మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు! | RBKs as Plant Health Diagnostic Centres | Sakshi
Sakshi News home page

మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు!

Published Thu, Mar 23 2023 4:20 AM | Last Updated on Thu, Mar 23 2023 9:51 AM

RBKs as Plant Health Diagnostic Centres - Sakshi

సాక్షి, అమరావతి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు.. వీరు ఏటా భూసార పరీక్షలు చేయడమే కాదు.. భూసారాన్ని కాపాడేందుకు సిఫార్సు మేరకు తగిన సూక్ష్మపోషకాలందిస్తారు. విత్తు నుంచి కోత వరకు పంటలకు సోకే తెగుళ్లను గుర్తించి శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎంత మోతాదులో మందులు వాడాలో చెబుతారు.

దగ్గరుండి మొక్కలకు అందేలా చూస్తారు. నాణ్యమైన పంట దిగుబడులు సాధించడమే లక్ష్యంగా..దేశంలోనే తొలిసారిగా ఏపీలోని ఆర్బీకేల్లో ప్లాంట్‌ హెల్త్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి తొలుత మండలానికి ఓ ఆర్బీకేలో వీటి సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తొలి దశలో 670 ఆర్బీకేల పరిధిలో అమలు..
విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తోన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్లాంట్‌ హెల్త్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లు (పీహెచ్‌డీసీ)గా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేశారు.  భూసారం, నీటి, సూక్ష్మ పోషక లోపాలను గుర్తించేందుకు రైతు క్షేత్రం నుంచి నమూనాలు సేకరించి నిర్దేశిత గడువు లోగా ఫలితాలు అందించడమే కాకుండా.. సకాలంలో తగిన సలహాలు, సూచనలు అందించాలన్న లక్ష్యంతోనే ప్లాంట్‌ డాక్టర్‌ విధానానికి రాష్ట్ర ప్రభు­త్వం రూపకల్పన చేసింది.

తొలుత మండలానికి ఓ ఆర్బీకే పరిధిలో పీహెచ్‌డీసీ సేవలు అందుబా­టులోకి తీసుకురానున్నారు. ఈ విధంగా తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 670 ఆర్బీకేల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఆర్బీకేలలోనూ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఏప్రిల్‌ నుంచి ప్లాంట్‌ డాక్టర్స్‌గా శిక్షణ
పీహెచ్‌డీసీ ఏర్పాటుకు అనువైన భవనం, సౌక­ర్యాలు­న్న ఆర్బీకేలను ఎంపిక చేస్తారు. అగ్రికల్చర్, హార్టికల్చర్‌ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తయిన ఆర్బీకేల్లోని వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకుల (వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఎ)ను ఎంపిక చేస్తారు. వీరికి  జిల్లా స్థాయిలోని కేవీకే, ఏఆర్‌ఎస్, డాట్‌ సెంటర్లలో ఏప్రిల్‌–మే నెలల్లో కనీసం మూడు వారాల పాటు విడతల వారీగా పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు.

ఎంపిక చేసిన ఆర్బీకేల్లో అవసరమైన మినీ కిట్స్‌తో పాటు పంటల ఆధారిత లీఫ్‌ కలర్‌ (ఎల్‌సీసీ), సూక్ష్మ పోషక  లోపాల చార్ట్‌లను అందిస్తారు. ప్రత్యేకంగా. ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కోసం మొబైల్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు.

అగ్రి ల్యాబ్స్‌లో ఉచితంగా పరీక్షలు
స్థానికంగా పరీక్షించ తగ్గ వాటిని ఆర్బీకే స్థాయిలో పరీక్షిస్తారు. భూసారంతో పాటు సూక్ష్మపోషక లోపాలు, మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను నిర్ధారించేందుకు వాటి శాంపిల్స్‌ను సమీప వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు పంపిస్తారు. నిర్దేశిత గడువులోగా ఉచితంగా పరీక్షించి వాటి ఫలితాలను ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ మెసేజిల ద్వారా రైతులకు పంపిస్తారు. అవే ఫలితాలను సంబంధిత శాస్త్రవేత్తలకు పంపిస్తారు.

ఫలితాల ఆధారంగా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించే సిఫార్సులను రాత పూర్వకంగా రైతులకు అందిస్తారు. ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలో చెబుతారు. సామూహికంగా, వ్యక్తిగతంగా పాటించాల్సిన జాగ్రత్తలు, ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులపై పీహెచ్‌డీసీల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తారు.

సిఫార్సు మేరకు అవసరమైన సూక్ష్మ పోషకాలు, మందులు తగిన మోతాదులో అందేలా చూస్తారు. 2023–24లో కనీసం 5 లక్షల భూసార పరీక్షలు నిర్వహించి ప్రతీ రైతుకు ఈ పీహెచ్‌డీసీల ద్వారా సాయిల్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement