యురేనియం బాధిత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జగన్ కృషి
దానికోసం రూ. 198 కోట్లతో చురుగ్గా రిజర్వాయర్ నిర్మాణ పనులు
ఇప్పటికే 53 శాతం మేర పూర్తయిన పనులు
తుంగభద్ర, కృష్ణా నీటి సరఫరాకు చిత్రావతి నుంచి ప్రత్యేక పైప్‌లైన్
ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ప్రాజెక్టుపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి
ఉన్నది లేనట్లు...లేనిది ఉన్నట్లు ఎత్తిచూపుతున్న ఎల్లో మీడియా
బాబుకోసం అడ్డమైన రాతలతో తప్పుదారి పట్టిస్తున్న రామోజీ...
ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టు... భ్రమింపజేయడం పచ్చపత్రికల లక్ష్యం. ప్రతి అంశాన్నీ సర్కారుకు ముడిపెట్టి ప్రజలను తప్పుదారి పెట్టించాలన్నది వారి వ్యూహం. ఎలాగైనా జగన్ సర్కారును అప్రదిష్టపాలు చేయాలన్నది వారి సంకల్పం. కానీ వాస్తవాలు తెలిసిన ప్రజల విజ్ఞత ముందు వారికుట్రలు ఎన్నైనా కొట్టుకుపోవడం ఖాయం.
పులివెందుల ప్రాంతంలోని యురేనియం కార్పొరేషన్ ప్రాజెక్టుపై వండివార్చిన అడ్డగోలు కథనాన్ని అందరూ ఛీదరించుకుంటున్నారు. అక్కడి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తెలిసిన జనాలు ఆ అబద్ధాలను నిర్ద్వందంగా ఖండిస్తున్నారు.
సాక్షి రాయచోటి/వేముల: పులివెందుల ప్రాంత నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్రాజెక్టుపై ఇప్పుడు పచ్చ పత్రికలు విషం చిమ్ముతున్నాయి.
వైఎస్సార్ కుటుంబంపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా ప్రతి అంశాన్నీ వక్రీకరిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యురేనియం బాధిత గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సంకల్పించారు.
అంతేగాకుండా గ్రామాల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తేనే మరోపక్క తాగు, సాగునీటికోసం ప్రత్యేక రిజర్వాయర్ నిర్మాణం మొదలుకొని పైపులైన్ల ద్వారా తుంగభద్ర, కృష్ణా నీటిని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కేటాయించి...నిర్మాణ పనులు చరుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నారు. కేవలం 15 నెలల వ్యవధిలోనే సగానికి పైగా ప్రాజెక్టు పనులు పూర్తయినా మార్చి వచ్చినా ఏమార్చారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు.
శర వేగంగా రిజర్వాయర్ పనులు
వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాలైన కేకే కొట్టాల, కణంపల్లె, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె గ్రామ ప్రజల శాశ్వత పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణమే ప్రధానమని భావించిన ప్రభుత్వం వేగంగా పనులు జరిగేలా చూస్తోంది.
వైద్య శిబిరాలు, ఇతర ప్రత్యేక చర్యలు తీసుకుని వారి ఆరోగ్యంపై పత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భూములు కోల్పొయిన రైతుల కుటంబాల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. స్వచ్చమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా రిజర్వాయర్, భూ సేకరణ, చిత్రావతి నుంచి రూ. 1113 కోట్లు అంచనా వ్యయంతో రిజర్వాయర్ రూపొందించారు. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె వద్ద 2022 నవంబర్‌లో పనులకు భూమి పూజ చేశారు.
యురేనియం బాధిత గ్రామాల్లో 10వేల ఎకరాలకు సాగునీటితో పాటు 6 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 53శాతం పూర్తయ్యాయి. అలాగే కాలువల పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. లింగాల మండలం పార్నపల్లె వద్దనున్న చిత్రావతి ప్రాజెక్టు నుంచి పైపులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు.
బాబుకు మేలు చేకూర్చేందుకు రామోజీ తాపత్రయం
ప్రతి అంశాన్నీ బాబుకు మేలు చేసే విధంగా కట్టుకథలతో తప్పుదారి పట్టించేందుకు రామోజీ తెగ తాపత్రయపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2021లో శంకుస్థాపన చేసి 2022 నవంబర్‌లో పనులకు భూమి పూజ చేయగా 32 నెలల కిందటే పనులు ప్రారంభించినట్లు ఈనాడులో తప్పుడు కథనాలు అల్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 650 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతలతోపాటు పైపులైన్ల పనులకు సుమారు రూ. 135 కోట్లు ఖర్చు చేశారు. కాలువ పనులకు సంబంధించి దాదాపు 20 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. మరో 13 కిలోమీటర్ల వరకు పైపులను కూడా అమర్చారు. కొన్నిచోట్ల అటవీ శాఖ భూముల పరిధిలో పైపులైన్ పనులు చేయాల్సి ఉన్నందున అనుమతుల కోసం నిరీక్షిస్తున్నారు. దానినీ రాజకీయం చేయాలని ఈనాడు చూస్తోంది.
త్వరలోనే సమస్యల పరిష్కారం
♦ యురేనియం బాధిత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కూడా యూసీఐఎల్ చర్యలు చేపట్టింది. తుమ్మలపల్లె సమీపంలో 2007 నవంబర్‌లో యురేనియం తవ్వకా లు చేపట్టేందుకు రూ.1106కోట్లతో కర్మాగారాన్ని నిరి్మంచింది.
♦ 2013లో యూసీఐఎల్ యురేనియం ఉత్పత్తి ప్రారంభించింది. ముడిపదార్థాన్ని శుద్ధి చేయగా వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టెయిలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు.
♦ 2016లో భారీ వర్షాలతో వ్యర్థజలాలు భూగర్భజలాల్లో కలుషితమయ్యాయని, బోర్లలో కలుషిత నీరు వస్తోందని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చేశారు. అప్పట్లో రైతులు ఈ విషయాన్ని ఎంపీ వైఎస్ అవినా ష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, యూసీఐఎల్ సీఎండీతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపుతూ వస్తున్నారు.
♦ సంస్థ టెయిలింగ్ పాండ్‌లో 1.5 మీటర్ల మట్టి వేసి దానిపై 1.5 ఎం.ఎం హెచ్‌డీపీ షీట్ వేసి యురేనియం వ్యర్థాలను నింపుతోంది. ఇందుకోసం యూసీఐఎల్ రూ.39కోట్లు ఖర్చు చేసింది.
♦ యురేనియం పరిసర గ్రామాల్లో యూసీఐఎల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో రూ.60లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను యూసీఐఎల్ నిర్మించింది.
సాగునీటికి ప్రత్యేక చర్యలు
యురేనియం బాధిత గ్రామాల్లో తోటల్లోని బోరు బావుల్లో నీరు సైతం కలుషితం అవుతుందన్న శాస్త్రవేత్తల నివేదికల మేరకు ఆయా గ్రామాల పొలాలకు కూడా సూక్ష్మ సేద్యం ద్వారా సాగునీరు అందించాలని సంకల్పించారు. పైపులైన్లతోపాటు తోటలకు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు కూడా చేస్తున్నారు. సుమారు 10 వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యంతోపాటు ఐదు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కింద సాగునీటిని అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment