్ధి చేసిన ఇంధనం పరిమాణం వంటి అంశాలపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. ఉత్తరకొరియా మొదటిసారిగా 2010లో యోంగ్‌బియోన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని గురించిన వివరాలను వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment