సమగ్ర చర్యలే మందు!
పాడి-పంట: వివిధ రకాల పండ్ల తోటలపై బాక్టీరియా తెగుళ్లు దాడి చేస్తుంటాయి. వీటి కారణంగా పంటకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. రైతులు ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి పండ్ల తోటల రైతులు బాక్టీరియా తెగుళ్లపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని, వాటిని సకాలంలో గుర్తించాలి. సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నివారించాలి. అప్పుడే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం లభిస్తాయి.
అరటిలో...
పెద్ద పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలకు బాక్టీరియా దుంపకుళ్లు తెగులు ఎక్కువగా సోకుతుంది. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే తెగులు ఉధృతి అధికమవుతుంది. చిన్న మొక్కలతో పాటు పెద్ద మొక్కల్ని కూడా ఈ తెగులు నష్టపరుస్తుంది. ముందుగా కాండం మొదలులో భూమికి దగ్గరగా... అంటే కాండం, దుంప కలిసే భాగంలో... కుళ్లు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత దుంప క్రమేపీ కుళ్లిపోతుంది. కొత్తగా నాటిన పిలకలకు తెగులు సోకితే మొవ్వు ఆకు కూడా కుళ్లి, మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కల్లో కాండం మీద నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పైభాగం నుంచి కుళ్లిన వాసన వస్తుంది. కింది వరుస ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. చివరికి ఆకులన్నీ ఎండిపోయి, మొక్క చనిపోతుంది. మొక్కల పిలకలకు కూడా తెగులు సోకే అవకాశం ఉంది.
ఈ తెగులు నివారణకు వేసవిలో తోటకు సరిపడా నీరు అందించాలి. ఆరోగ్యంగా ఉన్న తోటల నుంచి మాత్రమే పిలకల్ని సేకరించి నాటాలి. పిలకల్ని మందు ద్రావణంలో (కాపర్ ఆక్సీక్లోరైడ్+మోనోక్రొటోఫాస్) ముంచి ఆరబెట్టి, ఆ తర్వాతే నాటాలి. వరి, చెరకు వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం ద్వారా తెగులును నివారించవచ్చు. తెగులు సోకిన మొక్కల్ని దుంపలతో సహా తీసేసి, తోట బయట చిన్న చిన్న ముక్కలుగా నరికి, ఎండుగడ్డి వేసి తగలబెట్టాలి. మొక్కలు తీసేసిన చోట, ఆ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కల మొదళ్ల వద్ద బ్లీచింగ్ పొడి ద్రావణాన్ని (లీటరు నీటికి 25 గ్రాముల చొప్పున కలపాలి) మట్టి బాగా తడిసేలా పోయాలి.
నిమ్మలో...
నిమ్మ తోటల్ని బాక్టీరియా గజ్జి తెగులు ఎక్కువగా నష్టపరుస్తుంది. తెగులు సోకిన తోటల్లో లేత ఆకులు, చిన్న-పెద్ద కొమ్మలు, కాయలు, కాండం మీద మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే చెట్లు ఎండిపోతాయి. తెగులు సోకిన చెట్ల మీద ఎండుపుల్లలు ఎక్కువగా కన్పిస్తాయి. ఈ తెగులును ‘బాలాజీ’ రకం బాగా తట్టుకుంటుంది కాబట్టి దానిని సాగు చేయడం మంచిది. తోటలో తెగులు సోకిన కొమ్మల్ని కత్తిరించాలి. ఆ తర్వాత 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ చొప్పున కలిపి వర్షాకాలంలో 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. చెట్టు మొదలు పైన, పెద్ద కొమ్మల పైన తెగులు లక్షణాలు కన్పిస్తే బెరడును కత్తితో గోకి బోర్డో పేస్టు పూయాలి.
దానిమ్మలో...
దానిమ్మ తోటలకు సోకే తెగుళ్లలో బాక్టీరియా మచ్చ తెగులు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు జూలై-అక్టోబర్ నెలల మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు 27 నుంచి 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఉన్నప్పుడు, గాలిలో తేమ 70 శాతానికి పైగా ఉన్నప్పుడు దాడి చేస్తుంది. అంతేకాదు... వేసవిలో కురిసే అకాల వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు కూడా తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. తెగులు సోకిన చెట్లకు అంటుకడితే నర్సరీ దశలోనే తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన తోటల్లో ఆకులు, కొమ్మలు, పిందెల పైన ముందుగా నీటి మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి క్రమేపీ పెద్దవై ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. దీంతో ఆకులు రాలిపోతాయి. కొమ్మలు కణుపుల వద్ద విరుగుతాయి. కాయల పైన ఏర్పడిన మచ్చలు నలుపు రంగుకు మారతాయి. కాయలపై ఇంగ్లీషు ‘వై’ లేదా ‘యల్’ ఆకారంలో పగుళ్లు కన్పిస్తాయి.
బాక్టీరియా మచ్చ తెగులును నివారించాలంటే ఆరోగ్యవంతమైన అంటు మొక్కలు నాటాలి. తెగులు సోకిన కొమ్మల భాగాల్ని అంగుళం కింది వరకూ కత్తిరించి, తోట బయట కాల్చేయాలి. కత్తిరింపులకు ముందు కత్తెర్లను 1% సోడియం హైఫోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. కత్తిరింపులు పూర్తయిన వెంటనే మొక్కలపై 1% బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.
రసాయన ఎరువుల్ని సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. వాటితో పాటు జింక్, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ ధాతువుల్ని కూడా అందిస్తే చెట్లకు తెగుళ్లను తట్టుకునే సామర్ధ్యం చేకూరుతుంది. తెగులు సోకిన కాయల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే లీటరు నీటికి 200 మిల్లీగ్రాముల స్ట్రెప్టోసైక్లిన్+3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
- డాక్టర్ ఎం.రాజా నాయక్, శాస్త్రవేత్త
ఉద్యాన పరిశోధనా కేంద్రం, విజయరాయి
పశ్చిమ గోదావరి జిల్లా