వద్దన్నా.. పత్తే! | this khareef season cotton Cultivated hikes | Sakshi
Sakshi News home page

వద్దన్నా.. పత్తే!

Published Sat, Jun 25 2016 12:23 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

వద్దన్నా.. పత్తే! - Sakshi

వద్దన్నా.. పత్తే!

తగ్గని రైతన్న మమకారం
‘తెల్ల’బోతున్న సర్కార్
సాగు మరింత పెరిగే అవకాశం
ఇప్పటికే 33 వేలకుపైగా హెక్టార్లలో సాగు
ధర మెరుపులతో.. రైతుల్లో ఆశలు


జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 1,22,436 హెక్టార్లు..
ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు సాగైనది 33,661 హెక్టార్లు..
గతేడాది ఈ సమయానికి పత్తి సాగు.. 43,000 హెక్టార్లు..
జిల్లాకు కేటాయించిన బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు 5 లక్షలకు పైగా..
ఇప్పటి వరకు రైతులు కొనుగోలు చేసినవి 2.6 లక్షలకు పైగా..

గజ్వేల్: ఈ లెక్కలు చాలు.. రైతుకు పత్తిపై మమకారం తగ్గలేదనడానికి! ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా.. గతేడాదితో పోలిస్తే ప్రస్తు తం సాగు తగ్గింది 10 వేల హెక్టార్లే.. ఇక, పత్తికి ప్రత్యామ్నాయమంటూ ప్రచారం చేసిన సోయాబీన్ ఇప్పటి వరకు 7,597 హెక్టార్లలోనే సాగులోకి వచ్చింది. విస్తృత ప్రచారంతో పత్తి సాగును తగ్గించాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా పాక్షిక స్పందనే లభిస్తున్నది.

 జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 100.5 మిల్లీమీటర్లు కాగా, 71.6 మి.మీ మాత్రమే నమోదైంది. 28.7 మి.మీ. వర్షపాతం లోటు ఉంది. మరోపక్క భూగర్భజలాలు అడుగంటి వరిసాగు గణనీయంగా పడిపోగా.. పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలుగా ఆవిర్భవించాయి. కొన్నేళ్లుగా ఈ రెండు పంటలే అత్యధిక విస్తీర్ణంలో సాగులోకి వస్తున్నాయి.  పత్తి అత్యధిక విస్తీర్ణంతో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తూ వస్తున్నది. ఈసారి అంతర్జాతీయ పత్తి మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా సీజన్‌లో ధర తగ్గొచ్చని, అందువల్ల సాగు తగ్గించాలని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం సాగించింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పత్తి తగ్గించాలంటూ రైతులకు పిలుపునిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే రైతు.. పత్తిసాగుకే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పంటతో ఏళ్ల తరబడి రైతులకు విడదీయరాని అనుబంధం ఉండటమే ఇందుకు కారణం. కాలం కలిసొస్తే రైతును స్థితిమంతుడిని చేయడమో, లేదా భారీ నష్టాలు చూపి కుంగదీయడమో ఈ పంట ప్రత్యేకత.

పత్తి పంటది రెండో స్థానం
పత్తికి ప్రత్యామ్నాయంగా సూచించిన సోయాబీన్‌కు జిల్లాలో ప్రధానంగా  జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఆదరణ ఉంది. ఈసారి పత్తి వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో మరింత పెరగొచ్చని అంచనా. ఇప్పటి వరకు జిల్లాలో సాగైన వివిధ పంటల పరిస్థితిని బట్టి మొక్కజొన్న తొలి స్థానాన్ని ఆక్రమించగా పత్తి రెండో స్థానంలో నిలిచింది. సోయాబీన్ నామమాత్రంగానే సాగవుతోంది. జూన్ మాదిరిగానే జూలైలోనూ వర్షపాతం బోటాబోటీగా ఉంటే.. పత్తి సాగు మరింత పెరగొచ్చు.

 ప్రచార పర్వం ఇలా...
అంతర్జాతీయ పత్తి మార్కెట్‌లో ఈసారి పత్తి ఎగుమతులకు అనువైన పరిస్థితుల్లేక.. గిట్టుబాటు ధర అటుంచి మద్దతు ధర కూడా వచ్చే అవకాశం లేదని, అందువల్ల పత్తి సాగు చేయొద్దని ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. ఈ క్రమంలో పత్తి పంటను ఏళ్ల క్రితమే జిల్లాకు పరిచయం చేసిన గజ్వేల్ మండలం రిమ్మనగూడలో మొదట సాగును తగ్గించి.. మిగతా గ్రామాలకు సందేశం ఇవ్వడానికి వ్యవసాయశాఖ ప్రయత్నించింది. పలు దఫాలుగా ఆ శాఖ ఉన్నతాధికారులు సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 శాతం సబ్సిడీపై సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేశారు. ఇంత చేసినా. సాగు కొంతవరకే తగ్గించగలిగారు.

 కో-మార్కెటింగ్‌పై కొరడా
పత్తి విత్తనాల విక్రయాలపైనా ప్రభుత్వం కన్నేసింది. విక్రయాల కట్టడి ద్వారా పత్తి సాగును తగ్గించాలనే లక్ష్యంతో కో-మార్కెటింగ్ విధానానికి ఈసారి అడ్డుకట్ట వేసింది. పత్తిని ఉత్పత్తి చేస్తున్న పదికి పైగా ప్రధాన కంపెనీల ఉత్పత్తులను.. వాటితోపాటు మరో 42కుపైగా కంపెనీలు కో-మార్కెటింగ్ చేస్తున్నాయి. కో-మార్కెటింగ్ పేరిట పెద్ద కంపెనీల విత్తనాలు అమ్మాల్సిన చిన్న కంపెనీలు.. సొంత బ్రాండ్లను మార్కెట్‌లోకి తెచ్చి నకిలీ వ్యాపారానికి పాల్పడుతున్నాయనే అనుమానం వ్యవసాయశాఖ వ్యక్తం చేస్తున్నది. ఈ విధానాన్ని ఇక నుంచి ఒప్పుకోమని స్పష్టం చేసిన ప్రభుత్వం.. కో-మార్కెటింగ్‌ను కట్టడి చేయాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ క్రమంలో ఈ నెల 6న గజ్వేల్ నియోజకవర్గంలో ఆ శాఖ నిఘా విభాగం అధికారులు రోజంతా తనిఖీలు చేపట్టి 3వేల విత్తన ప్యాకెట్లను సీజ్ చేసి, 15 మంది విత్తన డీలర్లకు నోటీసులు జారీ చేశారు. జిల్లా అంతటా ఈ దాడులు కొనసాగాయి.

 పత్తి సాగుకు కారణాలు
పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్.. లేకుంటే మొక్కజొన్న, ఇతర పప్పు దినుసులు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం పత్తి సాగు చేయటం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా..పెట్టుబడులకు ఢోకా ఉండదనే వాదనను తెరపైకి తెస్తున్నారు. స్వల్పకాలంలో చేతికొచ్చే సోయాబీన్ నల్లరేగిడి భూముల్లో సాగు చేస్తే.. పంట చేతికందే సెప్టెంబర్‌లో తీవ్రంగా వర్షాలు కురిస్తే బురద కారణంగా పొలంలోకి 15 రోజుల వరకు వెళ్లలేని పరిస్థితి ఉంటుందని, అందువల్ల సోయాబీన్‌లో మంచి దిగుబడులు వచ్చినా...

నూర్పిడి చేసుకోలేమనే వాదనను మే 2న రిమ్మనగూడలో పత్తికి వ్యతిరేకంగా జరిగిన ప్రచార సభలో రైతులు వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయ డీడీ ఝాన్సీలక్షీ, జేడీఏ మాధవీశ్రీలతకు తెలిపారు. ఒక వేళ..మొక్కజొన్న సాగు చేస్తే కీలక దశల్లో వానలు లేకపోతే పంట పూర్తిగా నాశమవుతుందని చెప్పారు. పత్తి ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకుంటుందని, పెట్టుబడికైనా గ్యారెంటీ ఉంటుం దని వివరించారు. చాలామంది రైతులు ఇదే భావనతో ఉన్నారు.

 పత్తి ధర మెరుపులు.. రైతుల్లో ఆశలు
పత్తి క్వింటాలు ధర కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో ఇటీవల రూ. 6,020, వరంగల్ మార్కెట్‌లో రూ.6వేల వరకు పలికిందని పత్రికల్లో వచ్చిన వార్తలు రైతుల్లో ఆశలను రేకిత్తిస్తున్నాయి. సర్కార్ సాగు వద్దంటూ ప్రచారం ముమ్మరం చేసిన తరుణంలోనే ఒక్కడ్నే కదా.. మిగతా వారు వేయరు కదా...అని ఎవరికి వారే అనుకొని సాగుకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వం ప్రచారం వల్ల ఈసారి సాగు తగ్గి తక్కువ ఉత్పత్తులు వస్తాయి.. ఈ తరుణంలో మేం సాగు చేస్తే మంచి ధర రావచ్చనే ఆలోచనతో ఉన్నారు.

సోయాబీన్ కంటే పత్తే నయం..
సోయాబీన్ కంటే పత్తి సాగు మేలు. సర్కార్ పత్తి వేయొద్దని చెప్పిండ్రు కానీ పత్తి పంట వానలు వచ్చిన రాకపోయినా పండుతుంది. మొక్కజొన్న పంట అయితే కంకులు పేట్టే యాళ్లకు చినుకు లేకపోతే పెట్టుబడి కూడా రాదు. అదే పత్తి అయితే పెట్టుబడి అయినా వస్తాది. నాకున్నా పది ఎకరాల్లో రెండు ఎకరాల్లో మొక్కజొన్న వేసిన మిగత వాటిల్లో పత్తి పెట్టిన. 
- కొంతం సాయిలు, రైతు, తిమ్మాపూర్, జగదేవ్‌పూర్

పత్తి సాగు తగ్గుతుందని భావిస్తున్నాం
జిల్లాలో పత్తి సాగును తగ్గించాలని రైతులను చైతన్య పరిచాం. అందువల్ల గతేడాది ఈ సమయానికి 43వేల హెక్టార్లలో పత్తి సాగులోకి వస్తే...ఈసారి 10వేల హెక్టార్ల తగ్గింది. విత్తనాలు వేసుకోవడానికి ఇంకా సమయం ఉంది.. ఏదేమైనా గతేడాదితో పోలీస్తే మాత్రం సాగు విస్తీర్ణం తగ్గుతుందని భావిస్తున్నాం.  కంది, సోయాబీన్ సాగు ఈసారి గణనీయంగా పెరగనుంది.
- మాధవీశ్రీలత, వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement