నేలకొండపల్లి: ఏటా మట్టి నమూనా పరీక్షలు చేయించుకోకపోవడం.. భూసారం తగ్గిపోవడం.. దిగుబడులపై ప్రభావం చూపడం.. పురుగు మందులు ఇష్టానుసారంగా వాడడం.. ఇలా వ్యవసాయ భూముల్లో పంటలు వేసిన రైతులు ఆశించిన దిగుబడి రాక నష్టాల పాలయ్యేవారు. పరీక్షల కోసం మట్టిని జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌లకు పంపించాల్సి రావడంతో రైతులు వెనుకాడేవారు.
వారి ఇబ్బందులను తీర్చేందుకు.. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకునేలా ప్రో త్సహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. వ్యవసాయాధికారుల బృందంతో భూసార పరీక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించడం.. పరీక్ష ల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించడం వంటి చర్యలు చేపట్టింది. మట్టి పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 92 మినీ ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో భూసార పరీక్షలు గ్రామానికి ఒకరిద్దరు రైతులు మాత్రమే చేయించుకునే వారు.
వ్యవసాయంపై ఆసక్తి ఉండి.. కొద్దోగొప్పో అవగాహన ఉండి.. చదువుకున్న రైతులు మాత్రమే దీనికి మొగ్గు చూపేవారు. అయితే చేలల్లో మట్టి నమూనాలు సేకరించడంపై అవగాహన లేకపోవడం.. పరీక్షల వల్ల కలిగే లాభాల గురించి పూర్తిగా తెలియకపోవడం.. మట్టి నమూనాలను పరీక్షించేందుకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపాల్సి రావడం వంటి కారణాలతో పరీక్షలపై ఆసక్తి ఉన్న కొద్దిమంది రైతులు కూడా ఇదంతా ఎందుకులే అని వెనుకాడేవారు. అక్కడక్కడ రైతులు ఎవరైనా తమ చేలల్లోని మట్టి నమూనాలకు జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు పంపించినా.. ఫలితాల కోసం నెలలతరబడి వేచి చూడాల్సి వచ్చేది.
దీంతో భూసార పరీక్షల ఫలితాలు రైతులకు సకాలంలో అందకపోగా.. రైతులు కూడా తమ పక్క రైతులు వాడే ఎరువులనే ఇష్టారీతిగా పంటలపై వాడేవారు. దీనివల్ల దిగుబడి పెరగడం మాట అటుంచితే.. పెట్టుబడులు తడిసి మోపెడయ్యేవి. దీర్ఘకాలంగా ఒకే రకమైన రసాయన ఎరువులు వాడడంతో భూసారం తగ్గడంతోపాటు నేలలు నిర్జీవంగా తయారయ్యే పరిస్థితులు ఏర్పడేవి.
ఈ క్రమంలో సాగులో నిమగ్నమైన రైతులు ఏళ్లుగా ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చేది. పంటపై పెట్టిన పెట్టుబడులు పూడకపోగా.. అప్పుల పాలైన సందర్భాలున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మారిన పరిస్థితుల నేపథ్యంలో రైతుల్లో మట్టి పరీక్షలపై అవగాహన పెరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు మండలస్థాయిలో మట్టి పరీక్షల కోసం మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో భూసార పరీక్షలు చేయించుకునేందుకు రైతులు ముందుకొస్తున్నారు
92 మినీ ల్యాబ్‌లు
గతంలో మట్టి పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా కేంద్రంలోని ప్రధాన ల్యాబ్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే రైతులకు దీని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం, దూర ప్రయాణం చేయాల్సి రావడం, ఫలితాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడంతో రైతులు మట్టి పరీక్షలపై అంతగా ఆసక్తి కనబరిచేవారు కాదు. ప్రస్తుతం మండల కేంద్రాల్లో, క్లస్టర్లవారీగా 92 మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఖమ్మం, సత్తుపల్లిలో ప్రధాన ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఏఈఓల ఆధ్వర్యంలో..
క్లస్టర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినీ ల్యాబ్‌ల నిర్వహణ బాధ్యతను ఏఈఓలకు అప్పగించారు. ఇందుకోసం ఏఈఓలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. రైతులు తమ పంట భూముల నుంచి తెచ్చిన మట్టిని ఇక్కడ పరీక్షించి.. ఒక్క రోజులోనే ఫలితం చెప్పే విధంగా వెసులుబాటు కల్పించారు. ల్యాబ్‌లో మట్టిలోని గాఢత, లవణీయత, సేంద్రియ, కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియంతోపాటు నేలలో ఉన్న సూక్ష్మపోషకాల శాతాన్ని అధికారులు లెక్కిస్తారు. అనంతరం రైతులకు నివేదికలు అందిస్తారు. దీని ఆధారంగా రైతులు వేసిన పంటలకు ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి.. ఎప్పుడెప్పుడు వేయాలి.. ఎలాంటి పంటలు వేయాలనే వివరాలను రైతులకు సూచిస్తారు. దీంతో పంటలపై తగిన మోతాదులో ఎరువులు వాడి ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా రైతులు లాభాలు సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
గ్రామాల్లో రైతులకు మట్టి పరీక్షల సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో క్లస్టర్ పరిధిలో మినీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. మట్టి పరీక్షలు చేసి.. రైతులకు నివేదికలు అందిస్తారు. శిక్షణ పొందిన ఏఈఓలు ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పోషకాల శాతం ఆధారంగా అవసరమైన మేరకు మాత్రమే బయటి ఎరువులు వేసుకోవాలి. దీని ద్వారా పెట్టుబడి తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. – ఎస్‌వీకే.నారాయణరావు, వ్యవసాయాధికారి, నేలకొండపల్లి
రైతులకు వరం లాంటిది..
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో మట్టి పరీక్ష ల్యాబ్‌లను రైతుల చెంతకు తెచ్చింది. మినీ ల్యాబ్‌ల ఏర్పాటు రైతులకు వరం లాంటిది. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుని.. అధికారులు చెప్పిన నివేదిక ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలి. ఎరువులు వాడాలి. తెలంగాణ రైతాంగం ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. – మేకల వెంకటేశ్వర్లు, రైతు సమితి కన్వీనర్, కోనాయిగూడెం
Comments
Please login to add a commentAdd a comment