డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్
సాక్షి ప్రతినిధి కడప: యురేనియం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో కార్పొరేట్ సోషియల్ రెస్పాన్షబులిటీ (సీఎస్‌ఆర్) ఫండ్ వినియోగంపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ రానున్నారు. ఈనెల 17, 18న ఆమె యురేనియం పరిశ్రమ పరిసర గ్రామాల్లో పర్యటించనున్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో యురేనియం తవ్వకాలతోపాటు శుద్ధి చేసే కర్మాగారాన్ని నిర్మించింది. తవ్వకాలు ప్రారంభమై దాదాపు పదేళ్లు కావస్తుండగా, శుద్ధి చేసే కర్మాగారం పనులు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయ్యింది. ఈనేపథ్యంలో ఆయా గ్రామాల్లో యూసీ ఐఎల్ చేపట్టిన అభివృద్ధి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా ప్రజల ద్వారా తెలుసుకునేందుకు డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ యురేనియం గ్రామాల్లో పర్యటించనున్నారు. అమెరికాకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
యూనివర్సిటీ తరఫున రీసెర్చిలో భాగంగా ఆమె భారత ప్రభుత్వం నేతృత్వంలో కొనుసాగుతున్న యూసీఐఎల్ గ్రామాల స్థితిగతులపై ఆరా తీయనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలి. కాగా ఆయా గ్రామాల్లో ఏ మేరకు సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు చేశారు. గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయనే దానిపై ఆమె ఆరా తీయనున్నారు. అంతేకాక ప్రాజెక్టు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను, జరుగుతున్న నష్టాలను, వారి ఆరోగ్య పరిస్థితులు తదితర అంశాలను గ్రామస్తులతో మాట్లాడి స్వయంగా తెలుసుకోనున్నారు. యురేనియం ప్రాజెక్టు పరిధిలోని ఈ గ్రామాల్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఏయే పనులు చేశారు, వాటి వల్ల ప్రజలకు ఎంత మేర ప్రయోజనం చేకూరుతుంది.. తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలు స్తోంది. ఆయా గ్రామాల్లో ప్రాజెక్టు వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా డాక్టర్ లెవెలన్ మిచ్చిగాన్ యూనివర్సిటీ నుంచి 2006లో పీహెచ్‌డీ పొందింది. 2008 నుంచి పదేళ్లుగా యూసీఎస్‌బీలో టీచింగ్ చేస్తోంది. గురువారం సాయంత్రానికి ప్రొద్దుటూరులో మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ ఇంటికి చేరుకోనున్నారు. ఆమేరకు 17, 18వ తేదీల్లో యురేనియం గ్రామాల్లో డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ పర్యటించనున్నట్లు జయశ్రీ సాక్షికి ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment