టైటిల్: డాకు మహారాజ్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులు
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: బాబీ కొల్లి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్
విడుదల తేది: జనవరి 12, 2025
కథేంటంటే..
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు.
చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్‌లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.
బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్‌లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్‌ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది.
ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది.
చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్‌లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది.
బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్‌ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment