సాక్షి, పెద్దఅడిశర్లపల్లి (నల్గొండ) : యురేనియం అలజడితో మండలంలోని పెద్దగట్టు, నంబాపురం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యురేనియం తవ్వకాలు జరుగుతాయా.. ఇందుకోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా అని ఇంతకాలం అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయా గ్రామాల ప్రజలకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడంలేదు. తాజాగా పెద్దగట్టు, నంబాపురం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం 11గంటల సమయంలో హెలికాప్టర్ విహరించడంతో యురేనియం కోసమే ఆకాశమార్గాన సర్వే నిర్వహించినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యురేనియం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని, యురేనియం కోసం అన్వేషించే ప్రయత్నాలు చేయడం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. యురేనియం ప్లాంట్ ఏర్పాటు వల్ల జరిగే అనార్థాలతో ప్రజలు యురేనియం అంటేనే మండిపడుతున్నారు. వీరికి ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలుపుతుండడంతో ప్రజలు యురేనియం ప్లాంట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హెలికాప్టర్ ఏరియల్ సర్వే కోసం వచ్చినట్లు భావించి యురేనియం ప్లాంట్‌ను, యురేనియం కోసం అన్వేషించడం, ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దగట్టు, నంబాపురం గ్రామాల ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమద్‌కు వినతిపత్రం అందించారు. హెలికాప్టర్ యురేనియం సర్వేకు వచ్చిందా లేదా అని చెప్పాల్సిందిగా ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరారు. వినతిపత్రం అందించిన వారిలో పెద్దగట్టు సర్పంచ్ నరేందర్‌నాయక్, గ్రామస్తులు నాగయ్య, దూద్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment