
ఈడీనుద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రజలకుండే ప్రాథమిక హక్కుల గురించి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆలోచించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నాగరిక్ అపూర్తి నిగమ్(ఎన్‌ఏఎన్) కుంభకోణం కేసును ఛత్తీస్‌గఢ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలంటూ ఈడీ వేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ ఎలా వేస్తారంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లితే వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించి రక్షణ కోరేందుకు ఆర్టికల్ 32 వీలు కల్పిస్తుంది.
ఇదే విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు..ఈడీకి కూడా ప్రాథమిక హక్కులుంటాయంటూ బదులిచ్చారు. అలాగైతే, వ్యక్తులకు కూడా ప్రాథమిక హక్కులుంటాయనే విషయం ఈడీ ఆలోచించాలి కదా..అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్ ఉపసంహరించుకునే అనుమతి కోరడంతో ధర్మాసనం సమ్మతించింది. ఈడీ తన హక్కుల కోసం మరో కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది.
కుంభకోణం ఆరోపణలున్న మాజీ ఐఏఎస్ అనిల్ టుటేజా ముందస్తు బెయిల్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఈడీ గతంలో ఆరోపణలు చేసింది. అంతేకాదు, ఈ కేసులో ఆరోపణలున్న ఉన్నత స్థాయి వ్యక్తులు కొందరు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులోని ఒక జడ్జీతో టచ్‌లో ఉంటూ న్యాయపరమైన వెసులుబాట్లు పొందారని కూడా పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని, ముందస్తు బెయిల్‌ను కూడా రద్దు చేయాలని కోరింది.