
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశసర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల నిలుపుదల విషయంలో గవర్నర్లకు, రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక అధికారాలేవీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇంతకు ముందు గవర్నర్ల విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహా సూచన చేయడం తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో..
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.

అంతకు ముందు గవర్నర్ విషయంలోనూ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. ఇక.. తాజాగా ఆర్టికల్ 201 రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు గనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే.. రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది.