బర్డ్‌చిప్‌తో అధిక దిగుబడులు | high yield with a /birdchip | Sakshi

బర్డ్‌చిప్‌తో అధిక దిగుబడులు

Published Mon, Sep 15 2014 11:20 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

జహీరాబాద్ ప్రాంతంలోని రైతులు అధిక విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేస్తున్నారు.

 జహీరాబాద్ టౌన్:  జహీరాబాద్ ప్రాంతంలోని రైతులు అధిక విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేస్తున్నారు. పట్టణంలోని ట్రైడెంట్ చక్కర కర్మాగారం పరిధిలో 25 వేల ఎకరాల్లో ఇది సాగవుతోంది. అయితే ఆశించిన దిగుబడులు రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్న సమయంలో వచ్చిన ‘బర్డ్‌చిప్’ విధానం మంచి ఫలితాలనిస్తోంది. ఈ పద్ధతిన పంట సాగుకు ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తోంది. 2011 సంవత్సరంలో ఈ విధానానికి  శ్రీకారం చుట్టింది.

 చెరకు గడల కణుపులతో చేపట్టే పంట సాగునే బర్డ్‌చిప్ విధానం అని పిలుస్తున్నారు. దీని వల్ల పిలకలు అధిక మొత్తంలో రావడంతో మంచి దిగుబడులు వస్తున్నాయి. ఫలితంగా రైతులు ఎకరాకు 55 నుంచి 65 టన్నుల మేర దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పద్ధతిపై కర్మాగారం సీనియర్ మేనేజర్ రామారావు (9441597806) అందించిన వివరాలు.. 86032 చెరకు వంగడాన్ని తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గల రాజశ్రీ చక్కెర కర్మాగారం వ్యవసాయ పొలంలో టిష్యూ కల్చర్ విధానంలో మొక్కలను పెంచుతున్నారు. వీటిని జహీరాబాద్‌కు తీసుకొచ్చి ఇక్కడి   నర్సరీలో ప్రత్యేకంగా పెంచుతున్నారు.

 పెరిగిన చెరకు గడలనుంచి కణుపులను సేకరించి బర్డ్‌చిప్ విధానంలో మొక్కలను పెంచి రైతులకు అందజేస్త్తున్నారు. ఈ మొలకల ద్వారా పెరిగిన చెరకును పంట సాగు కోసం రైతులు విత్తనంగా వాడి మంచి దిగుబడులు పొందుతున్నారు. ఈ పద్ధతిలో సుమారు వంద ఎకరాల్లో చెరకు పంట సాగులోకి వచ్చిందన్నారు. చాలా మంది రైతులు అధిక దిగుబడులు సాధించారని, యాజమాన్య పద్ధతులను అవలంబిస్తే ఎకరాకు 70 టన్నులకు పైగా పంట దిగుబడులను సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.

 మొక్కకు భారీ సంఖ్యలో పిలకలు...
  చెరకు మొక్కల నుంచి సేకరించిన కణుపులను బర్డ్ చిప్ విధానంలో సాగు చేయడంతో ఒక్కో మొక్కకు భారీ సంఖ్యలో పిలకలు వస్తాయి. సహజంగా చెరకు గడలను ముక్కలు చేసి నాటితే ఒక్క మొక్కకు 5 నుంచి 8కి మించి పిలకలు రావు. కానీ బర్డ్‌చిప్ విధానంలో నాటిన ఒక్కో మొక్కకు 15 నుంచి 20కి పైగా పిలకలు వస్తున్నాయి. వీటన్నింటినీ బతికించుకునేందుకు వీలుగా తగినంత నీరు, పోషకాలను అందిస్తే ఎకరాకు 70 టన్నుల మేర పంట దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. బర్డ్‌చిప్ ద్వారా అందజేస్తున్న మొలకల ద్వారా లభించే చెరకును  మరుసటి సంవత్సరంలో సాగు కోసం వినియోగించుకోవచ్చు.  

 మిగిలిన చెరకును చక్కెర ఉత్పత్తి కోసం కర్మాగారానికి సరఫరా చేసుకోవచ్చు.  రైతులు ఈ పద్ధతిని పాటించి పంట దిగుబడి పెంచుకోవాలనిఫ్యాక్టరీ నిర్వాహకులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement