వన్యప్రాణుల మరణ వేదన!
ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు మునుపెన్నడూ లేనంత వేగంగా అంతర్థానమవుతున్నాయి! మానవ చర్యల కారణంగా మూడింట రెండు వంతుల వన్యప్రాణులు 2020 నాటికి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో దాదాపు సగం వన్యప్రాణులు అంతర్థాన దశలో ఉన్నాయని తన ద్వైవార్షిక నివేదిక ‘ది లివింగ్ ప్లానెట్ రిపోర్ట్–2016’లో తేటతెల్లం చేసింది! – సాక్షి సెంట్రల్ డెస్క్
మానవ చర్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 1970–2020 మధ్య సగటున 67 శాతం తగ్గిపోనుందని నివేదిక అంచనా వేసింది. 1970–2012 మధ్య పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు, చేపలు, సరీసృపాల సంఖ్య 58 శాతం క్షీణించిందని పేర్కొంది. దీన్ని బట్టి 2020 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య మూడింట రెండు వంతులు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరోవైపు పర్యావరణంపై మానవుల ప్రభావాన్ని నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ఆవాసాల విధ్వంసం, అటవీ విస్తీర్ణం తగ్గడం, వన్యప్రాణులను వధించడం కొన్ని కారణాలుగా పేర్కొంది. మన ఆహార, ఇంధన వినియోగ మార్గాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఆవాసాల విధ్వంసం...
ప్రపంచ మొత్తం జీవజాలంలో సగం వాటా బ్రెజిల్, చైనా, యూఎస్, రష్యా, భారత్ దేశాలదే. ‘గ్లోబల్ బయోకెపాసిటీ హబ్‌్స’గా ఉన్న ఈ దేశాలు ఇతర దేశాలకు వనరులను ఎగుమతి చేసే ప్రాథమిక దేశాలుగా కూడా ఉన్నాయి. ఫలితంగా ఈ దేశాల్లోని జీవ వ్యవస్థలపై అధిక భారం పడుతోంది. ఇది ఆ జీవులు ఆవాసాలు కోల్పోవడానికి కారణమవుతోందని నివేదిక వెల్లడించింది. ఆవాసాల విధ్వంసం, వన్యప్రాణుల దోపిడీకి ఆహార ఉత్పత్తే ప్రాథమిక కారణమని తెలిపింది. జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ రవిసింగ్ పేర్కొన్నారు.
పర్యావరణ మార్పులు
► ఏడాదికి 1.30 మి.మీ. చొప్పున పెరుగుతున్న సముద్ర మట్టంతో భారత్ ప్రపంచంలో అత్యంత విపత్కర ప్రాంతంగా నిలవనుంది.
► ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ వంటి ప్రాంతాల్లో గత 40 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
► 2100 నాటికి సముద్ర మట్టం మీటరు పెరిగితే దేశంలో 14 వేల చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ముంపునకు
గురయ్యే ప్రమాదం ఉంది.
► వరదలు, కరువు, వేడిగాలులు వంటి విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలో 2000–15 మధ్య కాలంలో ఐదువేల మందికి పైగా మరణించారు.
భూతాపం ప్రభావం
కారణంగా 2080–2100 నాటికి ఆహార ఉత్పత్తి 10–40 శాతం
తగ్గుతుందని అంచనా.