కాకినాడ - విశాఖ మధ్యలో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ
* 15 మిలియన్ టన్నులసామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ
* భాగస్వామ్య కంపెనీతో త్వరలో ఒప్పందం
* అక్టోబర్‌లో ఇండియా కెమ్ 2014 ఎగ్జిబిషన్
* కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్
* కార్యదర్శి ఇంద్రజిత్ పాల్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాకినాడ-విశాఖ మధ్యలో హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) కొత్త రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న రిఫైనరీని విస్తరించడంతో పాటు కొత్తగా మరో రిఫైనరీని ఏర్పాటు చేయడానికి పనులు వేగంగా జరుగుతున్నట్లు కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి ఇంద్రజిత్ పాల్ తెలిపారు. 15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక తయారవుతోందని, వచ్చే ఒకటి రెండు నెలల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు.
మరో కంపెనీతో కలిసి ఈ రిఫైనరీ ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు పాల్ తెలిపారు. హెచ్‌పీసీఎల్‌కి ఇప్పటికే వైజాగ్‌లో ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని పెంచుతోంది. రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి భూమి, తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో హెచ్‌పీసీఎల్ చర్చలు జరుపుతోందని, గెయిల్‌తో కలిసి ఈ రిఫైనరీ ఏర్పాటు జరగవచ్చని కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇండియాకెమ్ 2014 పేరుతో అక్టోబర్ 9 నుంచి 11 వరకు జరిగే ఎగ్జిబిషన్‌కు సంబంధించి వివరాలను తెలియచేయడానికి గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ కొత్త కెమికల్ పాలసీని త్వరలోనే కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలిపారు. దేశీయంగా రసాయనాల ఉత్పత్తి పెంచడం ద్వారా ఎగుమతి, దిగుమతుల మధ్య వున్న వ్యత్యాసాన్ని తగ్గించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం వార్షిక ఎగుమతుల విలువ రూ. 1.78 లక్షల కోట్లు వుండగా, రూ. 2.34 కోట్ల దిగుమతులు జరుగుతున్నాయి.
ఈ ఎగ్జిబిషన్‌లో 13 దేశాలకు సంబంధించిన 274 మంది పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ కాకినాడ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ పెట్టుబడులకు అనువైనదని ఇప్పటికే 6,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ రీజియన్‌లో రెండు ఫార్మా సెజ్‌లతో పాటు నాలుగు ఆర్థిక మండళ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.