బత్తాయి మార్కెట్‌లో ధాన్యం పరిశీలిస్తున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్: వానా కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ బత్తాయి మార్కెట్‌లో ధాన్యం రాశులను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని, నెల రోజుల కిందటి నుంచే వరి కోతలు మొదలైనా ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.
రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనలేరా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, వరి వేయొద్దని ప్రభుత్వం, మంత్రులు ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు రుణమాఫీ ఏమైందని నిలదీశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనేవరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, సీఎం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో కూడా రైతులు వరి పండించుకోవాలని, ప్రభుత్వం కొనుగోలు చేసేంతవరకు రైతుల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. ధాన్యాన్ని విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయలేరని ప్రభుత్వాన్ని ప్రశించారు. కాగా, రైతుల సమస్యలను ఆయన ఫోన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment