భూసార ‘పరీక్ష’
కర్నూలు(అగ్రికల్చర్), తొలకరి పలకరిస్తోంది. ఖరీఫ్ ఆశలు రేపుతోంది. ప్రాధాన్యత కలిగిన భూసార పరీక్షలు మాత్రం రైతులను వెక్కిరిస్తున్నాయి. రైతులు గుడ్డిగా రసాయన ఎరువులు వాడుతూ నష్టపోతున్న దృష్ట్యా ఈ పరీక్ష చేయించడం ఎంతైనా అవసరం. ఈ మేరకు ప్రణాళికా బద్ధంగా మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌లలో పరీక్షించి ఫలితాలను రైతులకు తెలియజేస్తే వారికి అంతోఇంతో ఉపయోగం చేకూరుతుంది. ఇదే సమయంలో దిగుబడులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఖరీఫ్ సాధారణ సాగు 5,85,351 హెక్టార్లు కాగా.. ఈ విడత 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగవనున్నాయి. అయితే మట్టి నమూనాల పరీక్ష మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపహాస్యమవుతోంది. వ్యవసాయ యంత్రాంగం భూసార పరీక్షలను సీరియస్‌గా తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మే నెల మొదటి వారంలో మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపినాపరీక్షకు నోచుకోకపోవడం గమనార్హం.
కర్నూలు సబ్ డివిజన్ నుంచి 806, డోన్ సబ్ డివిజన్ నుంచి 606, నందికొట్కూరు సబ్ డివిజన్ నుంచి 620, ఆత్మకూరు సబ్ డివిజన్ నుంచి 390, నంద్యాల సబ్ డివిజన్ నుంచి 1150, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ నుంచి 860, కోవెలకుంట్ల సబ్ డివిజన్ నుంచి 1080, ఆదోని సబ్ డివిజన్ నుంచి 1270, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ నుంచి 750, ఆలూరు సబ్ డివిజన్ నుంచి 960, పత్తికొండ సబ్ డివిజన్ నుంచి 460 ప్రకారం మట్టి నమూనాలు సేకరించారు. జిల్లాలో ఎమ్మిగనూరు, కర్నూలు, డోన్, నంద్యాలలో భూసార పరీక్ష కేంద్రాలు ఉండగా.. ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ ఆధ్వర్యంలో మిగిలినవన్నీ పని చేస్తున్నాయి. సేకరించిన మట్టి నమూనాల్లో 60 శాతం ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికే పంపారు. సాధారణంగా ఈపాటికే పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. ఎమ్మిగనూరు ఏడీఏ అలసత్వం కారణంగా మొత్తం 9,200 మట్టి నమూనాలు సేకరించగా ఇప్పటి వరకు 15 శాతం కూడా పరీక్షలకు నోచుకోని పరిస్థితి నెలకొంది. మిగిలిన వాటిని ఎప్పుడు పరీక్షిస్తారో.. ఫలితాలు రైతులకు ఎప్పటికి అందుతాయనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
ఏడీఏ నిర్లక్ష్యం ఫలితమే...
ఎమ్మిగనూరు ఏడీఏ నిర్లక్ష్యం వల్ల ఈ సారి భూసార పరీక్షలు అస్తవ్యస్తమయ్యాయి. ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన ఈయన పనితీరు ఆది నుంచి వివాదాస్పదమే. భూసార పరీక్ష కేంద్రాలు మార్కెట్ యార్డులలో నిర్వహిస్తుండగా.. కమిటీలు ఏడాదికి రూ.25వేల బడ్జెట్ కేటాయిస్తున్నాయి. ఈ మొత్తాన్ని వినియోగించిన తర్వాత యూసీలు ఇస్తే మళ్లీ బడ్జెట్ మంజూరవుతుంది. 2013-14 సంవత్సరానికి మార్కెట్ కమిటీలు బడ్జెట్ కేటాయించినా.. ఎమ్మిగనూరు ఏడీఏ యూసీలు ఇవ్వకపోవడంతో 2014-15 సంవత్సరానికి బడ్జెట్ మంజూరు కాని పరిస్థితి. ఫలితంగా పరీక్షల నిర్వహణకు కెమికల్ కొరత ఏర్పడింది. పరీక్ష ఫలితాల నమోదుకు రిజిస్టర్లు కూడా కరువయ్యాయి. ఆన్‌లైన్‌లో పెట్టేందుకు బడ్జెట్ కూడా లేకపోవడంతో పరీక్షలు అటకెక్కుతున్నాయి. డోన్‌లో లవణ పరిమాణం పరీక్షించే యంత్రం మొరాయించింది. దీంతో అక్కడ పరీక్షలు నిలిచిపోయాయి. కర్నూలులోని కేంద్రానికి 1800 మట్టి నమూనాలు చేరగా.. 500 మాత్రమే పరీక్షించారు. కర్నూలు మినహా ఎమ్మిగనూరు, డోన్, నంద్యాలలో నమూనాల పరీక్ష ఎక్కడికక్కడ నిలిచిపోయింది.