సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్
తెల్ల పూల పంట రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది! మొన్న వర్షాలు ముంచేయగా.. నిన్న గులాబీ రంగు పురుగు తొలిచేసింది.. ఈ రెండింటితోనే సగం మంది పత్తి రైతులు కుదేలవగా.. ఇప్పుడు మార్కెట్ మాయాజాలం చుట్టేసింది. తేమ సాకు పేరుతో దళారులు ధరను తెగ్గోస్తున్నారు. అటు ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన భారతీయ పత్తి సంస్థ(సీసీఐ) కూడా నిబంధనలను చూపుతూ రైతును గాలికొదిలేస్తోంది. కనీస ‘మద్దతు’ కరువవడంతో కడుపు మండిన రైతులు కొన్నిచోట్ల ఆందోళనకు దిగుతుంటే.. మరికొన్నిచోట్ల మౌనంగా బతుకునే చాలిస్తున్నారు.
మంగళవారం రాష్ట్రంలో ముగ్గురు రైతులు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో పత్తి రైతులు ఇద్దరున్నారు. మరో రైతు వరి సాగు చేసి అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలని, తేమ శాతాన్ని సవరించాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాసినా అక్కడ్నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు. రాష్ట్ర ప్రభుత్వమే పత్తికి బోనస్ ప్రకటించాలని ప్రతిపక్షాలతోపాటు ఇటు అధికార పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
రైతన్న చితికిపోయాడు ఇలా..
ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఈసారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా పత్తిని సాగు చేశారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి ఏకంగా 47.72 లక్షల (114%) ఎకరాల్లో సాగైంది. 2016లో పత్తి వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతో కేవలం 31 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. కానీ గతేడాది పత్తికి మార్కెట్లో డిమాండ్ పెరిగి మంచి రేటు రావడంతో ఈసారి రైతులంతా పత్తి వైపు మొగ్గు చూపారు. గతేడాది కంటే అదనంగా 16 లక్షల ఎకరాలకు పైగా పత్తిని వేశారు. పత్తిపై దృష్టి పెట్టిన రైతులు ఆహారధాన్యాలను పట్టించుకోలేదు. దీంతో ఈసారి ఏకంగా 8 లక్షల ఎకరాల ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గింది.
వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి 19.07 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇలా పత్తిని నమ్ముకున్న రైతుల ఆశలను భారీ వర్షాలు చిదిమేశాయి. అదనులోగాకుండా పంట చేతికొచ్చే సమయంలో కురిసి లక్షలాది ఎకరాల్లో పత్తికి నష్టం చేకూర్చాయి. దీనికితోడు గులాబీరంగు పురుగు దాదాపు 10 లక్షల ఎకరాలను సర్వనాశనం చేసిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గులాబీ రంగు సోకడం, వర్షాలకు పత్తి నల్ల రంగులోకి మారడంతో వ్యాపారులు క్వింటాకు రూ.1500–3000కు మించి కొనుగోలు చేయడంలేదు. అంతేకాదు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.4,320 ఉన్నా.. నాణ్యమైన పత్తిని కూడా తేమ శాతం పేరుతో రూ.3300–4000 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలు కూడా తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తిరస్కరిస్తున్నాయి.
ఇవేం ప్రమాణాలు?
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తడిసిన పత్తికి ఎంఎస్‌పీ ఇచ్చే పరిస్థితి ఉండదని వ్యాపారులు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పత్తి 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ. 4,320కు, 9 శాతం ఉంటే రూ. 4,277కు, 10 శాతముంటే రూ. 4,234, 11 శాతం ఉంటే రూ. 4,190కి, 12 శాతం ఉంటే రూ. 4,147కు కొనుగోలు చేయాలి. కానీ ప్రస్తుతం వర్షాల కారణంగా అనేకచోట్ల 20 శాతం వరకు తేమ ఉండటం, తడిసిపోవడంతో వ్యాపారులు అత్యంత తక్కువ ధరకు కొంటున్నారు. ప్రమాణాల ప్రకారం పత్తి లేకుంటే సీసీఐ కూడా కొనుగోలు చేయడంలేదు. వాస్తవానికి ఇటీవలి వర్షాలతో గాలిలో తేమ ఎక్కువగా ఉంది. దీంతో పత్తిలో తేమ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తేమను 20 శాతానికి పెంచాల్సింది పోయి అధికారులు నిబంధనలను పట్టుకొని వేలాడుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.
పత్తి వేసి.. చితికిపోయి..
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల గ్రామానికి సానమోని మల్లయ్య (39) నాలుగు ఎకరాల్లో రెండు, మూడేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం రూ.లక్ష అప్పు చేశాడు. అది వడ్డీతో సహా రూ.1.50 లక్షలకు చేరింది. ఈసారి మళ్లీ మూడెకరాల్లో పత్తి, ఒక ఎకరాలో మొక్కజొన్న వేశాడు. ఇందుకు మరో రూ.50 వేల అప్పు చేశాడు. ఈసారి తెగుళ్లు ఆశించడంతో పాటు అకాల వర్షాలతో దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించ లేదు. కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. దీనికితోడు అప్పులు రూ.2 లక్షలకు చేరాయి. వాటికి వడ్డీ కట్టే స్థాయిలో కూడా దిగుబడి రాకపోవడతంతో మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం తన పొలంలోనే పురుగుల మందు తాగి పడిపోయాడు. హుటాహుటినా తోటి రైతులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి.. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మల్లయ్య మృతి చెందాడు.
రైతును మింగిన అప్పు..
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెరభీమనపల్లికి చెందిన నడిమింటి నరేశ్ (32) తన రెండు ఎకరాలతోపాటు మరో ఆరెకరాలను కౌలుకు తీసుకుని రెండేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ.8 లక్షల అప్పు చేశాడు. రెండేళ్లుగా దిగుబడి ఆశాజనకంగా లేదు. తీసుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోయింది. దీంతో దిక్కుతోచక సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
పురుగుల మందు తాగి..
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామానికి చెందిన పూజారి వీరేశం (37) ఎకరంతో పాటు మరో నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొత్తం ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. నెలకిందట తన పెద్ద కుమార్తె వివాహం కోసం రూ.2.50 లక్షల అప్పు చేశాడు. కానీ.. పంట దెబ్బతినడంతో మనస్తాపానికి గురయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మంగళవారం పంట పొలం వద్దే గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రోడ్డెక్కిన పత్తి రైతు..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో పత్తి రైతులు కన్నెర్ర జేశారు. తేమ శాతం అధికంగా ఉందంటూ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారు కావేరి జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో మంగళవారం పత్తి కొనుగోలు చేయలేదు. దీంతో ఆగ్రహించిన సుమారు రెండొందల మంది రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గంట పాటు రైతుల ఆందోళన కొనసాగడంతో ఐదు కి.మీ. మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
గుర్తింపు కార్డులేవీ..?
పత్తి రైతులకు గుర్తింపు కార్డుల జారీలో ఆలస్యం జరుగుతోంది. సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో అనేకచోట్ల కార్డులు అప్‌లోడ్ కావడం లేదు. దీంతో ఇప్పటివరకు పత్తి రైతుల గుర్తింపు కార్డుల జారీ జరగలేదు. ఈ కార్డుంటేనే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని అమ్ముకోవచ్చు. లేదంటే కుదరదు. కార్డులు లేకున్నా రైతుల మొబైల్ ఫోన్ నంబర్‌ను నమోదు చేస్తే వారి కార్డు వివరాలు వస్తాయని, ఆ ప్రకారం కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ చెప్పినా చాలాచోట్ల అమలు కావడం లేదని రైతులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment