‘అణు ఇంధన శాఖ పరిధిలోని ఏఎండీ (ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్) లంబాపూర్–పెద్దగట్టు ప్రాంతంలోని 25 బోరుబావులు, చేతిపంపుల నుంచి సేకరించిన నీటిలో యురేనియం ఉన్నట్లు గుర్తించింది. ఏఈఆర్‌బీ (ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు) విధించిన పరిమితి 60 పీపీబీ (పార్ట్ పర్ బిలియన్)కి లోబడి కొన్ని నమూనాల్లో, పరిమితికి మించి ఎంతో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించింది. సేకరించిన నీటి నమూనాల్లో 1పీపీబీ నుంచి 2,618 పీపీబీ వరకు యురేనియం ఉన్నట్లు తేలింది...’ – లోక్‌సభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రత్తన్ లాల్ కటారియా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా భూగర్భంలో ఫ్లోరైడే కాదు.. ఇప్పుడు మరో కొత్త గరళం యురేనియం కూడా ఉందని తేలింది. యురేనియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తించిన దేవరకొండ నియోజవకర్గం పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లి) పరిధిలోని పెద్దగట్టు–లంబాపూర్ ప్రాంతంలోని నీటిలో యురేనియం ఆనవాళ్లు ప్రమాదరకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సరిగ్గా దశాబ్దన్నరం కిందట ప్రజాందోళనలతో వెనక్కి వెళ్లిపోయిన పెద్దగట్టు యురేని యం ప్రాజెక్టుకు తిరిగి ఊపిరి పోయాలని జరిగిన ప్రయత్నాలనూ గతేడాది ఈ ప్రాంత ప్రజలు అడ్డుకున్నారు.
అయితే ఇక్కడ యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం.. ప్రాజెక్టును (మైనింగ్) ఏర్పాటు చేయకున్నా ఈ ప్రాంతం నుంచి నిత్యం నీటి నమూనాలు సేకరించి పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ పరిశోధనల ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తవ్ ుకుమార్‌రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రత్తన్‌లాల్ కటారియా వారం కిందట బదులిచ్చారు. ఆయన సమాధానంతో యురేనియం నిక్షేపాలు ఉన్న లంబాపూర్, పెద్దగట్టు ప్రాంతంలోని తాగు, సాగు నీటిలో యురేనియం ఆనవాళ్లు ఉన్నాయని స్పష్టమైంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీ.. కథ!: దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లి) మండలంలోని లంబాపూర్, నామాపురం, ఎల్లాపురం, పులిచర్ల, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో 11.02 మిలియన్ టన్నుల యురేనియం నిక్షేపాలు 1,326 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. ఒక ఓపెన్ కాస్ట్ గనితో పాటు, మరో మూడు భూగర్భ గనుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించి, 2003 వరకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఏ) రూపొందించారు. ఈ గనులకు అనుబంధంగా మల్లాపూర్‌లో ట్రీట్‌మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. అయితే అన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో యూసీఐఎల్ అధికారులు వెనక్కి తగ్గారు.
వాస్తవానికి ఈ గనులకు 1,301.35 ఎకరాలు అవసరమని గుర్తించగా ఇందులో 1,104.64 ఎకరాలు రిజర్వు అటవీ భూమి కావడంతో అనుమతులు అవసరమయ్యాయి. మరో 196.71 ఎకరాలు మాత్రమే అనుమతులు అక్కర్లేని భూమిగా గుర్తించారు. ఇక మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాలని తలపెట్టిన ట్రీట్‌మెంట్ ప్లాంట్ కోసం 760 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. మైనింగ్ మొదలుపెట్టే ముందు కేంద్ర అణు ఇంధన శాఖ ఆ ప్రాంతంలోని నీటి నమూనాలు సేకరించి విశ్లేషించడం పరిపాటి. దీనిలో భాగంగానే 2010–2011 మధ్య 468 నీటి శాంపిళ్లను సేకరించి విశ్లేషించారు. 2018 నవంబర్–2019 జూలై మధ్య ఎంపిక చేసిన 25 బోరు బావులు, చేతి పంపుల నుంచి నమూనాలు సేకరించి నీటిలో యురేనియం ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ప్రమాదకర స్థాయిలో యురేనియం ఆనవాళ్లు
తాజా పరిశోధనల ప్రకారం లంబాపూర్–పెద్దగట్టు చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలోనే ఎంపిక చేసిన 21 బోరు బావులు, 4 చేతి పంపుల నుంచి నీటి నమూనాలు సేక రించారు. ఇందులో 1 పీపీబీ నుంచి 2,618 పీపీబీ వరకు యురేనియం ఆన వాళ్లను కనుగొన్నా రు. 13 చోట్ల 60 పీపీబీకి తక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయని, మిగిలిన 12 చోట్ల 1 పీపీబీ నుంచి 2,618 పీపీబీ అంటే.. అత్యధిక స్థాయిలో ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. తాగే నీటిలో 60 పీపీబీ వరకు యురేనియం ఉండొచ్చని ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్‌బీ) రక్షిత పరిమితులు విధించిందని చెబుతున్నారు.
కానీ యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (యూఎస్‌ఈపీఏ) మాత్రం నీటిలో 30 పీపీబీ వరకు యురేనియం ఉంటేనే ఆ నీరు తాగడానికి రక్షితమ ని నిర్దేశించినట్లు చెబుతున్నారు. నమూనాలు సేకరించిన 4 చేతి పంపుల నీటిలో 1 పీపీబీ నుంచి 48 పీపీబీ వరకు యురేనియం ఉన్నట్లు పరిశోధన అధ్యయనాలు తేల్చాయి కాబట్టి, ఆ చేతి పంపుల నీరు తాగడానికి పనికిరాదంటున్నారు. ఈ లెక్కన సేకరించిన 25 చోట్ల నీటి నమూనాల్లో యురేనియం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లేనని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల మంది వరకు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment