స్వార్థం వల.. వన్యప్రాణి విలవిల | Wildlife Animals Deaths In Huters Hands | Sakshi
Sakshi News home page

స్వార్థం వల.. వన్యప్రాణి విలవిల

Published Sat, Feb 24 2018 11:07 AM | Last Updated on Sat, Feb 24 2018 11:07 AM

Wildlife Animals Deaths In Huters Hands - Sakshi

1. బంగారుపాళ్యం మండలంలో ఉరిలో పడిన చిరుత(ఫైల్‌) 2. క్రిష్ణగిరి అడవుల్లో రెండ్రోజుల క్రితం రైతు చంపిన చిరుత 3. ఎర్రావారిపాళ్యం మండలం కోటకాడిపల్లెవద్ద మృతిచెందిన ఏనుగు(ఫైల్‌)

అడవి అంటే.. పచ్చని చెట్లు.. గలగల పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల సవళ్ల గుర్తుకు వస్తాయన్నది నాటి మాట. కనుమరుగైన చినుకు జాడ.. ఎండిన నీటివనరులు.. ఆగని వేట.. విద్యుదాఘాతాలు.. ప్రమాదాలతో వన్యప్రాణుల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. అడవి జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో జీవవైవిధ్యానికి ఎసరొస్తోంది.

పలమనేరు: జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. రకరకాల కారణాలతో ఎప్పుడు దేని ప్రాణం పోతుందో తెలియదు. అరుదైన చిరుత పులులు సైతం ఇటీవల కాలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఇక మృత్యువాత పడుతున్న ఏనుగుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వన్యప్రాణులు, మృగాలకు సంబంధించి పటిష్టమైన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వన్యప్రాణి మనుగడ ప్రశ్నార్థకమైంది. జిల్లాలోని అడవుల్లో అమర్చిన ఉచ్చులు, నల్లమందు ఉండలు, నాటు తుపాకులతో ఆటోమేటిక్‌ ఫైరింగ్, అడవిని ఆనుకుని ఉన్న పొలాల్లో కరెంటు తీగలకు బలవుతూనే ఉన్నాయి. 

వన్య ప్రాణాలకు తప్పని ముప్పు
కొన్నాళ్లుగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతోంది. కొందరు నిత్యం అడవిలో వేటే జీవనోపాధిగా మార్చుకున్నారు. దీంతో అడవుల్లో నాటు తుపాకుల మోత తగ్గడం లేదు.  ఉరులు, నాటు బాంబులతో సైతం వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. అలాగే అటవీ శివారు ప్రాంతాల్లోని రైతులు అడవి జంతువుల బారి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి విద్యుత్‌ తీగలు అమర్చుతున్నారు. మేత, నీటి కోసం వస్తున్న వన్యప్రాణులు ఆ తీగలకు తగులుకుని మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రోజురోజుకీ వన్యప్రాణుల సంఖ్య క్షీణిస్తోంది.

ఐదేళ్లలో 12 ఏనుగులు, మూడు చిరుతలు మృతి
2013 నుంచి 2017వ సంవత్సరం మధ్య కాలంలో పది ఏనుగులు నీటి దొనల్లో పడి, విద్యుత్‌ షాక్, వ్యవసాయ బావులు మృతి చెందాయి. గతేదాడి కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగులు విద్యుదాఘాతానికి బలయ్యాయి. ఇటీవల ఎర్రావారిపాళెం మండలం కోటకాడిపల్లె వద్ద ఓ ఏనుగు మృతి చెందింది. చిరుతల విషయానికొస్తే గత జనవరిలో బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లె అటవీ ప్రాంతంలో ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మృతి చెందింది. ఐరాల మండలం మల్లార్లపల్లె వద్ద ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చుకు చిక్కింది. దీన్ని జూకి తరలించగా మృతి చెందింది. తాజాగా కుప్పం సరిహద్దులోని క్రిష్ణగిరి వద్ద ఓ చిరుతను ఓ వ్యక్తి కత్తితో నరికి చంపేశాడు. ఇప్పటికైనా అటవీశాఖ తగుచర్యలు తీసుకోవాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement