రెండు వందల కోట్లు.. ఏటా అమ్ముడయ్యే టీషర్ట్‌ల సంఖ్య ఇది. 440 పార్ట్స్ పర్ మిలియన్.. రికార్డుస్థాయికి చేరిన వాతావరణ కాలుష్యానికి ఓ లెక్క ఇది. టీషర్ట్‌లకు.. కాలుష్యానికి సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా..! ఇప్పటివరకూ లేదు.. ఇకపై మాత్రం బోలెడంత ఉంటుంది. ఎందుకంటారా? టీషర్ట్ వేసుకుంటే కాలుష్యం తగ్గిపోతుంది కాబట్టి..!!!
ఆగండాగండి.. మీరు మామూలుగా వేసుకునే టీషర్ట్‌తో ప్రయోజనం ఒక్కటే. ఒళ్లు కప్పుతుందంతే. అదే ఈ ఫొటోలో చూపించిన టీషర్ట్ వాడటం మొదలుపెట్టారనుకోండి. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లు గాల్లోని కాలుష్యాన్ని కూడా శుభ్రం చేసేయొవచ్చు. ఇటలీ కంపెనీ క్లాటర్స్ తయారు చేసిన ఈ వినూత్న టీషర్ట్ పేరు ‘రిపేయిర్’. ఛాతీ భాగంలో మూడు పొరలు ఉన్న వస్త్రాన్ని ఉంచుకుంటే చాలు.. మీరు అటు ఇటూ కదిలేటప్పుడు సోకే గాలిలో ఉండే ప్రమాదకరమైన విషవాయువులను పీల్చేసు కుంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే విడుదలయ్యేలా చేస్తుంది. ఫ్యాషన్ ఆసరాగా కాలుష్యంపై అవగాహన పెంచడం రిపేయిర్ అభివృద్ధి వెనుక ఉన్న లక్ష్యమని అంటున్నారు క్లాటర్స్ వ్యవస్థాపకులు ఫెడ్రికో సురియా, మార్కో లోగ్రీకో, సిల్వియో పెరుకాలు.
మూడు పొరలు.. ఆరు రకాల కాలుష్యాలు..
రిపేయిర్ టీషర్ట్ ఛాతీ భాగంలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని ‘ద బ్రీత్’అని పిలుస్తున్నారు. అనిమోటెక్ అనే కంపెనీ తయారు చేసింది దీన్ని. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులో మూడు పొరలు ఉంటాయి. ఒక్కోటి అతిసూక్ష్మమైన జల్లెడలాంటిది. ఎంత సూక్ష్మమంటే.. నానోస్థాయిలో ఉండే కాలుష్యాలను కూడా ఒడిసి పట్టగలిగేంత. గాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్‌లు, బెంజీన్ వంటి ప్రమాదకరమైన, కేన్సర్ కారకమైన వాయువులు ఒక పొరలోని జల్లెడలో చిక్కుకుపోతాయి. రెండోపొరలో ఉన్న ప్రత్యేకమైన పోగులు బ్యాక్టీరియాను చంపేస్తాయి. మూడో పొరకు దుర్వాసనలను పీల్చేసుకునే లక్షణం ఉంటుంది. ఈ మూడు ఒక్కటిగా పనిచేయడం ద్వారా ఎక్కడికక్కడ గాలి శుభ్రమవుతూంటుంది.
స్వచ్ఛమైన గాలి మాత్రమే బయటకు వస్తూంటుంది. అనిమోటెక్ ద బ్రీత్‌ను ఇప్పటికే యూనివర్సిటీ పాలిటెక్నికా డెల్లే మార్సేలో పరీక్షించింది కూడా. సల్ఫర్ డయాక్సైడ్లను ఈ వస్త్రం 92 శాతం వరకూ ఒడిసి పట్టగలదని.. అదే సమయంలో నైట్రోజన్ ఆక్సైడ్లను 86 శాతం, ప్రమాదకరమైన సేంద్రీయ కణాలను 97 శాతం వరకూ తనలో నిక్షిప్తం చేసుకోగలదని ఈ పరీక్షల్లో రుజువైంది. టీషర్ట్‌లోని పొరలో పెట్టుకునే ద బ్రీత్‌ను ఏడాదికి ఒకసారి మార్చుకుంటే చాలు. ఎలాంటి శక్తిని వాడకుండా గాలిని శుభ్రం చేస్తూ ఉండవచ్చు. ద బ్రీత్‌ను ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫయర్ల మాదిరిగా, బహిరంగ ప్రదేశాల్లో భారీ హోర్డింగ్‌లపై ప్రకటనల కోసమూ వాడుకోవచ్చని అనిమోటెక్ అంటోంది.
ఒక టీషర్ట్.. రెండు కార్ల కాలుష్యం..
ద బ్రీత్‌తో కూడిన రిపేయిర్ టీషర్ట్‌ను ఏడాదిపాటు వాడితే దాదాపు రెండు కార్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చని క్లాటర్స్ అంటోంది. భూమ్మీద మొత్తం వంద కోట్ల కార్లు ఉన్నాయనుకుంటే.. రెండు వందల కోట్ల టీషర్ట్‌లలో ద బ్రీత్ ఏర్పాటైతే వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుందని ఫెడ్రికో సురియా అంటున్నారు. క్లాటర్స్ ప్రస్తుతం నిధుల సేకరణ కోసం కిక్‌స్టార్టర్‌లో ప్రత్యేకమైన ప్రచారాన్ని చేపట్టింది. ఒక్కో రిపేయిర్ టీషర్ట్‌ను 29 యూరోల (రూ.2,400)కు అమ్ముతోంది. వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తే దీని ధర రూ.3,600 అవుతుందని సురియా అంటున్నారు. ఇంకొన్ని నెలల్లో టీషర్ట్‌లతోపాటు ట్రాక్ సూట్లు, జాకెట్లను విడుదల చేస్తామని చెబుతున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment