
యురేనియం తవ్వకాలతో విధ్వంసం
యురేనియం తవ్వకాలకు అనుమతివ్వడం దుర్మార్గమని ఎంపీ నంది ఎల్లయ్య వెల్లడించారు.
ఎంపీ నంది ఎల్లయ్య
సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు అనుమతివ్వడం దుర్మార్గమని, దీనితో ఈ ప్రాంతమంతా విధ్వంసానికి గురౌతుందని ఎంపీ నంది ఎల్లయ్య వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలసి గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాలు వద్దని టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారని, ఇప్పుడు అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తవ్వకాలకు కేంద్రం అనుమతి కోరిందని నంది ఎల్లయ్య తెలిపారు.
యురేనియం తవ్వకాలకు అనుమతి వస్తే రాజీనామా చేసి ఉద్యమం చేస్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే బాలరాజు తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. ప్రభుత్వం యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని నంది ఎల్లయ్య, వంశీకృష్ణ హెచ్చరించారు.