న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్కులో చీతాల వరుస మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుండటంతో వాటి పరిరక్షణకు సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జీలు.. బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్రంపై న్యాయస్తానం పలు ప్రశ్నలు సంధించింది.
కాగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి రెండు విడతల్లో మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఓ చీత నాలుగు పిల్లలకుజన్మనివ్వడంతో వీటి సంఖ్య 24కు చేరింది. వీటిలో గత నాలుగు నెల్లలో మూడు కూన చీతాలు సహా 8 మరణించాయి. ప్రస్తుతం 18 చీతాలు ఉండగా వీటిలో మరో రెండిటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
గత వారం రోజుల్లో రెండు చీతాలు మరణించడంపై ధర్మాసనం స్పందిస్తూ.. దీన్ని ఎందుకు ప్రతిష్టాత్మక అంశంగా మారుస్తున్నారని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. అయితే చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని ఇంకా కునో నేషనల్ పార్క్‌లోనే ఎందుకు ఉంచారని.. వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది.
చదవండి: వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
20 చీతాల్లో 8 మరణించాయి.. అంటే ఏడాదిలో 40శాతం చీతాలు మృత్యువాత పడ్డాయి. ఇది మంచి సంకేతం కాదు. ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించింది. వాటిని రాజస్థాన్‌కు తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించింది. అయితే వాతావరణ పరిస్థితులు (ట్రాన్స్‌లోకేషన్) కారణంగా 50 శాతం మరణాలు సాధారణమేనని కేంద్రం ముందుగానే ఊహించిందని కేంద్రం తరఫున ఏసీజీ వాదనలు వినిపించారు.
దీనిపై జస్టిస్ పార్దివాలా స్పందిస్తూ.. మరి సమస్య ఏంటి? ఇక్కడి వాతావరణం వాటికి అనుకూలంగా లేదా? కిడ్నీ,శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయా అని ప్రశ్నించారు. అయితే ఇన్‌ఫెక్షన్లు చీతాల మణాలకు దారి తీస్తున్నాన్నాయని ASG ధర్మాసనానికి తెలియజేశారు. లాగే ప్రతీ చీతా మరణంపై వివరణాత్మక విశ్లేషణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే రాజస్థాన్‌లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment