Refinery Plant
-
మరిన్ని అణ్వాయుధాలపై దృష్టి: కిమ్
సియోల్: ఉత్తరకొరియా మొట్టమొదటి సారిగా రహస్య యురేనియం శుద్ధి కేంద్రాన్ని బయటి ప్రపంచానికి చూపింది. ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఇటీవల అణ్వాయుధాల తయారీలో వినియోగించే యురేనియం శుద్ధి కేంద్రాన్ని సందర్శించినట్లు అధికార కేసీఎన్ఏ తెలిపింది. ‘నిపుణుల కృషిని కిమ్ కొనియాడారు. పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా, మిత్ర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరిన్ని అణ్వాయుధాల అవసరం ఉంది. వీటి తయారీకి ప్రయత్నాలు సాగించాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు’అని వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రంలోని పొడవైన బూడిదరంగు పైపుల వరుసల మధ్య కిమ్ తిరుగుతున్న ఫొటోలను కేసీఎన్ఏ బయటపెట్టింది. ఈ కేంద్రం ఎక్కడుంది? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, యోంగ్బియోన్లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమా కాదా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫొటోల్లోని వివరాలను బట్టి ఉత్తరకొరియా సిద్ధం చేసిన అణు బాంబులు, శుద్ధి చేసిన ఇంధనం పరిమాణం వంటి అంశాలపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. ఉత్తరకొరియా మొదటిసారిగా 2010లో యోంగ్‌బియోన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని గురించిన వివరాలను వెల్లడించింది. -
Russia-Ukraine war: డోన్బాస్‌పై రష్యా సేనల గురి
కీవ్: ఉక్రెయిన్‌లోని మారియుపోల్ సిటీని విజయవంతంగా స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ఇక తూర్పున పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్సై ప్రధానంగా గురిపెట్టాయి. క్షిపణుల వర్షం కురిపించాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడికి దిగాయి. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదులు అధికంగా ఉండడం పుతిన్ సైన్యానికి కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని ముఖ్య నగరం సీవిరోడోంటెస్క్‌లో పాగా వేయడానికి రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డోన్బాస్లో ఒక భాగమైన డోంటెస్క్ ప్రావిన్స్‌లోని స్లోవానిస్క్లో మళ్లీ దాడులు ప్రారంభిస్తామని రష్యా సైన్యం ప్రకటించింది. డోంటెస్క్‌లో శనివారం రష్యా బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని స్థానిక గవర్నర్ వెల్లడించారు. బొహోరోడిచిన్ గ్రామంలోని ఓ చర్చిలో తలదాచుకుంటున్న 100 మంది క్రైస్తవ మతాధికారులు, పిల్లలను అధికారులు ఖాళీ చేయించారు. ఇక్కడ రష్యా వైమానిక దాడులు సాగిస్తుండడమే ఇందుకు కారణం. మారియుపోల్ అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ నుంచి 2,500 మంది ఉక్రెయిన్ సైనికులను ఖైదీలుగా అదుపులోకి తీసుకున్నామని రష్యా స్పష్టం చేసింది. దీంతో సదరు సైనికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. త్వరగా ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ డోన్బాస్లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళకరంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. ఆయన తాజాగా దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. రష్యా సేనలను ఉక్రెయిన్ను దళాల కచ్చితంగా ఓడిస్తాయని పేర్కొన్నారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో తమ దేశాన్ని సాధ్యమైనంత త్వరగా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో చేర్చుకోవాలని జెలెన్స్కీ మరోసారి కోరారు. ఈ విషయంలో ఈయూలోని 27 సభ్యదేశాలు వెంటనే చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఈయూలో ఉక్రెయిన్ చేరికకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఫ్రాన్స్ మంత్రి క్లెమెంట్ బ్యూనీ చెప్పారు. ఏడాది, రెండేళ్లలో ఈయూలో ఉక్రెయిన్ భాగస్వామి అవుతుందనడం ముమ్మాటికీ అబద్ధమేనన్నారు. సిరియా నుంచి బ్యారెల్ బాంబు నిపుణులు సిరియా నుంచి రష్యాకు మద్దతుగా 50 మంది బ్యారెల్ బాంబు నిపుణులు వచ్చినట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. వీరు తయారు చేసిన బాంబులు సిరియాలో పెను విధ్వంసం సృష్టించాయి. రష్యాకు అపజయమే: అండ్రెజ్ డుడా పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడా ఆదివారం కీవ్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు విజయం దక్కదని జోస్యం చెప్పారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ పార్లమెంట్లో మాట్లాడిన తొలి విదేశీ నేత డుడానే. -
పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం
ముంబై: ముంబైలోని భారత్ పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 22 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, 21 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆరో జోన్ డిప్యూటీ కమిషనర్ షహజి ఉమాప్ తెలిపారు. తూర్పు ముంబైలోని చెంబూర్‌లోని కర్మాగారంలో మధ్యాహ్నం సంభవించిన పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. హైడ్రోక్రాకర్ ప్లాంట్‌లోని కంప్రెషర్ షెడ్ల వేడి, ఒత్తిడి వల్ల పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది. -
ముంబైలోని పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో భారత్ పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 22 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, 21 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆరో జోన్ డిప్యూటీ కమిషనర్ షహజి ఉమాప్ తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న కర్మాగారంలో మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో సంభవించిన పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. తొమ్మిది ఫైర్ ఇంజన్లు, రెండు ఫోమ్ ఇంజన్లు, రెండు జంబో ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైడ్రోక్రాకర్ ప్లాంట్‌లోని కంప్రెషర్ షెడ్ల వేడి, ఒత్తిడి వల్ల పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది. పేలుడు ధాటికి రిఫైనరీకి 500 మీటర్ల పరిధిలో గల భవనాల అద్దాలు పగిలిపోయినట్లు స్థానికులు చెప్పారు. -
కాకినాడ - విశాఖ మధ్యలో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ
* 15 మిలియన్ టన్నులసామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ * భాగస్వామ్య కంపెనీతో త్వరలో ఒప్పందం * అక్టోబర్‌లో ఇండియా కెమ్ 2014 ఎగ్జిబిషన్ * కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ * కార్యదర్శి ఇంద్రజిత్ పాల్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాకినాడ-విశాఖ మధ్యలో హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) కొత్త రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న రిఫైనరీని విస్తరించడంతో పాటు కొత్తగా మరో రిఫైనరీని ఏర్పాటు చేయడానికి పనులు వేగంగా జరుగుతున్నట్లు కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి ఇంద్రజిత్ పాల్ తెలిపారు. 15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక తయారవుతోందని, వచ్చే ఒకటి రెండు నెలల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. మరో కంపెనీతో కలిసి ఈ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు పాల్ తెలిపారు. హెచ్‌పీసీఎల్‌కి ఇప్పటికే వైజాగ్‌లో ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని పెంచుతోంది. రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి భూమి, తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో హెచ్‌పీసీఎల్ చర్చలు జరుపుతోందని, గెయిల్‌తో కలిసి ఈ రిఫైనరీ ఏర్పాటు జరగవచ్చని కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇండియాకెమ్ 2014 పేరుతో అక్టోబర్ 9 నుంచి 11 వరకు జరిగే ఎగ్జిబిషన్‌కు సంబంధించి వివరాలను తెలియచేయడానికి గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ కొత్త కెమికల్ పాలసీని త్వరలోనే కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలిపారు. దేశీయంగా రసాయనాల ఉత్పత్తి పెంచడం ద్వారా ఎగుమతి, దిగుమతుల మధ్య వున్న వ్యత్యాసాన్ని తగ్గించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం వార్షిక ఎగుమతుల విలువ రూ. 1.78 లక్షల కోట్లు వుండగా, రూ. 2.34 కోట్ల దిగుమతులు జరుగుతున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో 13 దేశాలకు సంబంధించిన 274 మంది పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ కాకినాడ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పెట్టుబడులకు అనువైనదని ఇప్పటికే 6,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ రీజియన్‌లో రెండు ఫార్మా సెజ్లతో పాటు నాలుగు ఆర్థిక మండళ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.