సాక్షి, వరంగల్ రూరల్ : నేలతల్లి ఆరోగ్యంగా ఉంటేనే బంగారు పంటలు పండుతాయి. నేటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గి రసాయనిక ఎరువుల వాడకం పెరగడంతో భూసారం దెబ్బతిని ఆశించిన దిగుబడులు రావడం లేదు. ఈ నేపథ్యంలో నేల సారాన్ని బట్టి ఎరువులు వాడాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. ఇందుకోసం ప్రతి రైతు మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని తెలుపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ సార పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వాడితే అధిక దిగుబడులు వస్తాయని ఆయా తెగులు రాకుండా ఉంటాయని వ్యవసాయ అధికారులు రైతులకు ఎంతగా చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు.
తమకు తోచిన విధంగా విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించి అధిక మోతాదులో పంటలకు ఎరువులను వాడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. భూసార పరీక్షల ఆవశ్యకత గురించి రైతులకు వివరించి వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను వాడి అధిక దిగుబడులు సాధించే విధంగా చైతన్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రాంతాల వారీగా క్రాఫ్ కాలనీలను ఏర్పాటు చేయించి అక్కడ పండించే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. ప్రతి జిల్లాలో ఒక్కో మండలంలో ప్రయోగాత్మకంగా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉండే రైతులందరి పంట పొలాల్లో మట్టి నమునాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫలితాల ఆధారంగా సలహాలు
జిల్లాలో గత వారం రోజులుగా వ్యవసాయ శాఖ అధికారలు రైతుల పంట పొలాల వద్దకు వెళ్లి మట్టి నమునాలను సేకరిస్తున్నారు. మట్టి నమునాల సేకరణ పూర్తి చేసి ఈ నెలాఖరులోగా వాటి ఫలితాలను కార్డుల రూపంలో అందించనున్నారు. భూసార పరీక్షల్లో వచ్చే ఫలితాల మేరకు రైతులు పండించే పంటలకు ఎంత మోతాదులో ఏ ఎరువులు వాడాలో వ్యవసాయ అధికారులు రైతులకు సూచించనున్నారు.
అంతేగాకుండా వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇక నుంచి ఫర్టిలైజర్ షాపులకు రైతులు నేరుగా వచ్చి ఎరువులు కొనుగోలు చేయకుండా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. అధికారుల ప్రిస్కిప్షన్ ద్వారానే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని 16 మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో నీటి వసతి గల భూములు 3707.75 హెక్టార్లు, వర్షాధారంగా సాగయ్యే భూములు 1896.24 హెక్టార్లు, మొత్తం 5603.99 హెక్టార్ల భూమి ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములను 5496 మంది రైతులు కలిగి ఉన్నారు.
ఈ నెల 27 వరకు పూర్తి
ఒక రైతుకు ఎంత భూమి ఉన్నా ఆ భూమిలో మట్టి నమునాలు సేకరించనున్నారు. సేకరించిన మట్టి నమునాలను వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం గల ల్యాబ్‌కు పంపనున్నారు. కొన్నింటిని మినీ వ్యవసాయ కిట్ల ద్వారా పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 27 వరకు పరీక్షలు పూర్తి చేసి ఆ మరుసటి రోజు నుంచి భూసార పరీక్షల ఫలితాల కార్డులను రైతులకు అందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లోని రైతుల పంట పొలాల మట్టి నమునాలను సేకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment