పెరటి కోళ్లతో జీవనోపాధి.. 10 వేల యూనిట్లు టార్గెట్‌ | YSR Kranthi Patham: Backyard Poultry Farming Scheme for Women in Prakasam District | Sakshi
Sakshi News home page

పెరటి కోళ్లతో జీవనోపాధి.. 10 వేల యూనిట్లు టార్గెట్‌

Published Tue, Jun 21 2022 6:15 PM | Last Updated on Tue, Jun 21 2022 9:21 PM

YSR Kranthi Patham: Backyard Poultry Farming Scheme for Women in Prakasam District - Sakshi

ఒకప్పుడు పల్లెల్లోనే నాటు కోళ్లు సందడి చేసేవి. కోడి కూతతోనే గ్రామాల్లో ప్రజలు మేల్కొనేవారు. ప్రతీ ఇంట్లో 10 నుంచి 15 కోళ్లు ఉండేవి. నాటు కోడి గుడ్లు, మాంసంతో వారి జీవనోపాధికి చేదోడుగా నిలిచేవి. ప్రజలకు ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా దన్నుగా నిలిచిన వీటి పెంపకం క్రమంగా తగ్గుతూ వచ్చింది. పల్లెలో పట్టణ వాతావరణం వ్యాపించడంతో వీటి స్థానంలో బ్రాయిలర్‌ కోళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఒకవైపు నాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పెరటి కోళ్ల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్సార్‌ క్రాంతి పథం ద్వారా జిల్లాలో పదివేల యూనిట్లు అందజేసే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

చీమకుర్తి(ప్రకాశం జిల్లా): డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లో ఆసక్తి చూపే మహిళలకు రూ.4800 విలువ చేసే పెరటి కోళ్ల యూనిట్‌ను వడ్డీ లేని రుణం కింద అందించనుంది. ఒక్కో యూనిట్‌ కింద 9 కోడి పెట్టలు, 3 కోడిపుంజులు, వాటి పెంపకానికి అవసరమైన 30 కేజీల దాణాను మొత్తం కలిపి కూడా రూ.4800కే అందిస్తోంది. 9 కోడిపెట్టలు వరుసగా 100 గుడ్లు వరకు పెడుతుంది. రెండేళ్ల తర్వాత ఒక్కో కోడి కనీసం 2 కేజీల మాంసం అందిస్తుంది.

ఈ విధంగా 12 కోళ్ల ద్వారా 24 కేజీల మాంసం వస్తుంది. నాటుకోడి కేజీ మాంసం ధర రూ.400 పలుకుతుందని అధికారుల అంచనా. ఇలా 24 కేజీల నుంచి రూ.9,600 ఆదాయం వస్తుంది. అలాగే కోడిగుడ్లు, మాంసంతో కలిపి రెండేళ్లలో కనీసం రూ.12 వేల ఆదాయం లభిస్తుంది. వచ్చిన ఆదాయంలో వైఎస్సార్‌ క్రాంతి పథం గ్రూపులకు 24 లేక 36 వాయిదాలలో వడ్డీ లేకుండా రుణం కింద ఇచ్చిన రూ.4800ను నెల నెలా చెల్లించగా, ఇంకా దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు లాభసాటిగా ఉంటుంది.  

అనంతపురం నుంచి దిగుమతి
డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా అందించే నాటుకోళ్లను అనంతపురంలోనున్న ఎస్సెల్‌ బ్రీడ్‌ కంపెనీ వారి ద్వారా దిగుమతి చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి కనీసం 10 వేల యూనిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  త్వరలో పెరటి కోళ్ల పెంపకంతో పాటు పొట్టేళ్లు, మేకలను కూడా ఒక్కో కుటుంబానికి ఒక యూనిట్‌ను అందించేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామని పీడీ తెలిపారు.  

జీవనోపాధికి ఇప్పటికే పలు పథకాలు
జిల్లాలో డీఆర్‌డీఏ సంస్థ ద్వారా వైఎస్సార్‌ క్రాంతి పథకం నుంచి గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళల జీవనోపాధి కోసం ఇప్పటికే పలు పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తూ వారి జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దానికోసం డీఆర్‌డీఏలో ఉన్న సుమారు రూ.200 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. దానిలో భాగంగా స్త్రీనిధి, ఉన్నతి (ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌), సీఐఎప్‌ (కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌), హెచ్‌డీఐఎఫ్‌ (హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) పథకాలను అందిస్తోంది. స్త్రీనిధితో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయల వరకు జీవనోపాధి పెంపునకు అందిస్తుంది. వాటి ద్వారా గొర్రెలు, గేదెలను పెంచుకోవచ్చు.

ఉన్నతి పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే సబ్‌ప్లాన్‌ పథకం నుంచి అందిస్తారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఒక్కో వ్యక్తికి రూ.50 వేల వరకు రుణ సదుపాయం వడ్డీలేకుండానే అందిస్తారు. సీఐఎఫ్‌ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలను ఇస్తారు. అయితే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కేటాయించాల్సి ఉంటుంది. హెచ్‌డీఐఎఫ్‌ ద్వారా గరిష్టంగా రూ.50 వేలను హెల్త్‌ యాక్టివిటీ కింద ముందుగానే ఎంపిక చేసిన 15 మండలాల్లో మాత్రమే అందిస్తున్నారు. వాటితో పాటు వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ తోడు వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి.   

జిల్లాలో 10 వేల యూనిట్ల వరకు పంపిణీకి సిద్ధం
జిల్లాలోని 38 మండలాల్లో రానున్న ఏడాది లోపు 10 వేల యూనిట్లను పంపిణీ చేసేందుకు  వైఎస్సార్‌ క్రాంతిపథం సిద్ధమవుతోంది. మొదటి విడతగా 4 వేల యూనిట్లను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కనిగిరి మండలాల్లో దాదాపు 600 యూనిట్లకు పైగా పంపిణీ చేశారు.

10 వేల యూనిట్ల పెరటి కోళ్లు అందించేందుకు చర్యలు
జిల్లాలో పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించిన 10 వేల యూనిట్లను డ్వాక్రా మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో యూనిట్‌ ద్వారా 9 కోడిపెట్టలు, 3 కోడిపుంజులు, 30 కేజీల దాణాలను అందిస్తున్నాం. ఈ సంవత్సరం 4 వేల యూనిట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 6 మండలాల్లో అందించాం. త్వరలో పొట్టేళ్లు, మేకలను కూడా అందించేందుకు యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాం.  
– బీ.బాబూరావు, పీడీ, డీఆర్‌డీఏ, ఒంగోలు 

మా కుటుంబంలోనే 4 యూనిట్లను తీసుకున్నాం 
జగనన్న పేద మహిళల ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకొచ్చిన పెరటి కోళ్ల పెంపకం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. మా కుటుంబంలోనే నాతో పాటు నా కుమార్తె, కోడలు వేరువేరుగా 4 యూనిట్లను తీసుకున్నాం. మా ఎస్సీ కాలనీలో మొత్తం 30 యూనిట్లను ఇచ్చారు. పెరటి కోళ్ల వలన గుడ్లు, మాంసం ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంలో జీవనోపాధి పెరగటమే కాకుండా ఖర్చులకు ఉపయోగపడుతుంది.  
– జంగాల లలిత కుమారి, ఆశాజ్యోతి గ్రూపు, మద్దులూరు, సంతనూతలపాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement