దొడ్డ శ్రీనివాసరెడ్డి
ఆర్కిటిక్ ఖండంలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల నైసర్గిక స్వరూపాన్నే మార్చేస్తోంది. 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పటికే 50 శాతం మంచు కరిగిపోయింది. 2040 సంవత్సరం నాటికి మరో 25 శాతం మంచు మాయమౌతుందని అంచనా. ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిణామం కొన్ని దేశాలకు కొత్త అవకాశాలను తెచ్చి పెట్టనుంది. ఆర్కిటిక్‌లో దాగున్న అపార సంపదపై ఇప్పుడు అనేక దేశాల చూపు పడింది.
ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలోనే వెల్లడైంది. ప్రపంచ చమురు నిల్వల్లో 25 శాతం.. అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు అక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ గతంలో అంచనావేసింది. ప్రపంచ సహజవాయు నిల్వల్లో 30 శాతానికిపైగా దాగున్నట్టు ఓ అంచనా. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారళ్ల సహజ వాయువు అక్కడ ఉందట. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ ఆలవాలం. దాంతో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం దేశాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి.
ఆధిపత్యమెవరిదో!
నిజానికి ఆర్కిటిక్ ఎవరి సొంతమూ కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న ఎనిమిది దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా పేర్కొంటున్నాయి. వాటిని అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యా. అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్.. ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే.
ఇవి తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐరాస 234 ఆర్టికల్‌ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ల వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద.
నిప్పు రాజుకుంటోంది
ఐరాస సూత్రీకరణలు ఎలా ఉన్నా ఆర్కిటిక్‌పై ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలకు సరిహద్దు దేశాలు పదును పెడుతున్నాయి. ఆర్కిటిక్‌తో అక్షరాలా 24,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉన్న రష్యా ఈ విషయంలో అందరికంటే ముందుంది. రెండేళ్లుగా ఆర్కిటిక్ వైపు బలగాల మోహరింపును ముమ్మరం చేస్తోంది. కొత్తగా ఆర్కిటిక్ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది. మూతబడ్డ నౌకా స్థావరాలన్నింటినీ పునరుద్ధరిస్తోంది. వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది.
ఈ జలాల్లో ముందస్తు అనుమతి లేకుండా నౌకాయానానికి వీల్లేదని, అనుమతి పొందిన నౌకలు టోల్ ట్యాక్స్ కట్టాలని వాదిస్తోంది. అవసరమైతే 1859 సంవత్సరంలో అమెరికాకు ఇచ్చేసిన అలాస్కాను వెనక్కు తీసుకుంటామని రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ చైర్మన్ ఇటీవలే ప్రకటన చేశారు. రాజుకుంటున్న నిప్పుకు ఇది సూచన మాత్రమేనని విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అమెరికా చకచకా పావులు కదుపుతోంది. అలాస్కా నుంచి నౌకా మార్గానికి అనువుగా ఆర్కిటిక్‌లో కొంత భాగాన్ని తమదిగా చెబుతూ కొత్త మ్యాప్‌లు తయారు చేస్తోంది. కెనడా అయితే తమ దేశం నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న ప్రాంతమంతా తమదేనని తెగేసి చెబుతోంది!
సరికొత్త మార్గాలు
ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతున్న కొద్దీ సరికొత్త నౌకా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానానికి కొంతమేరకే అనువుగా ఉంది. దీని మార్గం ద్వారా ఏడాదికి వంద నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ మార్గం వేలాది నౌకల రాకపోకలతో రద్దీగా మారనుంది. ప్రస్తుతం పనామా కాల్వ మార్గంలో ఏడాదికి 14 వేలు, సూయజ్ కాల్వ మార్గంలో 20 వేల నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40 శాతం పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు ఆ మేరకు తగ్గుతాయి.
భారత్ వైఖరేమిటి?
ఆర్కిటిక్ వాతావరణం భారత్‌లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్‌లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment