హన్మకొండ: వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పంట కాలనీలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది. ఇందుకోసం మార్గాలను ఆధ్యయనం చేసేందుకు పంటల సమగ్ర సర్వే చేపట్టాలని నిర్ణయించి సేకరించాల్సిన అంశాలతో ప్రొఫార్మా రూపొందించింది. జిల్లాలో వ్యవసాయ శాఖ పం టల సమగ్ర సర్వే ప్రారంభమైంది. వ్యవసాయ విస్తరణాధికారులు సేకరించిన రైతుల వివ రాలను ప్రభుత్వం రూపొందించిన ప్రొఫార్మాల్లో పొందుపరుస్తున్నారు.
మరోసారి సమగ్ర సర్వే..
తెలంగాణ ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే, భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు, రైతు బీమా పథకాల కోసం చేసినట్లుగానే మరో సమ గ్ర సర్వేకు సిద్ధమైంది. రైతుల ఆదాయాన్ని రెట్టిం పు చేయాలనే ఉద్దేశంతో వారు సాగు చేస్తున్న పంటల వివరాలు సాగునీటి వసతి, భూవివరాల వంటి మొత్తం 39 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా పంట కాలనీలు, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తెలుసుకునేందుకు ఈ సర్వేను ప్రభుత్వం చేపడుతోంది.
దీని ఆధారంగా ఏ గ్రామంలో పంట కాలనీలు నెలకొల్పాలి, ఏ పంటలు పండించాలనేది నిర్ధారించనున్నారు. అలాగే స్థానికంగా పండిన పంటలతో ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. జిల్లాలో 75 వేల మంది రైతులు ఉన్నారు. జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన ప్రకారం 3,17,483 ఎకరాల భూమి ఉండగా వ్యవసాయ యోగ్యమైన భూమి 2,19,413 ఎకరాలు ఉంది. ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పెసర, పత్తి, శనగ వంటి పంటలను అధికంగా సాగుచేస్తున్నారు.
వచ్చే నెల 15లోగా పూర్తి..
పంటల సమగ్ర సర్వే మే నెల 15లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకొని జిల్లా వ్యవసాయ శాఖ ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియ చేపట్టే బాధ్యతను వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించింది. ఈ సర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా పంట కాలనీలకు నెలకొల్పి రైతుకు వ్యవసాయంపై నిత్యం అవగాహన కల్పిస్తూ సాగు చేయించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. పంట కాలనీ ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్య సేద్యం, కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్‌లైన్ చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, డీటీబీ పద్ధతిలో రాయితీ చెల్లింపు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుకు ఈ సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోనున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ అనుబంధ ఇతర ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. రైతులు పండించిన పంటను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కనీస మద్దతు ధరకు అమ్ముకునేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిసింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తద్వారా నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
సర్వేలో సేకరించనున్న అంశాలు
పంటల సమగ్ర సర్వేలో రైతుల నుంచి 39 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. రైతు పట్టాదారు పాసుబుక్ నెంబర్, రైతు పేరు, తండ్రి పేరు, పురుషుడు లేక స్త్రీ అనే వివరాలు, ధరణి పోర్టర్‌లో ఆధార్ నంబర్‌తో లింక్ చేశారా లేదా, పుట్టిన తేదీ, సెల్‌ఫోన్ నంబర్, బ్యాంక్, ఖాతా వివరాలు, సామాజిక స్థితి వివరాలు, రైతు భూమి వివరాలు సేకరించి ఫార్మాట్‌లోని పార్ట్ ‘ఏ’ (మొదటి పేజీ)లో నమోదు చేస్తారు.
పార్ట్ ‘బీ’లో...
ఇక సర్వేలో భాగంగా పార్ట్ ‘బీ’లో పలు అంశాలను నమోదు చేస్తారు. సాగుకు భూమి ఎంత ఉంది... ఏ సర్వే నెంబర్‌లో ఎంత భూమి ఉంది. ఇందులో వ్యవసాయానికి అనువుగా ఉందా, సాగు నీటి వివరాలు. సాగు నీటికి దేని మీద ఆధారపడుతున్నారు అనేది తెలుసుకుంటారు. ఇంకా మట్టి పరీక్షల వివరాలు, గత ఖరీఫ్‌లో ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన పంటలను సాగు చేశారు, దిగుబడి ఎంత.. ఈసారి యాసంగిలో వేసిన పంటల వివరాలు.. పండ్ల తోటల పెంపకం, చెట్ల వయస్సు, సర్వే నంబర్ల వారీగా సాగు, సాధిస్తున్న దిగుబడి నమోదు చేస్తారు.
అంతేకాకుండా వచ్చే ఏడాది ఖరీఫ్‌లో ఏయే పంటలను వేయాలని అనుకుంటున్నారనేది కూడా ఆరా తీస్తారు. వీటికి తోడు యంత్రాల వాడకం, బ్యాంకు రుణాలు, పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారా.. ఎలాంటి ఫోన్ వాడుతున్నారనేది కూడా తెలుసుకుంటారు. అలాగే, కిసాన్ సువిధ, పంటల యాజమాన్యం యాప్‌లు, కిసాన్ పోర్టల్, కిసాన్ కాల్‌సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్‌పై అవగా హన ఉండా, లేదా అనే అంశాలతో పాటు పశువులు, గొర్రెల సంఖ్య, సేంద్రియ వ్యవసాయంపై ఏ మేరకు తెలుసనే వివరాలను కూడా వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇంటి వద్దకు వెళ్లి సేకరించి నిర్ణీత ఫార్మాట్‌లో పొందుపర్చాక ప్రభుత్వానికి నివేదించనున్నారు.
రైతుల పూర్తి వివరాలు సేకరిస్తాం..
పంటల సమగ్ర సర్వేలో రైతు నుంచి పూర్తి వివరాలు సేకరిస్తాం. ఈ బాధ్యతను వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించాం. వారు పని చేస్తున్న ప్రాంతాల్లోని ప్రతి రైతును నేరుగా కలిసి మొత్తం 39 అంశాలపై వివరాలు సేకరించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరుస్తారు. వెంటనే ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తాం. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment